బాలలను వెంటాడుతున్నపౌష్టికాహార లోపం | Child Deaths With Nutritional Problems In YSR Kadapa | Sakshi
Sakshi News home page

బాల్యం.. శల్యం.!

Published Wed, Nov 14 2018 1:17 PM | Last Updated on Wed, Nov 14 2018 1:17 PM

Child Deaths With Nutritional Problems In YSR Kadapa - Sakshi

జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతోంది. వైద్యుల వద్దకు తీసుకెళ్తే చిన్నారిలో పోషకాహార లోపం ఉందని చెప్పారు. దీనివల్లే తరచూ అనారోగ్యానికి గురవుతోందని నిర్ధారించారు. ఆ పాప వయసును బట్టి చూస్తే.. 10 కిలోల వరకు బరువు ఉండాలి. కానీ ఆరున్నర కిలోలు మాత్రమే ఉంది. ఈ ఒక్క చిన్నారే కాదు.. జిల్లాలోని చాలా మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చలాకీగా ఆడుతూ.. పాడుతూ ఎదగాల్సిన బాల్యం పోషకాహార లేమితో బక్కచిక్కి పోతోంది. అధికారులు బయటకు చెప్పకపోయినా జిల్లాలో రక్తహీనత.. పోషకాహార లోపంతో మరణించే వారి సంఖ్య అధికమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పోషకార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న పిల్లల సంఖ్య 1849 కాగా అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది.

సాక్షి కడప : బాల్యం పౌష్టికాహారం కొరతతో హాహాకారాలు చేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులు ఆనందంగా ఎగరలేని పరిస్థితి. ఆటలు ఆడాలని ఉన్నా.. పాటలు పాడాలని ఉన్నా... ఏమీ చేయలేని నిస్సహాయత... అందరిలాగా ఉత్సాహంగా ఉరకలెత్తాలనే ఆశ ఉన్నా బాల్యంపై రక్తహీనత నాట్యం చేస్తోంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు వారి మనసుల్లో పుట్టుకొస్తున్నా పౌష్టికాహార లోపం అనే రోగం వారిని నిత్యం కుంగదీస్తోంది. వయస్సు పెరుగుతున్నా.. బరువు మాత్రం పెరగకుండా అనారోగ్యం చిన్నారులను చిదిమేస్తోంది. ఒకవైపు పేదరికం.. మరోవైపు అధికసంతానం...ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో పిల్లలకు సక్రమంగా... సంపూర్ణంగా ఆహారం అందించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే చిక్కి శల్యమవుతున్న పిల్లలను చూస్తూ.. ఏమీ చేయలేని దీనస్థితిని తలుచుకుంటూనే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పథకాల పేరుతో హడావుడి చేస్తున్నా... పాలకులు కంప్యూటర్‌ యుగంలో ఆకాశాన్ని తాకేలా అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల ఫలం పూర్తి స్థాయిలో అందక అల్లాడిపోతున్న బాలల దయనీయ స్థితిని బాలల దినోత్సవం రోజైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

వేటాడుతున్న పౌష్టికాహార లోపం
జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉండగా,  1,74,212 మంది చిన్నారులు ఉన్నారు. 0–1 నెలల చిన్నారులు 22,814 మంది ఉండగా, 1–3 నెలల చిన్నారులు 73,824 మంది, 3–6 నెలల చిన్నారులు 77,574 మంది జిల్లాలోఉన్నారు. అయితే ఇందులో రక్తహీనతతో వేలాది మంది చిన్నారులు బాధపడుతున్నారు. పౌష్టికాహారం పేదరికంపై పడగవిప్పి నాట్యం చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నా పిల్లలకు పూర్తి స్థాయిలో అందలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణ చిన్నారుల కంటే కూడా లోపంతో ఉన్న చిన్నారులకు అధికంగా ఇస్తున్నామని సంబంధిత శాఖలు చెబుతున్నా వాస్తవ పరిస్థితిలో చిన్నారుల ఎదుగుదల అంతంత మాత్రంగా ఉండడం ఆందోళన కలిగించే పరిణామం.

చిన్నారులను శాసిస్తున్న మరణం
జిల్లాలో పౌష్టికాహార లోపం జబ్బుకు గురిచేస్తే...ఆ వ్యాధి కాస్త చిన్నారులను బలి తీసుకుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారిని కాపాడలేకపోతున్నారు. హంగు, ఆర్భాటాలకు లక్షలాది రూపాయలు తగలేస్తున్నా కళ్లెదుటే సరైన ఆహారం లేక తనువు చాలిస్తున్న చిన్నారుల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రధానంగా జిల్లా యంత్రాంగం చిన్నారుల మరణాలపై కూడా ›ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. బాలలకు అందించాల్సిన పౌష్టికాహార విషయంలో రాజీలేని ధోరణి అవలంబించి చిన్నారుల ప్రాణాలు కాపాడటానికి నడుం బిగించాలి. ప్రతినెల పదుల సంఖ్యలో రక్తహీనత చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వైనం తలుచుకుంటూనే కన్నీళ్లు ఆగని పరిస్థితి.

తల్లిదండ్రులు ఆలోచించాలి
బిడ్డలు చదువులోగానీ, ఆటపాటల్లోగానీ వెనుకబడి పోవాలని కోరుకోరు. కానీ వాళ్లలో నిరుత్సాహాన్ని నింపి.. వారు వెనుకబడిపోయేలా చేసేది పౌష్టికాహార లోపం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు ప్రణాళిక రూపొందించుకోవాలి. బిడ్డ ఉత్సాహంగా లేకపోవడం... ఇతర అనేక కారణాలతో సన్నగిల్లిపోతుండడంపై కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. రక్తహీనత అన్న అనుమానం రాగానే సత్వరమే వైద్యులను సంప్రదించి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు చిన్నారుల పౌష్టికాహార విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, పౌష్టికాహార లోపంతో ఉన్న చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం కాకుండా అదనంగా ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్‌ పాలను కూడా అందిస్తున్నట్లు ఐసీడీఎస్‌శాఖ పేర్కొంటోంది.

ఏడు వేల మందికిపైగాచిన్నారులకు రక్తహీనత
జిల్లాలో రక్తహీనత చిన్నారులను పట్టిపీడిస్తోంది. ఎన్నో సమస్యలు...మరెన్నో కష్టాలతో కుటుంబాలను సాగదీస్తున్న అనేక మంది చిన్నారుల విషయంలో చేతనైనంత ఆహారాన్ని అందిస్తున్నా కానీ ఎక్కడో ఒకచోట లోపం కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా కన్న బిడ్డలను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా పౌష్టికాహార లోపం మాత్రం వారిని ఎదగనీయడం లేదు. జిల్లాలో తీవ్ర లోపంతో అల్లాడుతున్న చిన్నారులు 1849 మంది ఉన్నారు. అందులో చాలామందికి  సీహెచ్‌సీలు, రిమ్స్, పీహెచ్‌సీలలో వైద్య సేవలు అందిస్తూ ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు వారిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సాధారణ పౌష్టికాహార లోపంతో మరో 5341 మంది బాధపడుతున్నారు.

రక్తహీనత లక్షణాలు
వయస్సుకు తగ్గ బరువు మరియు పొడవు ఉండకపోవడం
బలహీనంగా ఉండడం... తరుచూ అనారోగ్యానికి గురికావడం
ఎల్లప్పుడూ నీరసంగా ఉండడంతోపాటు చురుగ్గా ఉండకపోవడం
బిడ్డ అభివృద్ధి దశలో ఎదుగుదల లేకపోవడం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement