సాక్షి, హైదరాబాద్: మెదడు.. మన శరీరంలోని అత్యంత సంక్షిష్టమైన నిర్మాణం. ఆలోచనలు, కళలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, తార్కిక బుద్ధి ఇలా అనేక విషయాల్లో మనిషిని ఇతర జీవజాతులకన్నా ఉన్నతంగా, విభిన్నంగా నిలుపుతున్న అవయవం. కోట్లాది న్యూరాన్ల కలబోతగా దైనందిన జీవితంలో చురుకైన పోషిస్తూ.. ఇన్ఫర్మేషన్–ప్రాసెసింగ్ పవర్‌హౌస్ పాత్ర పోషిస్తున్న ఓ మినీ సూపర్ కంప్యూటర్.
అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత, ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే...
►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బద్దలయ్యేలా పని చేసేందుకు ప్రయత్నిస్తే దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమే.
►మెదడు స్పాంజ్ లాంటిది. అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపరచుకోగలదో అంతే చేయగలదు. అందువల్ల బ్రెయిన్‌కు నిత్యం రెస్ట్ అవసరమే.
►పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడ్ బాగుకావడంతోపాటు పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది.
►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఒత్తిళ్లకు కారణమవుతుంది.
మెదడుకు విశ్రాంతి కోసం...
కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్ దొరుకుతుందనేది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు. మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉంచడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం...
►ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి.
►మెదడు రిలాక్స్ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది.
►రాత్రిపూట 8 గంటల చొప్పున నిద్ర పోనివారు ఉదయం వేళల్లో కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మళ్లీ చురుగ్గా మారుతుంది.
►ఏదైనా ఓ ఆట ఆడటం లేదా శారీరక శ్రమతోనూ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
►సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి రోజూ కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది.
నిద్రలో బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిస్తాయి...
సుఖనిద్ర సమయంలో బ్రెయిన్ వేవ్స్ (మెదడు కణాలు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియ) నెమ్మదిస్తాయి. ఏదైనా విషయాన్ని 2–3 గంటలపాటు చదివాక కనీసం 15–20 నిమిషాలు నిద్రపోవడమో లేదా కళ్లు మూసుకొని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం), నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అనే పద్ధతులుంటాయి. ఆర్‌ఈఎంలో కలలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ అంశాల వంటివి ప్రాసెస్ అవుతాయి.
మనం మెలకువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆదే యాక్టివిటీ కొనసాగుతుంది. నాన్ ఆర్‌ఈఎంలో అవి సరిగ్గా ప్రాసెస్ కాక మనసు కలతచెందేలా భంగం కలిగిస్తుంటాయి. బాగా నిద్రపోయినప్పుడు ఆయా అంశాలను క్రమపద్ధతిలో పెట్టేందుకు మెదడు పనిచేస్తుంటుంది. నాన్ ఆర్‌ఈఎంలో నిద్ర సరిగ్గా పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం, భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment