సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వారి ఖాతాలకు డబ్బులు జమ చేసింది. అయితే ఈ జాబితాలు అంతా గందరగోళంగా తయారయ్యాయి. జిల్లాలో ఏడు లక్షల 495 రైతు ఖతాలుండగా కేవలం మూడు లక్షల 29 వేల మందికి మాత్రమే మొదటి జాబితాలో రుణమాఫీ జరిగింది. తమ రుణాలు మాఫీ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి రైతులకు చుక్కలు కనపడుతున్నాయి. బ్యాంకులు, మీసేవా కేంద్రాలు, నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకుని సమాచారం తెలుసుకునేందుకు పోటీ పడుతున్నారు. రుణ మాఫీకి సంబంధించిన ఆన్‌లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో ఎలాంటి సమాచారం అందక ఆందోళన చెందారు. మద్దిపాడు మండలం నారా అంజిరెడ్డికి లక్ష రూపాయల మేర రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందులో వారికి 20 శాతం అనగా రూ. 19,800 వారి ఖాతాలలో జమయినట్లు చూపింది. కానీ అ రైతుకు ఇప్పటివరకు వడ్డీనే రూ. 23,000 కాగా కేవలం రూ.19,800 జమయినట్లు చూపటంతో వడ్డీ డబ్బులు కూడా రాలేదని విచారం వెలిబుచ్చాడు. వచ్చిన డబ్బు
వడ్డీ కింద పోతే అసలు ఎలా పోతుందో అర్థం కావటంలేదని వాపోయాడు.
అద్దంకికి చెందిన సుబ్బారావు మూడుసార్లు తన ఆధార్‌కార్డు, రేషన్ కార్డు పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులకు అందజేశారు. అయినా రుణ అర్హత జాబితాలో అతని పేరు లేదు. పంట రుణం రూ. 30 వేలు, బంగారు రుణం రూ.60వేలు తీసుకున్న నాగరాజుకు పంట రుణం తాలూకూ ఖాతాకు కాకుండా, బంగారు రుణం ఖాతాకు తీసుకున్న రూ. 60 వేలకు వడ్డీతో కలిపి రూ.72 వేలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికన రూ.14వేలు మాత్రమే మాఫీ అయింది.
ఒకరి రేషన్ కార్డులు మరొకరికి మారాయి. దీంతో ఒకరికి చెందాల్సిన మాఫీ మరొకరి అకౌంట్లలోకి వెళ్ళిపోయింది. ముండ్లమూరు మండలం పసుపుగల్లుకు చెందిన చింతా చిన తిరుపతిరెడ్డి రేషన్ కార్డు నెంబరు అదే గ్రామానికి చెందిన చింతా వెంకట శ్రీనివాసరెడ్డికి వేయడంతో తిరుపతిరెడ్డికి చెందాల్సిన రూ.51672 శ్రీనివాసరెడ్డి జాబితాలోకి వెళ్ళాయి.
తూర్పు వీరాయపాలేనికి చెందిన ముప్పరాజు శ్రీనివాసరావుకు చెందిన రేషన్ కార్డు నెంబరు చెర్వుకొమ్ముపాలేనికి చెందిన అదే పేరుగల వ్యక్తి వేయడంతో రూ.1.30 లక్షల మాఫీకి సంబంధించిన సొమ్ము చెర్వు కొమ్ము పాలేనికి చెందిన వ్యక్తి జాబితాలోకి వెళ్లిపోయింది.
గజి బిజి జాబితా
Published Tue, Dec 9 2014 1:47 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM
Advertisement