విద్యుత్ కోతలు చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా వచ్చే ఆదాయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అరకొరా విద్యుత్ సరఫరా నిండా ముంచుతోంది.
యాచారం, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలు చిరువ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా వచ్చే ఆదాయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే అరకొరా విద్యుత్ సరఫరా నిండా ముంచుతోంది. వ్యాపారం జరిగే సమయంలోనే కోతలు విధిస్తుండడంతో ఆదాయం లేక అప్పులు చేసి కిరాయిలు చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మాల్ కేంద్రంలో గంటల కొద్దీ కోతలు విధిస్తున్నారు.
దీంతో పని లేక చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోందంటున్నారు. వారం, పది రోజులుగా సమస్య తీవ్రంగా మారింది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు కోతలు విధిస్తుండడంతో వివిధ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం వచ్చేవారు వెనుదిరిగి పోతున్నారు. నిత్యం రూ.వేలల్లో సంపాదించే వారు, కోతలతో వందల్లో కూడా ఆదాయం పొందలేకపోతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక కొంతమంది దుకాణాలను మూసి వెళ్తున్నారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు మీసేవా కేంద్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు.