సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు. ఈ స్కాంతో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు సంబంధాలున్నాయని తెలంగాణ సీఐడీ పోలీసులు నిర్ధారించారు. ఆయా కాలేజీల్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...ఎంసెట్ పేపర్ లీకేజీ స్కాం ప్రధాన నిందితులతో సంబంధాలున్న వాసుబాబును హైదరాబాద్‌లో, శివనారాయణను గుంటూరులో అరెస్టు చేశామని చెప్పారు. చైతన్య కాలేజీలకు డీన్‌గా వ్యవహరిస్తున్న వాసుబాబును ఎ-89, మరో నిందితుడు శివనారాయణ ఎ-90గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ధనుంజయ ఠాకూర్, సందీప్ కుమార్‌లతో వీరిద్దరూ టచ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఆరుగురు విద్యార్థులకు ర్యాంకులు రావడానికి వాసుబాబు, శివనారాయణ ప్రధాన నిందితులతో ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 36 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురికి టాప్ ర్యాంకులు వచ్చాయని అన్నారు. ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా నిందితులను గుర్తించామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment