సీఐడీ అదుపులో వాసుబాబు
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ (మెడికల్) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులు శ్రీచైతన్య కాలేజీల డీన్ ఓలేటి వాసుబాబు(ఏ–89), ఏజెంట్ శివ నారాయణ రావు(ఏ90)లను మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గత గురువారమే సీఐడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వాసుబాబును శ్రీచైతన్య యాజమాన్యం సస్పెండ్ చేసింది.
వాసుబాబు రిమాండ్ రిపోర్టు సాక్షికి అందింది. ఈ రిపోర్ట్‌లో కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొడుకు మెడిసిన్ సీటు కోసమే వాసుబాబు 2015లో తొలి సారి ఈ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ సందీప్‌కుమార్‌ను కలిసాడని తెలుస్తోంది. 2016లో అతని కొడుకుకు కర్ణాటకలో మెడిసిన్ సీటు లభించిందని, ఈ పరిచయంతోనే సందీప్ హైదరాబాద్‌కు వచ్చినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఈ తరుణంలోనే చైతన్య కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో సందీప్ ఒక్కో విద్యార్థికి రూ.36 లక్షలు చోప్పున బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు తీసుకున్నాడు. ఈ లీకేజీ వ్యవహారంపై గుంటూరు శివనారయణకు కూడా సమాచారం అందించడంతో.. గుంటూరు నుంచి మరో ముగ్గురు విద్యార్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విద్యార్థులను భువనేశ్వర్ క్యాంప్‌కు తరలించారు.
ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 64 మంది అరెస్ట్‌కాగా 26 మంది పరారీలో ఉన్నారు. తాజాగా మరో పది మంది నిందితులను సీఐడీ గుర్తించింది. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 100కు చేరింది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల బెంగళూరు, ముంబై, పుణె, షిర్డీ, కోల్‌కతా, భువనేశ్వర్‌ల్లో క్యాంపులు నిర్వహించనట్లు సీఐడీ గుర్తించింది. 85 మందిని సాక్ష్యులుగా చూపిన సీఐడీ.. వీరిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులను కూడా సాక్ష్యులుగా చూపింది.
Comments
Please login to add a commentAdd a comment