
భార్గవ్‌రెడ్డి మృతదేహాం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు (ఫైల్)
‘మాకు బాగా చదవాలని ఉంటుంది. ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఎక్కడుంది? క్యాంపస్‌లో నిర్బంధించి చదివిస్తున్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు చూపంతా పుస్తకం పైనే. ఆకలి తీర్చుకునేందుకు అర గంట కూడా సమయం ఇవ్వరు. ఇదేంటని గొంతు పెగిలిందా టార్గెట్ చేసి నిత్యం వేధింపులే. తోటి విద్యార్థుల ముందు మానసిక వేధింపులు. ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు’.. ఇదీ విజయవాడ రూరల్ ప్రాంతంలోని నిడమానూరులో ఉన్న శ్రీచైతన్య కళాశాల విద్యార్థి రాకేష్ (పేరు మార్చాం) ఆవేదన.. ఇది ఈ ఒక్క విద్యార్థి బాధే అనుకుంటే పొరపాటే. ఇంటర్ కార్పొరేట్ కళాశాలల్లో కొనసాగుతున్న మరణ మృదంగం వెనుక ఉన్న మానసిక వేదన ఇది.
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలోని శ్రీచైతన్య విద్యా సంస్థలో గురువారం అర్ధరాత్రి జరిగిన విద్యార్థి ఆత్మహత్యపై ఆ కళాశాల విద్యార్థులను కదలిస్తే కన్నీటి బాధలు వెలుగు చూశాయి. తోటి విద్యార్థి మరణం వెనుక ఉన్న వాస్తవాలు చెప్పేందుకు శనివారం ఏకంగా వారు ‘సాక్షి’ కార్యాలయానికి క్యూ కట్టారు. కళాశాల క్యాంపస్‌లో వారు పడుతున్న మానసిక వేదనను కళ్లకు కట్టినట్లు వివరించారు. విజయవాడ రూరల్ ప్రాంతం నిడమానూరు శ్రీచైతన్య కళాశాల (శాంత భవన్)లో వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భార్గవ్‌రెడ్డి ఆత్మహత్య వెనుక తీవ్రమైన మానసిక వేదన కారణమని విద్యార్థులు చెప్పారు. మూడు రోజుల క్రితం భార్గవరెడ్డి మెస్ నుంచి ఆలస్యంగా క్లాస్ రూంకు వచ్చాడు.
అదే పెద్ద తప్పుగా భావించిన కళాశాల కోఆర్డినేటర్ గిరిధర్, వైస్ ప్రిన్సిపాల్ నాగభూషణం ఆ విద్యార్థిని మానసికంగా వేధించారు. తెలివైన విద్యార్థి కావడంతో త్రీ స్టార్ సెక్షన్‌లో భార్గవ్ ఉండేవాడు. అయితే అక్కడ నుంచి ఐసీ వన్ సెక్షన్‌కు మార్చడంతో ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయాడు. చిన్న తప్పుకే ఇంత పెద్ద శిక్ష విధించారంటూ తాను ఇక ఉండలేనని, చనిపోతానని స్నేహితుల వద్ద వాపోవడంతో వారు సముదాయించారు. గదిలో నిద్రించాల్సిన విద్యార్థి క్లాస్ రూంకు వెళ్లి కుమిలి కుమిలి ఏడ్చి చివరకు గదిలో ఉరి తాడుకు వేలాడాడు.
లేఖను మార్చేశారు..
భార్గవ్‌రెడ్డి ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ ఓ లేఖ రాసినట్లు విద్యార్థులు తెలిపారు. గిరిధర్, నాగభూషణం వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. విద్యార్థి లేఖను గమనించిన యాజమాన్యం వెంటనే దానిని దాచేసింది. భార్గవ్ చనిపోయిన విషయం శుక్రవారం ఉదయం 6 గంటలకే చదువుకునేందుకు క్లాస్‌రూంకు వెళ్లిన ఓ విద్యార్థి గమనించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. విషయం ముందుగా పోలీసులకు తెలపాల్సి ఉన్నా యాజమాన్యం మాత్రం మృతదేహాన్ని దింపి ఆటోలో ఆస్పత్రికి తరలించి తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించినట్లు విద్యార్థులు వివరించారు.
వేధింపులు ఇలా..
శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడితో పాటు వేధింపులూ ఉన్నాయి. కళాశాలలోని శాంత భవన్‌లో సుమారు 2500 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో బాగా చదివే విద్యార్థులకు ఒక విధమైన గౌరవం, మిగిలిన వారికి మరో విధమైన గౌరవం ఉంటుంది. కశాశాలలో నాలుగు ఫ్లోర్లు ఉంటే మొదటి, రెండవ ఫ్లోర్‌లలో మాత్రం చదివే విద్యార్థులను (సూపర్ 60, సీఐపీఎల్ సెక్షన్స్) మాత్రమే ఉంచుతారు. ఆపై రెండు ఫ్లోర్‌లలో ఐకాన్ సెక్షన్ పేరుతో మధ్యస్థంగా చదివే విద్యార్థులను ఉంచుతారు. అందరి వద్ద ఒకే రకమైన ఫీజులు తీసుకొనే యాజమాన్యం.. విద్యార్థులను విడదీసి విద్యాభోదన చేస్తోంది. అక్కడ పనిచేసే అధ్యాపకుల నుంచి కో ఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ వరకు అందరూ విద్యార్థులపై కర్ర పెత్తనం చేసేవారు. ఉదయం 5 గంటల నుంచి మొదలయ్యే వారి దినచర్య రాత్రి 11 వరకు చదువుతోనే కొనసాగుతుంది.
భోజనం విషయంలో కూడా విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. రోజూ పప్పు, పచ్చడి, మజ్జిగ, చారు నీళ్లతోనే సరిపెట్టుకోవాలి. వారానికి రెండు రోజులు గుడ్డు, ఒక రోజు వంద గ్రాముల చికెన్ ఇదీ మెనూ. అన్ లిమిటెడ్ భోజనం అని చెప్పే యాజమాన్యం కడుపు నిండా పెట్టే పరిస్థితి లేదు. కళాశాలలో విద్యార్థుల గొంతు పెగిలితే వారిని టార్గెట్ చేస్తారు. వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసి నరకం చూపుతారు. ఇటీవల కోఆర్డినేటర్ గిరిధర్.. తను చెప్పిన మాట వినలేదని చేతికి అందిన రాయితో ముగ్గురు విద్యార్థులును మోదాడు. ఒక విద్యార్థికి ముక్కు అదిరి రక్తం వచ్చింది. తల్లిదండ్రులకు చెబితే మరింతగా టార్గెట్ చేస్తానని భయపెట్టి చివరకు మెట్లపై పడి దెబ్బ తగిలినట్టు చెప్పించినట్లు విద్యార్థులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment