- నిలుపుదల చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు లేవు
- రియల్ బూమ్ ప్రచారమే
- రూ.616 కోట్ల ఆదాయం లక్ష్యం
- రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ కె.లక్ష్మీనారాయణరెడ్డి
నూజివీడు : జిల్లాలోని 8మండలాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.లక్ష్మీనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోసోమవారం ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.616కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగాపెట్టుకున్నా మని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న లక్ష్యం లో కేవలం 68శాతం మాత్రమే ఆదాయం సమకూరిందని, అయితే ఈ ఏడాది మాత్రం ఏప్రిల్, మే, జూన్ నెలలకే 85శాతం ఆదాయం వచ్చిందన్నారు.
గతంలో మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే ఇచ్చిన ఈసీలను, హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారానూ జారీ చేస్తున్నామన్నారు. భూములరేటు పెరిగిందని, అధికరేట్లకు కొనుగోలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారం మాత్రమేనని, ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్లు పెరగలేదని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడో కొనుగోలుచేసిన భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. తూర్పు క్రిష్ణాలో భూముల బూమ్ అసలేమాత్రం లేదని, నూజివీడు, గన్నవరం, కంకిపాడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆశించినంతగా రిజిస్ట్రేషన్లు జరగడంలేదని చెప్పారు. జిల్లా రిజిస్ట్రార్లుబీ శ్రీనివాసరావు, బాలకృష్ణ ఉన్నారు.