
ఆధార్ కష్టాలివి!
ఆధార్ నమోదు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆధార్ నమోదు కోసం ప్రజలు తరలివస్తుండటంతో మీ-సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.
ఆధార్ నమోదుకు పెరిగిన డిమాండ్
►కిటకిటలాడుతున్న మీ-సేవ కేంద్రాలు
►ఒక్కొక్కరి నుంచి రూ.100కు పైగా వసూలు
►97 మీ-సేవ కేంద్రాల్లోనే ఆధార్ నమోదు
కర్నూలు (అగ్రికల్చర్): ఆధార్ నమోదు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆధార్ నమోదు కోసం ప్రజలు తరలివస్తుండటంతో మీ-సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌తో లింకప్ చేయడం వల్ల ఆధార్ నమోదుకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు లేవు. మీ-సేవ కేంద్రాల్లోనే పర్మనెంటు ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 288 మీ-సేవ కేంద్రాలు ఉండగా, 97 సెంటర్లలో ఆధార్ నమోదుకు సంబంధించిన కిట్‌లు ఏర్పాటు చేశారు. కర్నూలులో ఆరు, నంద్యాలలో ఆరు, ఆదోనిలో మూడు మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు జరుగుతోంది. ప్రతి మండలంలోని ఒకటి లేదా రెండు మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ కిట్‌లు ఉన్నాయి.
ప్రభుత్వం రుణమాఫీకి ఆధార్‌ను లింకప్ చేస్తోంది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు ప్రారంభించేందుకు ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను, రేషన్ కార్డు లబ్ధిదారులను, గ్యాస్ వినియోగదారులను, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్ కార్డులను, సామాజిక భద్రతా పింఛన్లను, హౌసింగ్ లబ్ధిదారులను... ఇలా అన్ని కార్యక్రమాలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తుండటంతో నమోదు కోసం వచ్చే వారితో మీ-సేవ కేంద్రాల వద్ద రద్దీ కనబడుతోంది. జిల్లాలో 42 లక్షలకు పైగా ఆధార్ నమోదు కావాల్సిన వారు ఉండగా, ఇప్పటివరకు 36.32 లక్షల మందికి ఆధార్ యూఐడీ నెంబర్లు వచ్చాయి.
మిగిలినవారికి ఆధార్ యూఐడీ నెంబర్లు లేవు. వీరిలో చాలామంది ఒకటికి నాలుగైదుసార్లు నమోదు చేసుకున్నా యూఐడీ నెంబర్ రాలేదు. వీరందరూ నేడు అల్లాడుతున్నారు. రుణమాఫీకి విధిగా యూఐడీ నెంబరే ఇవ్వాల్సి ఉంది. ఇది లేకపోతే రైతుల వివరాలు సిస్టమ్‌లో నమోదు కావడం లేదు. దీంతో దాదాపు ఐదారు లక్షల మంది ఆధార్ నెంబర్ల కోసం కుస్తీ పడుతున్నారు. మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు ఉచితంగా చేయాల్సి ఉంది. తప్పుల సవరణకు మాత్రం రూ.15 తీసుకుంటారు. కానీ ఆధార్ నమోదులో మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు.
ఉచితంగా నమోదు చేయాల్సి ఉండగా రూ100 పైన వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తపల్లి, పాములపాడు, కోడుమూరుల్లో ఆధార్ నమోదులో మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు, డోన్, వెల్దుర్తి, ఆదోని తదితర ప్రాంతాల్లోనూ ఆధార్ నమోదులో ఒక్కొక్కరి నుంచి రూ.100 పైనే వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు కనీసం 50 మంది వరకు నమోదు చేస్తారు. అంటే ఒక్క రోజులోనే ఒక్కో మీ-సేవ కేంద్రం ఆదాయం రూ.5000 పైనే ఉన్నట్లు తెలుస్తోంది.
మీసేవ కేంద్రం వద్ద గందరగోళం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పాతబస్టాండులోని మీ సేవ కేంద్రం వద్ద గురువారం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ లింకు పెట్టడంతో ప్రజలు దీని అవసరాన్ని గుర్తించి ఇదివరకు పొందని వాళ్లంతా ఆధార్ నమోదు చేయించుకుంటున్నారు. అక్టోబరు నెల నుంచి ప్రభుత్వం పింఛన్లు, స్కాలర్‌షిప్స్, రేషన్ వంటి వాటికి ఆధార్ తప్పనిసరి చేయడంతో ఆధార్ కార్డు లేని వారు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని పాతబస్టాండులో ఉన్న మీ సేవా కేంద్రం నిర్వాహకులు గురువారం ఒక్కరోజే సుమారు 200 మందికి ఫొటో దిగడానికి రమ్మని చెప్పడంతో ఉదయం 8 గంటల నుంచే జనం ఈ సేవా కేంద్రం వద్దకు చేరుకున్నారు.
ఫలితంగా మీ సేవా కేంద్రం కిక్కిరిసింది. అంతమందికి సమాధానం చెప్పలేక మీ సేవ కేంద్రం నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. నిర్వాహకులు సర్దిచెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేకపోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఎదురైంది. చాలా సేపు వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ఒక పద్దతి ప్రకారం చేస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఆధార్ కిట్ల కొరత...
ప్రస్తుతం ఆధార్ నమోదుకు డిమాండ్ పెరిగినందున ఉన్న ఆధార్ కిట్‌లు ఏమాత్రం సరిపోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 97 మీ-సేవ కేంద్రాల్లో 97 కిట్‌లు మాత్రమే ఉండటంతో ఒత్తిడి పెరిగింది. తగినన్ని కిట్‌లు లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు మరో 96 కిట్‌లు అవసరవుతాయి. జిల్లా అధికారులు చొరవ తీసుకుని జిల్లాకు మరిన్ని ఆధార్ కిట్‌లు తెప్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దోపిడీ కేంద్రాలుగా మారుతున్న మీ-సేవ కేంద్రాలపై జాయింట్ కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వారంలోగా ఆధార్ అనుసంధానం పూర్తి కావాలి
కర్నూలు(అర్బన్) : జిల్లాలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యవేక్షణాధికారి నాగభూషణం కోరారు. గురువారం స్థానిక జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఆయన హౌసింగ్ పీడీ ఎస్ రామసుబ్బుతో కలిసి జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ల ఈఈ, డీఈఈ, ఏఈలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం చేసే కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నట్లే ఇందిరమ్మ లబ్ధిదారుల ఆధార్ నెంబర్లను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 3.84 లక్షల మంది లబ్ధిదారుల ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాల్సి వుండగా, ఇప్పటి వరకు 2.34 లక్షల కార్డులకు చేశారని, మిగిలిన 1.50 లక్షల మంది ఆధార్ నెంబర్లను ఒక వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో కర్నూలు జిల్లా మూడవ స్థానంలో ఉందన్నారు. ఆధార్‌కార్డు కోసం ఎన్‌రోల్ చేసుకున్న లబ్ధిదారులందరు వెంటనే తమ ఆధార్ నెంబర్‌ను సంబంధిత గృహ నిర్మాణ శాఖ డీఈఈ, ఏఈలకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈలు జయరామాచారి, సుధాకర్‌రెడ్డి, పద్మనాభయ్య, ఆయా డివిజన్లలోని డీఈఈ, ఏఈలు పాల్గొన్నారు.
- నాగభూషణం, కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యవేక్షణాధికారి