కష్టంగా..ఆలస్యంగా!
దళారీల ప్రమేయం లేకుండా ధ్రువపత్రాలు పొందేందుకు వీలుగా కిరణ్ సర్కారు అమల్లోకి తీసుకొచ్చిన మీసేవ కేంద్రాలు ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. సులభంగా.. వేగంగా సర్టిఫికెట్లు పొందవచ్చనే నినాదం అర్థమే మారిపోతోంది. సర్టిఫికెట్ల జారీలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. దరఖాస్తు చేసుకుని గడువు మీరినా ధ్రువపత్రాలు అందని వారి సంఖ్య 26,649 మందికి పైనే కావడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
కర్నూలు(కలెక్టరేట్): జిల్లాలో 287 మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీకి సంబంధించి అర్బన్ మీసేవ కింద 12 సెంటర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో 54 సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఏపీ ఆన్‌లైన్ ద్వారా 55 మీసేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సీఎంఎస్ కంపెనీ ద్వారా 178 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. మరో 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా 318 రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
33 శాఖలకు సంబంధించిన సేవలను దళారీల ప్రమేయం లేకుండా వివిధ ధ్రువపత్రాలను పొందేందుకు అవకాశం కల్పించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖ ద్వారా 75 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు జారీలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికం రెవెన్యూకు సంబంధించినవే కావడం గమనార్హం. గత మార్చి నెల నుంచి సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. సాధారణ ఎన్నికల షెడ్యుల్ వెలువడినప్పటి నుంచి తహశీల్దార్లు ధ్రువపత్రాల జారీని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ కారణంగా విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాల ఇక్కట్లు వర్ణనాతీతం.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కులం, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు అత్యవసరం. గతంలో ఈ సర్టిఫికెట్లను ఒక్క రోజులోనే పొందే వీలుండేది. మీ సేవ కేంద్రాలు ఏర్పాటయ్యాక సర్టిఫికెట్లు పొందడం పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా 30 పని దినాల్లోపు సర్టిఫికెట్లను జారీ చేయాల్సి ఉండగా తహశీల్దార్ల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతోంది. ఎంతో కష్టపడి మీసేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు గుడ్డిగా తిరస్కరిస్తున్నారు. జిల్లాలో 41,012 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించడం అధికారుల తీరుకు నిదర్శనం. ఫలితంగా దరఖాస్తుదారులు వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సి వస్తోంది.
మీసేవ కేంద్రాల్లో దోపిడీపర్వం: మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు యాజమాన్యాలు అత్తెసరు జీతాలతో సరిపెడుతున్నారు. స్కిల్, నాన్ స్కిల్ కింద వేతనం అందిస్తున్నారు. కార్మిక చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉన్నా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సర్టిఫికెట్ అవసరాన్ని బట్టి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అర్బన్ మీసేవ కేంద్రాలు సహా ఏపీ ఆన్‌లైన్, సీఎంఎస్ మీసేవ కేంద్రాల్లోనూ మామూళ్ల పర్వం కొనసాగుతోంది.
ఓటరు కార్డు పొందేందుకు ఫీజు రూ.10 మాత్రమే కాగా.. చాలాచోట్ల రూ.50 వసూలు చేస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లు లేకపోవడం కూడా సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మీసేవ కేంద్రాల్లో ధ్రువపత్రాల జారీ వేగవంతమయ్యేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.