పేపర్ల లీకేజీలకు కేరాఫ్ రాజగోపాల్
► అనేక పేపర్ల లీకేజీలో సూత్రధారి
► 2007 నుంచి ఇదే దందా.. పలు కేసులు నమోదు
► ఎన్టీఆర్ వర్సిటీ పీజీమెట్-2014 లీకేజీలోనూ కీలక పాత్ర
హైదరాబాద్: ఎంసెట్-2 లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజగోపాల్‌రెడ్డికి... ప్రశ్నపత్రాలు లీకు చేయడంలో ఆరితేరాడు. ఇప్పటివరకు అతడిపై ప్రశ్నపత్రాల లీకులకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయ బ్యాంకులో పనిచేసి 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. విద్యారంగంలో అనేక మందితో పరిచయాలు పెంచుకొని 2007 నుంచి ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఆరి తేరాడు.
బెంగళూరు కేంద్రంగా ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని స్థాపించిన రాజగోపాల్‌రెడ్డి... ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తుంటాడు. కర్ణాటకలో 2007 నుంచి నాలుగు ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ స్కామ్‌లో ఇతడు సూత్రధారి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజీలోనూ ఇతడిదే కీలక పాత్ర. కర్ణాటకలో 2007 నుంచి 2013 మధ్య నాలుగు లీకేజీలకు పాల్పడి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్-2007) ప్రశ్నపత్రం లీకే జీ, కన్సార్షియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2001) బోగస్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులతో సహా బెంగళూరు సీబీఐ, సెంట్రల్, హెచ్‌ఎస్‌ఆర్ లేజౌట్, జయనగర్ పోలీసు స్టేషన్లలో ఇతడిపై కేసులున్నాయి. 2014 పీజీమెట్ లీకేజీలోనూ కేసు నమోదైంది.