Height Problem
-
పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?
తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించాలి. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. ఎత్తు పెరగడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు. కృత్రిమంగా వచ్చేదీ కూడా కాదు. ఆపరేషన్ చేయించుకుంటే వచ్చేది కాదు. ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది. ►క్యారెట్ క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి. ►బీన్స్ ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. ►బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ►బచ్చలికూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి. ►బఠానీలు బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ►అరటిపండు బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు. ►సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ►పాలు రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది. మంచి పౌష్టికాహారం తీసుకోవటం వలన మంచి పెరుగుదల ఉంటుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. ►ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి. ►గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటికబెల్లం పొడిని, కొంచెం తేనెను కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో రెండు స్పూన్ల చొప్పున తినటం వల్ల పొడవును పెంచే టిష్యూలను బిల్డప్ చేయటానికి మరియు కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ►ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ►ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు. ►మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. - డాక్టర్ నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు -
Divyani Rai: 4 అడుగులు.. పొట్టీ అంటూ వెక్కిరింపులు.. ఆత్మవిశ్వాసంతో అందనంత ఎత్తుకు!
కాస్త బొద్దుగా ఉంటే ఏయ్ లడ్డు అని! సన్నగా ఉంటే పీలగా అస్థిపంజరంలా ఉన్నావనీ! పొట్టిగా ఉంటే..! అసలు పేరు వదిలేసి ఏయ్ పొట్టి... అని పిలుస్తుంటారు. పుట్టుకతో వచ్చే వాటిని మార్చుకోలేమని తెలిసినా పొట్టివారు కనిపించిన ప్రతిసారి రకరకాల కామెంట్లు చేస్తూ అవహేళన చేస్తుంటారు. అవతలి వాళ్లు ఎంత బాధపడుతున్నారో కూడా చూడరు. వాళ్లని విమర్శించడం జన్మతః వచ్చిన హక్కులా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి మాటలెన్నో పడిన దివ్యాణి.. మౌనంగా భరించిందే గానీ, ఎప్పుడూ తిరిగి ఒక్క మాట అనలేదు. తన పని తాను చేసుకుంటూ పోతూ తనని కామెంట్లు చేసిన వాళ్ల నోళ్లను తాను సాధించిన సక్సెస్‌తోనే మూయించి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన దివ్యాణి రాయ్ వయసు 29 ఏళ్లు. ఎత్తు మాత్రం నాలుగడుగుల లోపే. ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో అంతా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. దివ్యాణి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు బయటకు వచ్చినా ఆమె ఎత్తు మీద జోక్‌లు, కామెడీ పంచ్‌లు బాగా వినిపించేవి. అప్పుడు దివ్యాణి కన్నీటిని దిగమింగుతూ ముందుకు వెళ్లిపోయేది. వాటిని మనసుకు తీసుకోకుండా తన చదువు మీద దృష్టిపెట్టి శ్రద్దగా చదువుకునేది. ఎత్తులేదనీ.. చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా వేసే అలవాటున్న దివ్యాణి..తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోయింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తయ్యాక, పీజీ చేసి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఎత్తుగా ఉండడం, దివ్యాణి మరి పొట్టిగా ఉండడంతో వారికి పాఠాలు బోధించలేవు అని చెప్పి కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పుడు దివ్యాణికి చెప్పలేనంత బాధ కలిగింది. ఏళ్లుగా ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు ఆ క్షణం సర్వ కోల్పోయినట్లు అనిపించింది. ఆ కొద్దిసేపు ఫీల్ అయినప్పటికీ తర్వాత తనకి తనే ధైర్యం చెప్పుకుంది. అంతకు మించి.. ఉద్యోగం పోయిన బాధ నుంచి కోలుకుని, తర్వాత బిఈడీ చేసింది. యూజీసీ నెట్ రాసి క్వాలిఫై అయ్యి, ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ (రాజు భయ్య) స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని సాధించింది. తనకొచ్చే జీతంతో పేదరికంలో మగ్గిపోతూ చదువుకునే స్థోమత లేని పిల్లల్ని చదివిస్తోంది. ‘షురువాత్ ఏక్ జ్యోతి శిక్షాకి’ సంస్థతో కలిసి పనిచేసి నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోంది. పిల్లలకు పెయింటింగ్‌ను ఉచితంగా నేర్పిస్తోంది. ఆమే ఆదర్శం.. ‘‘అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సెలక్ట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను పొట్టిగా ఉన్నప్పటికీ ఇంట్లో అమ్మా నాన్న, అన్నయ్య, తాతయ్య వాళ్లు నన్ను ప్రోత్సహించేవారు. వారి మద్దతుతోనే నేను ఈస్థాయికి వచ్చాను. నా ఎత్తు గురించి ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్లు చేసినప్పుడు మాత్రం మనస్సు చివుక్కుమనేది. ఆ సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రాను ఆదర్శంగా తిసుకునేదాన్ని. ఆమె ఎత్తు కూడా నాలుగడుగులే. అయినా ఆమె యూపీఎస్సీ సర్వీస్ పోటీ పరీక్షను తొలి ప్రయత్నంలోనే ఛేదించి ఐఏఎస్‌గా అధికారి అయ్యారు. అందం, ఎత్తు వంటి వాటిని కాదు, మనలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభకే పట్టం కడతారని ఆర్తి నిరూపించారు. అందువల్ల ఆమెను ఆదర్శంగా తీసుకునే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో వైస్‌ఛాన్సలర్ అయ్యి విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తాను.’’అని ఎంతో గర్వంగా చెప్పింది దివ్యాణి. -
చిన్నారుల్లో ఎదుగుదల డీలా!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపున్న పిల్లల్లో శారీరక ఎదుగుదలలేమి ఆందోళనకరంగా ఉంది. పౌష్టికాహార సమస్యల కారణంగా 35 శాతం మంది చిన్నారుల్లో ఎదుగుదల మందగించింది. దీంతో వయసుకు తగినట్లుగా శారీరక ఎత్తు ఉండటంలేదు. అలాంటివారిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చనే ఆందోళన ఉంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేస్తుంటారు. నెలవారీగా ఆ వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టులకు, రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తుంటారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే చిన్నారుల్లో 17.05 శాతం మంది వయసుకు తగిన ఎత్తు లేరని తేలింది. మరో 18.52 శాతం మందిలో కూడా ఎత్తుకు తగిన బరువు లేనప్పటికీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. 64.43 శాతం మందిలో మాత్రం వయసుకు తగిన శారీరక ఎదుగుదల నమోదైంది. పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యత్యాసం 33 జిల్లాలో పరిధిలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 12.96 లక్షలమంది చిన్నారుల వయసు, ఎత్తును తూచి అంచనాలు రూపొందించారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాల్లోని చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో ఉన్నట్లు కనిపిస్తోంది. వయసుకు తగిన ఎత్తు లేకుండా ఎక్కువ వ్యత్యాసంతో ఉన్న చిన్నారులు రాష్ట్రవ్యాప్తంగా 17.05 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర సగటు కంటే ఎక్కువశాతం చిన్నారులు గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 28.23 శాతం మంది చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో నారాయణపేట్(24.79%), మహబూబ్‌నగర్(21%), వికారాబాద్(26.78%), ఆదిలాబాద్(23.79%), కామారెడ్డి(21.29%), మెదక్(20.61%) జిల్లాలున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే... సాధారణంగా చిన్నారుల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. మానసిక ఎదుగుదలతోపాటు శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే సరైన పౌష్టికాహారాన్ని అందించాలి. కానీ, చాలాచోట్ల చిన్నారులకు ఒకేరకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిశీలనలు చెబుతున్నాయి. నిత్యం ఒకేరకమైన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఇస్తుండటంతో కేవలం కొన్నిరకాల ప్రోటీన్లు, విటమిన్లు మాత్రమే అందుతాయి. శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందాలంటే భిన్నరకాలైన ఆహారాన్ని తగిన మోతాదులో అందించాలి. ఈ అంశాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన ఉండటంలేదు. దీంతో ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కూడా విస్తృత ప్రచార కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు కిశోర్ ఈగ ‘సాక్షి’తో అన్నారు. -
ఎత్తు పెరగాలన్న ఆశతో..మృత్యు ఒడికి..