సాక్షి, హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో, తోటి విద్యార్థులు బయట వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, సాత్విక్ పోస్టుమార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సాత్విక్ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ స్పందించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్‌ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్ స్ట్రెస్‌కి గురిచేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సాత్విక్ మృతితో శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment