ఇదేం దా‘రుణం’!
⇒రుణమాఫీపై అంతా గందరగోళం
⇒రుణమాఫీ జాబితాల్లో పేర్లు లేక రైతుల ఆందోళన
⇒ గార మండలంలో అర్హులైన రైతులు 13,200 మంది
⇒జాబితాల్లో పేర్లు లేని వారి సంఖ్య 8,200
⇒మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్న అధికారులు
⇒బ్యాంకులు, మీ సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ
గార: రుణమాఫీతో రైతులందరికీ భరోసా కల్పిస్తామన్న ప్రభుత్వ హామీలు ఆచరణలో తస్సుమంటున్నాయి. మాఫీ ప్రకటించిన ఆరునెలల తర్వాత మొదటి విడతగా రూ.50 వేల లోపు పూర్తి మాఫీ అంటు ఆన్‌లైన్‌లో పెట్టిన జాబితాలు చూసి రైతులు బావురుమంటున్నారు. గార మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఈ మండలంలో 13200 మంది రైతులు సుమారు రూ. 40 కోట్ల మేరకు పంట, బంగారం రుణాలు తీసుకున్నారు. కళింగపట్నం, కరజాడ, అరసవల్లి విశాఖ గ్రామీణ బ్యాంకులు, గార స్టేట్ బ్యాంకు, శ్రీకూర్మం ఆంధ్రాబ్యాంకు, తూలుగు, అంపోలు పీఏసీఎస్‌ల ద్వారా ఈ రుణాలు పొందారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో మండలానికి చెందిన 5వేల మంది రైతులకు మాత్రమే చోటు దక్కింది. వీరికి రూ.12 కోట్లు రుణమాఫీ వర్తిస్తుంది.
ఒక్క శ్రీకూరమం పంచాయతీలోనే అత్యధికంగా 1100 మంది రైతులకు మాఫీ వర్తించలేదు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, భూమి పత్రాల ఆధారంగానే ఈ జాబితా రూపొందించామని ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన రైతులందరూ అన్ని పత్రాలను అధికారులకు అందజేసినా.. వేలాది మంది పేర్లు జాబితాలో లేకపోవడానికి ఆధార్ నెంబర్లలో తప్పులు, భూమి పత్రాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలను ప్రభుత్వం చూపిస్తోంది. కానీ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా వారి పేర్లు కూడా ఎందుకు గల్లంతయ్యాయన్న దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ వర్తించాలంటే మళ్లీ అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని అటు అధికారులు, ఇటు బ్యాంకర్లు సూచిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కాగా రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట కోత
ఇదిలా ఉండగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో మాఫీ మొత్తంలో భారీ కోత విధించింది. రైతుకు ఎంత పంటరుణం ఇవ్వాలన్నది రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్నే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ఎకరా వరి పంటకు 2001లో రూ.13,500, 2002లో రూ.15వేలు, 2003లో రూ,16వేలు, 2004లో రూ.18,500 మంజూరు చేయాలని రిజర్వ్ బ్యాంకు నిర్దేశించింది. రుణమాఫీ అమలు నాటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కాకుండా 2001 రూ.13,500 రేటును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకొని మాఫీ వర్తింపజేసింది. ఫలితంగా పూర్తి మాఫీకి అర్హత ఉన్న రైతులు కూడా పూర్తిస్థాయిలో లబ్ధిపొందే అవకాశం లేకుండాపోయింది.