త్వరలో 'మీ సేవ 2.0'
సాక్షి, హైదరాబాద్ : 'మీ సేవ'.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం అందించే అన్నిరకాల పౌరసేవలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన వ్యవస్థ. సరిగ్గా పదేళ్ల కిందట ప్రారంభమైన 'మీ సేవ'.. అనేక కేంద్రాలుగా విస్తరించడం, ‘ఇ– సేవ’ ల్ని 'మీ సేవ'గా మార్చి కీలక శాఖల ధ్రువీకరణ పత్రాలను ఈ వ్యవస్థ ద్వారా జారీ అయ్యే ఈ పత్రాలకు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ విధానంలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం త్వరలో 'మీసేవ 2.0'ను ప్రారంభించనుంది.
మారిన అవసరాల నేపథ్యంలో ప్రభుత్వం మరింత పారదర్శకత కోసం సరికొత్త ‘మీ సేవ 2.0 ప్రాజెక్టు’ను త్వరలో ప్రజల ముంగిటకు తీసుకరానున్నదని, అందుకు సంబంధించిన పక్రియ దాదాపు పూర్తికావచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ-గవర్నెన్స్ కు కొనసాగింపుగా ఎం-గవర్నెన్స్ ను కూడా అందుబాటులోకి తీసుకరావాలని, తద్వారా పౌరసేవలు అందించటంలో తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలని ప్రబుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ సేవ ద్వారా 225రకాల, మీ సేవ ద్వారా 375రకాల సేవల్ని అందిస్తున్నారు. వీలైనన్ని ప్రభుత్వంలోని 35 శాఖల సేవలు పౌరులకు ఇక నుంచి మీ సేవ 2.0 ప్రాజెక్ట్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో పది జిల్లాలు 31 జిల్లాలుగా రూపాంతరం చెందిన తర్వాత కొంత కాలం స్తబ్ధుగా సాగిన మీ సేవలు అక్టోబర్ 26, 27 తేదీల నుంచి వేగం అందుకున్నాయి.