
ఒక ఐడియా అనేక జీవితాలను మార్చేసింది. వైద్యానికి నోచుకోని గ్రామాలకు వైద్యం పట్టాల మీద పరుగులు పెడుతోంది. దేశంలో మూలమూలలను కలుపుతోంది రైల్వే. మారుమూల డ్యూటీ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. వారిలో చాలామందికి వైద్యం అందుబాటులో లేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి సమీప పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఈ అంతరాన్ని ఒక్క ఐడియాతో భర్తీ చేసింది ఇటీ పాండే. పేషెంట్‌లు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డాక్టర్లనే పేషెంట్‌ల దగ్గరకు చేరుస్తోంది. ‘రుద్ర, హాస్పిటల్ ఆన్ వీల్స్’(Hospital on Wheels) పేరుతో ఆమె మొదలు పెట్టిన రైలు పెట్టె క్లినిక్(Train Box Clinic)లు ఊరూరా తిరుగుతూ వైద్యసేవలందిస్తున్నాయి.
డాక్టర్లొస్తున్నారు
మహారాష్ట్ర, భుసావాల్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటీ పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గోల్డ్ మెడల్ సాధించింది. రైల్వేలో 26 ఏళ్ల అనుభవంలో ఆమె అనేక సమస్యలను దగ్గరగా చూశారు. చిన్న ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ఉద్యోగులు పెడుతున్న సెలవుల్లో ఎక్కువభాగం కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతోనేనని తెలుసుకున్నారామె. ఇప్పటికీ మనదేశంలో గ్రామాలకు వైద్యం సుదూరంలోనే ఉంది. వైద్యం కోసం పట్టణాలకు వెళ్లక తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యాన్ని గ్రామాల బాట పట్టించారు.
ఇందుకోసం కొత్తగా డబ్బు ఖర్చు చేసిందేమీ లేదన్నారామె. పాతబడిన రైలు బోగీలకు రిపేర్ చేసి క్లినిక్‌లుగా మార్చారు. రైల్వే హాస్పిటల్ వైద్యసిబ్బంది ఆ రైళ్లలో గ్రామాలకు వెళ్తారు.ప్రాథమికంగా అవసరమైన మందులుంటాయి. ఈసీజీ, బ్లడ్ సాంపుల్ కలెక్షన్ వంటి అవసరమైన పరికరాలతో వెళ్తుందీ రైలు. ఒక్కోరోజు ఒక్కో రూట్. ఒక గ్రామానికి పదిహేను రోజులకొకసారి చొప్పున నెలలో రెండుసార్లు వెళ్తుందీ ఆరోగ్యరైలు.
జనవరిలో పట్టాలెక్కింది
భుసావాల్ డివిజన్‌లో పాతిక వేల మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది జనవరి 18వ తేదీన పట్టాలెక్కిన ఈ రైలు క్లినిక్‌లలో తొలిరోజు 259 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ చక్రాలు కట్టుకుని మా ఊరికి వస్తుంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది... అంటున్నారు వైద్యసహాయం అందుకుంటున్న మహిళలు.