మీ సేవ ఉద్యోగిపై దాడి
నెల్లూరు(క్రైమ్): మీ సేవ ఉద్యోగిపై ఆర్టీసీ కండక్టర్ దాడి చేసి గాయపర్చిన ఘటన శోధన్‌నగర్‌లోని మీ సేవ కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది
నెల్లూరు(క్రైమ్): మీ సేవ ఉద్యోగిపై ఆర్టీసీ కండక్టర్ దాడి చేసి గాయపర్చిన ఘటన శోధన్‌నగర్‌లోని మీ సేవ కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన ధర్మవరపు ఉపేంద్ర ఆరేళ్లుగా శోధన్‌నగర్‌లోని మీ సేవ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ నరసింహరావు పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రానికి వచ్చారు. నేరుగా రావడంతో ఉపేంద్ర అతడ్ని క్యూలో రావాల్సిందిగా సూచించారు. తాను ఆర్టీసీ కండక్టర్‌నని క్యూలో రావడం కుదరదని ఉపేంద్రతో ఆయన గొడవకు దిగారు. గొడవ తారస్థాయికి చేరడంతో నరసింహరావు కౌంటర్ ముందున్న నంబర్ బోర్డుతో ఉపేంద్ర తలపై కొట్టారు. గాయపడిన ఉపేంద్రను ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాలుగో నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(పొగతోట): విధి నిర్వహణలో ఉన్న మీ సేవ కంప్యూటర్ ఆపరేటర్‌పై దాడి చేసిన వ్యక్తిపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మీ – సేవ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సలీమ్ కోరారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగి నరసింహరావు చెక్కతో కొట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. మీ సేవ మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.