18.01 కిలోమీటర్లు, 17 మెట్రో స్టేషన్లు
ప్రయాణ సమయం 33 నిమిషాలు
పది రోజుల్లో అందుబాటులోకి
బెంగళూరు: భూగర్భంలో ప్రయాణించాలనే బెంగళూరు నగరవాసుల కల సాకారం కానుంది. ఈమేరకు బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ భూగర్భం, భూ ఉపరితలంలో నిర్మించిన రైలు మార్గంగుండా ప్రయాణికులను తీసుకువెళ్లడానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్)కు రైల్వే సేఫ్టీ కమిషనర్ తన సంసిద్ధత వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలో ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి ప్రస్తుతం దాదాపు ముప్పావుగంట సమయం, రూ.120 ఖర్చవుతోంది. నమ్మ మెట్రో నిర్మించిన భూగర్భ మార్గంలో రూ.40 ఖర్చుతో 18.1 కిలోమీటర్లను 33 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈస్ట్ (బయ్యపనహళ్లి), వెస్ట్ (మైసూరు రోడ్డు) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో రైలు మార్గం మరో పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. మొత్తం 18.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గంలో మొత్తం 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కబ్బన్‌పార్క్ (మానిస్క్ స్క్వెయర్), విధానసౌధ, విశ్వేశ్వరయ్య (సెంట్రల్ కాలేజ్), కెంపేగౌడ (మెజెస్టిక్), సీటీ రైల్వే స్టేషన్‌లు భూ గర్భంలో ఉన్నాయి. గరిష్టంగా 1.2 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న ఈ స్టేషన్ల మధ్య రైలు సగటున గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరడానికి 1.5 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కొక్క స్టేషన్లలో 30 సెకెనుల పాటు రైలు ఆగుతుంది.
ఈ దిశలో ఎనిమిది రైళ్లు నడువనున్నాయి. ప్రతి పది నిమిషాలకు ఒక ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్క ట్రైన్‌లో మూడు కోచ్‌లు ఉండగా, ఒక్కొక్క కోచ్‌లో 50 సీట్లు ఉంటాయి. ఈ విషయమై బీఎంఆర్‌సీఎల్ ఫైనాన్స్ విభాగం జనరల్ మేనేజర్ యూ.ఏ వసంత్‌రావ్ మాట్లాడుతూ...ఈస్ట్, వెస్ట్ కారిడార్ మధ్య వ్యాపార కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ ఉంది. ముఖ్యంగా అనేక షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలయాలతో పాటు ఈ మార్గంలోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. అందువల్ల ఈ ఏడాది చివరి నాటికి ఈస్ట్, వెస్ట్ కారిడార్ మార్గం ద్వారా ఐదు లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తారని భావిస్తున్నాం. అన్ని రకాల అనుమతులు లభించినందువల్ల మరో పదిరోజుల్లోపు ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నాం.’ అని పేర్కొన్నారు.