రాయవరం (ప్రత్తిపాడు): ఈ నెల 17 నుంచి ‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకులు నిరవధిక సమ్మె చేపట్టాలని మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చాలీచాలని ఆదాయంతో, మీసేవ కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో విధిలేక సమ్మెబాట పడుతున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 11,054 మీసేవ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేశారు. వీటిలో నెలకు 500లోపు లావాదేవీలుండే కేంద్రాలు 4,530. మీసేవ ద్వారా అందించే సేవలకు నామమాత్రం కమీషన్ రావడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,020 కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రజలు వెంటనే మీసేవ కేంద్రానికి వెళ్తున్నారు. విద్యుత్ బిల్లులు, వివిధ రకాల పన్నులు, ప్రభుత్వ పరీక్షల ఫీజులు ఇలా దాదాపుగా వందల్లో సేవలు ప్రజలకు అందుతున్నాయి.
కమీషన్ చాలకపోవడంతో..
వివిధ రకాల కంపెనీల ద్వారా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్‌లైన్, శ్రీవెన్, రామ్ ఇన్‌ఫో, కార్వీ, సీఎంఎస్ కంపెనీలు వీటికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి. మీసేవ కేంద్రాలు అందించే సేవలకు ఈ కంపెనీల ద్వారా కేటగిరీ–ఎ, కేటగిరీ–బి కింద కమీషన్ చెల్లిస్తున్నారు. కేటగిరీ–ఎ సర్వీసుకు రూ.11 నుంచి రూ.12.90 ఇస్తుండగా, కేటగిరీ–బి సర్వీసుకు రూ.17 నుంచి రూ.18.50 ఇస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఈ మొత్తాల కంటే తక్కువ కమీషన్ చెల్లిస్తున్నాయి. పైగా కమీషన్‌లో మీసేవ కేంద్రాలు జారీ చేసే ప్రతి సర్టిఫికేట్‌కు రూ.1.50, టీడీఎస్, జీఎస్‌టీ కింద 18 శాతం మినహాయిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ పెంచకపోవడం, తక్కువ కమీషన్ ఇస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.
మీసేవ కేంద్రాల నిర్వాహకుల డిమాండ్లు ఇవే..
వివిధ సేవలకు చెల్లించే కమీషన్ పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల నిర్వాహకులకు సరైన ఆదాయం లభించనందున, వారికి కనీస వేతనం చెల్లించాలి. అప్లికేషన్ స్కానింగ్‌ను రూ.2 నుంచి రూ.5కు పెంచాలి. ఇటీవల పెంచిన కమీషన్‌తో కేంద్రాల నిర్వాహకులకు ఆర్థిక ప్రయోజనం పూర్తిగా లభించనందున కమీషన్‌ను పూర్తిగా చెల్లించాలి. 18 శాతం జీఎస్‌టీని రద్దు చేయాలి. కమీషన్ రివైజ్డ్ కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యుత్ కనెక్షన్‌ను కేటగిరీ–2 నుంచి ప్రత్యేక కేటగిరీకి మార్చాలి. ఆధార్ కేంద్రాలను అన్ని మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలి. ఇలా పలు డిమాండ్లతో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు.
ఇబ్బందులు పడుతున్నాం
మీసేవ కేంద్రాలకు ఇచ్చే అరకొర కమీషన్ సరిపోకపోవడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. సిబ్బంది వేతనాలకు, విద్యుత్ బిల్లులకు ఒక్కోసారి అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం మా సమస్యలపై దృష్టి సారించాలి.
– చెక్కా సురేష్‌కుమార్, అధ్యక్షుడు, మండల మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం, రాయవరం.
డిమాండ్లను నెరవేర్చాలి
ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి. కనీస వేతనం కూడా రాకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టసాధ్యంగా మారి చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నాం.
– సిరివేలు భానుమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం, పుట్టపర్తి, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment