Nutritional problem
-
చిన్నారుల్లో ఎదుగుదల డీలా!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపున్న పిల్లల్లో శారీరక ఎదుగుదలలేమి ఆందోళనకరంగా ఉంది. పౌష్టికాహార సమస్యల కారణంగా 35 శాతం మంది చిన్నారుల్లో ఎదుగుదల మందగించింది. దీంతో వయసుకు తగినట్లుగా శారీరక ఎత్తు ఉండటంలేదు. అలాంటివారిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చనే ఆందోళన ఉంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేస్తుంటారు. నెలవారీగా ఆ వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టులకు, రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తుంటారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే చిన్నారుల్లో 17.05 శాతం మంది వయసుకు తగిన ఎత్తు లేరని తేలింది. మరో 18.52 శాతం మందిలో కూడా ఎత్తుకు తగిన బరువు లేనప్పటికీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. 64.43 శాతం మందిలో మాత్రం వయసుకు తగిన శారీరక ఎదుగుదల నమోదైంది. పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యత్యాసం 33 జిల్లాలో పరిధిలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 12.96 లక్షలమంది చిన్నారుల వయసు, ఎత్తును తూచి అంచనాలు రూపొందించారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాల్లోని చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో ఉన్నట్లు కనిపిస్తోంది. వయసుకు తగిన ఎత్తు లేకుండా ఎక్కువ వ్యత్యాసంతో ఉన్న చిన్నారులు రాష్ట్రవ్యాప్తంగా 17.05 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర సగటు కంటే ఎక్కువశాతం చిన్నారులు గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 28.23 శాతం మంది చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో నారాయణపేట్(24.79%), మహబూబ్‌నగర్(21%), వికారాబాద్(26.78%), ఆదిలాబాద్(23.79%), కామారెడ్డి(21.29%), మెదక్(20.61%) జిల్లాలున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే... సాధారణంగా చిన్నారుల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. మానసిక ఎదుగుదలతోపాటు శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే సరైన పౌష్టికాహారాన్ని అందించాలి. కానీ, చాలాచోట్ల చిన్నారులకు ఒకేరకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిశీలనలు చెబుతున్నాయి. నిత్యం ఒకేరకమైన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఇస్తుండటంతో కేవలం కొన్నిరకాల ప్రోటీన్లు, విటమిన్లు మాత్రమే అందుతాయి. శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందాలంటే భిన్నరకాలైన ఆహారాన్ని తగిన మోతాదులో అందించాలి. ఈ అంశాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన ఉండటంలేదు. దీంతో ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కూడా విస్తృత ప్రచార కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు కిశోర్ ఈగ ‘సాక్షి’తో అన్నారు. -
బాలలను వెంటాడుతున్నపౌష్టికాహార లోపం
జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతోంది. వైద్యుల వద్దకు తీసుకెళ్తే చిన్నారిలో పోషకాహార లోపం ఉందని చెప్పారు. దీనివల్లే తరచూ అనారోగ్యానికి గురవుతోందని నిర్ధారించారు. ఆ పాప వయసును బట్టి చూస్తే.. 10 కిలోల వరకు బరువు ఉండాలి. కానీ ఆరున్నర కిలోలు మాత్రమే ఉంది. ఈ ఒక్క చిన్నారే కాదు.. జిల్లాలోని చాలా మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చలాకీగా ఆడుతూ.. పాడుతూ ఎదగాల్సిన బాల్యం పోషకాహార లేమితో బక్కచిక్కి పోతోంది. అధికారులు బయటకు చెప్పకపోయినా జిల్లాలో రక్తహీనత.. పోషకాహార లోపంతో మరణించే వారి సంఖ్య అధికమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పోషకార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న పిల్లల సంఖ్య 1849 కాగా అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది. సాక్షి కడప : బాల్యం పౌష్టికాహారం కొరతతో హాహాకారాలు చేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులు ఆనందంగా ఎగరలేని పరిస్థితి. ఆటలు ఆడాలని ఉన్నా.. పాటలు పాడాలని ఉన్నా... ఏమీ చేయలేని నిస్సహాయత... అందరిలాగా ఉత్సాహంగా ఉరకలెత్తాలనే ఆశ ఉన్నా బాల్యంపై రక్తహీనత నాట్యం చేస్తోంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు వారి మనసుల్లో పుట్టుకొస్తున్నా పౌష్టికాహార లోపం అనే రోగం వారిని నిత్యం కుంగదీస్తోంది. వయస్సు పెరుగుతున్నా.. బరువు మాత్రం పెరగకుండా అనారోగ్యం చిన్నారులను చిదిమేస్తోంది. ఒకవైపు పేదరికం.. మరోవైపు అధికసంతానం...ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో పిల్లలకు సక్రమంగా... సంపూర్ణంగా ఆహారం అందించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే చిక్కి శల్యమవుతున్న పిల్లలను చూస్తూ.. ఏమీ చేయలేని దీనస్థితిని తలుచుకుంటూనే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పథకాల పేరుతో హడావుడి చేస్తున్నా... పాలకులు కంప్యూటర్ యుగంలో ఆకాశాన్ని తాకేలా అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల ఫలం పూర్తి స్థాయిలో అందక అల్లాడిపోతున్న బాలల దయనీయ స్థితిని బాలల దినోత్సవం రోజైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వేటాడుతున్న పౌష్టికాహార లోపం జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉండగా, 1,74,212 మంది చిన్నారులు ఉన్నారు. 0–1 నెలల చిన్నారులు 22,814 మంది ఉండగా, 1–3 నెలల చిన్నారులు 73,824 మంది, 3–6 నెలల చిన్నారులు 77,574 మంది జిల్లాలోఉన్నారు. అయితే ఇందులో రక్తహీనతతో వేలాది మంది చిన్నారులు బాధపడుతున్నారు. పౌష్టికాహారం పేదరికంపై పడగవిప్పి నాట్యం చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నా పిల్లలకు పూర్తి స్థాయిలో అందలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణ చిన్నారుల కంటే కూడా లోపంతో ఉన్న చిన్నారులకు అధికంగా ఇస్తున్నామని సంబంధిత శాఖలు చెబుతున్నా వాస్తవ పరిస్థితిలో చిన్నారుల ఎదుగుదల అంతంత మాత్రంగా ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారులను శాసిస్తున్న మరణం జిల్లాలో పౌష్టికాహార లోపం జబ్బుకు గురిచేస్తే...ఆ వ్యాధి కాస్త చిన్నారులను బలి తీసుకుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారిని కాపాడలేకపోతున్నారు. హంగు, ఆర్భాటాలకు లక్షలాది రూపాయలు తగలేస్తున్నా కళ్లెదుటే సరైన ఆహారం లేక తనువు చాలిస్తున్న చిన్నారుల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రధానంగా జిల్లా యంత్రాంగం చిన్నారుల మరణాలపై కూడా ›ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. బాలలకు అందించాల్సిన పౌష్టికాహార విషయంలో రాజీలేని ధోరణి అవలంబించి చిన్నారుల ప్రాణాలు కాపాడటానికి నడుం బిగించాలి. ప్రతినెల పదుల సంఖ్యలో రక్తహీనత చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వైనం తలుచుకుంటూనే కన్నీళ్లు ఆగని పరిస్థితి. తల్లిదండ్రులు ఆలోచించాలి బిడ్డలు చదువులోగానీ, ఆటపాటల్లోగానీ వెనుకబడి పోవాలని కోరుకోరు. కానీ వాళ్లలో నిరుత్సాహాన్ని నింపి.. వారు వెనుకబడిపోయేలా చేసేది పౌష్టికాహార లోపం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు ప్రణాళిక రూపొందించుకోవాలి. బిడ్డ ఉత్సాహంగా లేకపోవడం... ఇతర అనేక కారణాలతో సన్నగిల్లిపోతుండడంపై కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. రక్తహీనత అన్న అనుమానం రాగానే సత్వరమే వైద్యులను సంప్రదించి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు చిన్నారుల పౌష్టికాహార విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, పౌష్టికాహార లోపంతో ఉన్న చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం కాకుండా అదనంగా ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలను కూడా అందిస్తున్నట్లు ఐసీడీఎస్‌శాఖ పేర్కొంటోంది. ఏడు వేల మందికిపైగాచిన్నారులకు రక్తహీనత జిల్లాలో రక్తహీనత చిన్నారులను పట్టిపీడిస్తోంది. ఎన్నో సమస్యలు...మరెన్నో కష్టాలతో కుటుంబాలను సాగదీస్తున్న అనేక మంది చిన్నారుల విషయంలో చేతనైనంత ఆహారాన్ని అందిస్తున్నా కానీ ఎక్కడో ఒకచోట లోపం కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా కన్న బిడ్డలను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా పౌష్టికాహార లోపం మాత్రం వారిని ఎదగనీయడం లేదు. జిల్లాలో తీవ్ర లోపంతో అల్లాడుతున్న చిన్నారులు 1849 మంది ఉన్నారు. అందులో చాలామందికి సీహెచ్‌సీలు, రిమ్స్, పీహెచ్సీలలో వైద్య సేవలు అందిస్తూ ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు వారిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సాధారణ పౌష్టికాహార లోపంతో మరో 5341 మంది బాధపడుతున్నారు. రక్తహీనత లక్షణాలు ♦ వయస్సుకు తగ్గ బరువు మరియు పొడవు ఉండకపోవడం ♦ బలహీనంగా ఉండడం... తరుచూ అనారోగ్యానికి గురికావడం ♦ ఎల్లప్పుడూ నీరసంగా ఉండడంతోపాటు చురుగ్గా ఉండకపోవడం ♦ బిడ్డ అభివృద్ధి దశలో ఎదుగుదల లేకపోవడం -
పాలు పంచుకున్నారు
అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణులక సరఫరా కాని పాలు అయినా రూ.8లక్షలుపైగాబిల్లుల చెల్లింపు గర్భిణిలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం పక్కదారి పట్టింది. కొన్ని అంగన్వాడి కేంద్రాల ద్వారా పాలు సరఫరా చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. గర్భస్థ దశలో శిశువుకు సరైన పోషణ అందకపోతే శిశువులో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పుట్టిన తర్వాత శిశువు ఎదుగుదలపై దాని ప్రభావం ఉంటుంది. బిడ్డ సరైన బరువు ఉండకపోవడం, తగినంత ఎత్తు ఎదగకపోవడానికి గర్భస్థ దశలో సరైన పోషణ అందకపోవడమే కారణమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మాతృమరణాలు, శిశు మరణాలు, పోషకాహార లోపం అధికంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో టేక్‌హోం రేషన్‌కు బదులుగా అనుబంధ పోషకాహార కార్యక్రమంలో మార్పులు తెచ్చి అంగన్వాడి కేంద్రంలోనే గర్భిణీలు, బాలింతలు ఆహారం తీసుకునేటట్లు చూడటం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా జీఓ ఎంఎస్ నెంబర్ 33(1-12-2012) ద్వారా తొలి విడతగా జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ముద్దనూరు, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టుల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. రె ండో విడతగా గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల ప్రాజెక్టు పరిధిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నిబంధనలు ఇలా... ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. ఇందుకు అవసరమై న కూరగాయలను గ్రామ సమాఖ్యల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. అలాగే ఈ కేంద్రాల పరిధిలో ప్రతి రోజు లబ్ధిదారులకు 200 మిల్లీలీటర్ల పాలను అందించాల్సి ఉంది. అయితే ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలో గ్రామ సమాఖ్యలు ఇప్పటి వరకు ఈ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో పథకం ప్రవేశపెట్టిన డిసెం బర్, జనవరి నెలల్లో మీరే సొంతంగా పాలు సరఫరా చేయాలని అంగన్వాడి కార్యకర్తలను అధికారులు ఆదేశించారు. చాలా మంది ఆర్థిక భారంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కూరగాయలు తెచ్చి భోజ నం మాత్రం వండి పెట్టారు. ఈ ప్రకారం ప్రతి లబ్ధిదారురాలికి రూ.15ల చొప్పున ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతోంది. స్థానిక అవసరాలను బట్టి రూ.17ల వరకు బిల్లు చెల్లించవచ్చని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు తదితర వాటిని జిల్లా అధికారులు సరఫరా చేస్తుండగా కేవలం పాలు, కూరగాయలు, పోపు గింజలకు మాత్రం కార్యకర్తలకు బిల్లులు చెల్లిస్తున్నారు. బిల్లుల చెల్లింపు ఇలా... అయితే లబ్ధిదారులకు చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు సరఫరా చేయలేదు. బిల్లులు మాత్రం చెల్లించారు. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో 328 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 300 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు పాలు సరఫరా చేసినట్లు బిల్లులు పెట్టారు.కొందరు ఒక రోజు, మరికొందరు వారం, మిగతా వారు నెల, రెండు నెలలు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బిల్లులు పెట్టుకున్నారు. ఈ మేరకు డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి పాల సరఫరాకుగాను రూ.8లక్షలకుపైగా అధికారులు బిల్లులు చెల్లించారు. కార్యకర్తలు రూ.100 నుంచి రూ.16వేల వరకు పాల బిల్లులను తీసుకున్నారు. ప్రభుత్వం లీటరు రూ.28 చొప్పున పాల బిల్లు చెల్లించింది. అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూరగాయల సరఫరాకుగాను రూ.16లక్షలకుపైగా బిల్లులు చెల్లించారు. వీటితోపాటు ఇంటి అద్దె బకాయిలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి అధికారులు 10-15 శాతం వరకు కమీషన్లు వసూలు చేసినట్లు తెలిసింది. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే పాల సరఫరా జరిగింది. తర్వాత ఈ పథకం ఆగిపోయింది. గ్రామ సమాఖ్యలకు ఈ అంశంపై శిక్షణ ఇచ్చామని, త్వరలోనే పాల సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు.