HCL company
-
కేరళ: హెచ్‌సీఎల్ లైఫ్‌కేర్‌లో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, తిరువనంతపురం: కేరళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురంలోని హిందుస్తాన్ లాటెక్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్ లైఫ్‌కేర్) ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. డంపింగ్ యార్డ్ నుంచి మొదలైన మంటలు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఉపశమనమిచ్చే విషయం. కాగా అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.700 కోట్ల పెట్టుబడికి రూ.2,223.9 కోట్ల రాయితీలు
సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ తరహాలో ఉందని అధికారులు, పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హెచ్‌సీఎల్ కంపెనీపై చూపుతున్న వల్లమాలిన ప్రేమే అందుకు నిదర్శనమంటున్నారు. 12 ఏళ్లలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సర్కారు రూ.2,223.9 కోట్ల దాకా రాయితీలు ప్రకటించడం గమనార్హం. పోనీ ఒప్పందం ప్రకారం 7,500 మందికి ఉపాధి కల్పిసుదని చెబుతున్నారు. పెట్టుబడికి మూడు రెట్లు అదనంగా ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీ 2014–20 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా హెచ్‌సీఎల్‌కు భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా రూ.2,223.9 కోట్ల రాయితీలను ప్రభుత్వం కల్పించనుండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే హెచ్‌సీఎల్ పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో నడిచే సంస్థలా ఉందటూ ఐటీ శాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భూమి ద్వారానే రూ.728.9 కోట్ల లబ్ధి విజయవాడకు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా హెచ్‌సీఎల్‌కు 49.86 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మొదటి దశలో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 29.86 ఎకరాలు, రెండోదశలో రూ.50 లక్షలు చొప్పున మరో 20 ఎకరాలను ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్అండ్టీ మేధా టవర్స్ పక్కనే ఉన్న స్థలం కావడంతో ఇప్పుడు అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.15 కోట్లు పైనే పలుకుతోంది. అంటే 49.86 ఎకరాల భూమి విలువ రూ.747.9 కోట్లు ఉంటుంది. కానీ ఇంత ఖరీదైన భూమిని కేవలం రూ.19 కోట్లకే కేటాయిచడం ద్వారా హెచ్‌సీఎల్ కంపెనీకి ప్రభుత్వం రూ.728.9 కోట్ల మేర ప్రయోజనాన్ని కల్పించింది. ఇతర చోట్ల పనిచేసే సంస్థ ఉద్యోగులే విజయవాడకు తరలింపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రెండు దశల్లో 7,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మొదటి దశలో ఏడేళ్లల్లో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3,500కి ఉపాధి కల్పించనుంది. ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున ఈ కంపెనీకి ప్రభుత్వం ఒకేసారి రాయితీగా చెల్లించనుంది. అంటే 7,500 మందికి లక్ష రూపాయల చొప్పున లెక్కిస్తే రూ.75 కోట్లు కంపెనీకి రాయితీ రూపంలో అందనున్నాయి. కానీ ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తామని హెచ్‌సీఎల్ పేర్కొంది. హెచ్‌సీఎల్ కేంద్రాల్లో 6,700 మంది తెలుగువారు పని చేస్తుండగా 627 మంది విజయవాడ వచ్చేందుకు ఆసక్తి చూపినట్లు సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి వి.వి.అప్పారావు తెలిపారు. అంటే ఇప్పటికే వివిధ చోట్ల పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులను విజయవాడ తరలించి కొత్త ఉద్యోగాల కల్పన పేరుతో రాయితీలను కంపెనీ అప్పనంగా పొందనున్నట్లు తేలిపోతోంది. శిక్షణ రాయితీలు రూ.144 కోట్లు.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడం పరిపాటి. కానీ హెచ్‌సీఎల్‌లో ఇలా శిక్షణ ఇస్తున్నందుకుగాను ప్రతి ఉద్యోగికి నెలకు రూ.5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి చెల్లించనుంది. ఇందుకోసం 1,000 సీట్ల సామర్థ్యంతో హెచ్‌సీఎల్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శిక్షణ ఆర్నెళ్లు ఉంటుందనుకున్నా ఏటా కనీసం రెండు వేల మంది ఈ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. అంటే 12 ఏళ్లలో 24,000 మంది చొప్పున లెక్కిస్తే సుమారు రూ.144 కోట్లు హెచ్‌సీఎల్‌కు శిక్షణ రాయితీలు కింద లభించనున్నాయి. తమ సంస్థలోకి తీసుకున్న వారికి మాత్రమే ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ తెలిపారు. ఇతర రాయితీల కింద మరో వంద కోట్లు ఇవికాకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై 5% వడ్డీ రాయితీ చొప్పున మొత్తం 12 ఏళ్లలో గరిష్టంగా రూ.76 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఐటీ పాలసీ 2014–015 కింద స్టాంప్ డ్యూ.టీ, రిజిస్ట్రేషన్ ఫీ, వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీల నుంచి 100% మినహాయింపు, 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ–133 కేవీ ప్రత్యేక ట్రాన్స్మిషన్ ఏర్పాటు, తక్కువ ధరకు యుటిలిటీ సర్వీసులు, రవాణా వంటి అదనపు సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్‌సీఎల్‌కు ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 ఏళ్లకు రూ.1,200 కోట్ల మేర ప్రయోజనం దక్కనుంది. మొత్తంగా రాయితీలు, ఇతర ప్రయోజనాల కింద హెచ్‌సీఎల్ రూ.2,223.9 కోట్ల మేర లబ్ధిపొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
అమరావతి, విజయవాడలో హెచ్‌సీఎల్ క్యాంపస్‌లు
సాక్షి, అమరావతి: అమరావతి, విజయవాడలో సుమారు 50 ఎకరాల్లో హెచ్‌సీఎల్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామని హెచ్‌సీఎల్ కంపెనీ చైర్మన్ శివనాడార్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం సచివాలయంలో శివనాడార్ సీఎంతో సమావేశమై రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్‌సీఎల్ క్యాంపస్‌లపై చర్చించారు. విజయవాడ విమానాశ్రయం సమీపంలో నిర్మించే కొత్త భవన డిజైన్లపై ఆయన ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ప్రతిబింబించేలా హెచ్‌సీఎల్ కొత్త భవంతులను నిర్మిస్తామన్నారు. రూ.750 కోట్లతో రెండు దశల్లో నిర్మాణం చేపడతామని, 7,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 2019 జూన్‌కు విజయవాడ క్యాంపస్ సిద్ధమవుతుందన్నారు. -
వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్‌సీఎల్ ప్రారంభం
- ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడి - నోయిడాలో హెచ్‌సీఎల్ చైర్మన్ శివ నాడార్‌తో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్‌సీఎల్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం నోయిడాలో హెచ్‌సీఎల్ చైర్మన్ శివ నాడార్‌తో సమావేశమై.. విజయవాడ, అమరావతిలో సంస్థ ఏర్పాటుకు హెచ్‌సీఎల్‌తో మార్చి 30న కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు చెందిన పత్రాలను లోకేశ్ అందజేశారు. అనంతరం హెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ పవన్ ధన్వార్తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఐటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, జీపీవో పరిశ్రమలను హెచ్‌సీఎల్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. అమరావతితో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని, వచ్చే ఏడాది జూన్‌లో మొదటి విడత కార్యాలయాన్ని ప్రారంభిస్తామని స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని పవన్ ధన్వార్ తెలిపారు. కాగా హెచ్‌సీఎల్ సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరవల్లిలో 17.86 ఎకరాల్లో మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుందని, రెండో కేంద్రాన్ని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. -
ఆ కంపెనీకి 45 రోజుల్లోనే అనుమతులు: లోకేశ్
అమరావతి: హెచ్‌సీఎల్ కంపెనీకి కావాల్సిన భూమితో సహా అన్ని అనుమతులు కేవలం 45 రోజుల్లోనే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో హెచ్ సీఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణం ఐటీకి ఒక చరిత్రగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు అమరావతికి హెచ్‌సీఎల్ కంపెనీ రావడం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి నూతన అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు. 125 రోజుల్లోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్‌సీఎల్ చెబుతోందని, 2018 జూన్ నాటికి మొదటి ప్రాజెక్ట్ పూర్తవనున్నట్టు తెలిపారు. కంపెనీ ఏర్పాటులో భాగంగా హెచ్‌సీఎల్ రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో కాలేజీల్లో ఉండగానే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి లోకేశ్ చెప్పారు. -
మృత్యుశకటమైన బస్సు
బెజ్జంకి/గోదావరిఖని/సిరిసిల్ల టౌన్ : తమ సమస్యలు ఉన్నతాధికారులకు విన్నవించుకుందామని వెళ్లిన ఆ యువకుల పాలిట ఆర్టీసీ బస్సు మృత్యుశకటమైంది. బెజ్జంకి మండలం తోటపల్లి-దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారి బుధవారం అర్ధరాత్రి నెత్తురోడింది. ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు వేగంగా వచ్చి టవేరాను వెనకనుంచి ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. వీరంతా మీసేవ కేంద్రాల నిర్వాహకులే. గోదావరిఖనికి చెందిన దొమ్మాటి శ్రీధర్(32), ఆర్.రమేశ్, మిర్యాల రవీందర్‌రెడ్డి, ముక్కెర నరేశ్, సిరిసిల్లకు చెందిన జంధ్యాల జయంత్(28), హుస్నాబాద్‌కు చెందిన పి.రాము ఆయూ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మీసేవ కేంద్రాలకు ఐదు నెలలుగా కమీషన్ చెల్లించకపోవడంతో దాని విషయమై హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించుకునేందుకు మొత్తం ఎనిమిది మంది బుధవారం ఓ టవేరా వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడంతో మీ సేవ డెరైక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించి రాత్రి తిరుగుపయనమయ్యూరు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తోటపల్లి-దేవక్కపల్లి గ్రామాల మధ్య వీరి వాహనాన్ని కరీంనగర్ డిపోకు చెందిన బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. సుమారు 30 గజాల మేర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్లగా డివైడర్ అడ్డుపడి ఆగింది. వాహనం వెనకసీట్లో కూర్చున్న శ్రీధర్, జయంత్‌కు తీవ్రగాయూలై అక్కడికక్కడే మృతిచెందా రు. రమేశ్, రవీందర్‌రెడ్డి, నరేశ్‌కు తీవ్రగాయూలు కాగా, రాము, డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్పగాయూలయ్యూరుు. క్షతగాత్రులను స్థానికులు ఫోర్‌లేన్ రహదారి అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయూలైన రమేశ్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు. కరీంనగర్ రూరల్ సీఐ నరేందర్, బెజ్జంకి ఎస్సైలు ఉపేందర్, రాజమౌళి గురువారం ఆస్పత్రికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. శ్రీధర్ తండ్రి రఘుపతిగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే.. గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఆర్.రమేశ్ స్థానిక లక్ష్మీనగర్‌లోని సిటీకేబుల్ కార్యాలయం సమీపంలో విజన్ నెట్వర్క్ పేరుతో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన సరిత(ఇందిర)తో ఏప్రిల్ 20న వివాహమైంది. ఆషాడమాసంలో ఆమె తల్లిగారింటికి వెళ్లగా శ్రావణమాసం మొదలుకావడంతో ఆమెను తిరిగి గోదావరిఖని తీసుకువచ్చేందుకు రమేశ్ సిద్ధమయ్యాడు. మీసేవ కమీషన్ విషయమై డెరైక్టర్‌ను కలిసివద్దామని సహ నిర్వాహకులు కోరడంతో బుధవారం ఉదయం వారితో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. మృతదేహాన్ని గురువారం గోదావరిఖని తీసుకురాగా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితులు బోరున విలపించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు నెలలకే భర్తను మృత్యువు దూరం చేయడాన్ని తట్టుకోలేని సరిత కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. నిద్రపోదామని... ఇల్లంతకుంట మండలం కల్లూరుకు చెందిన శ్రీధర్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఉపాధి కోసం ఎనిమిదేళ్ల క్రితం గోదావరిఖని వచ్చాడు. ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తూ మార్కండేయకాలనీలో గ్లోబల్ నెట్లో మీ-సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుగుప్రయాణంలో మార్గమధ్యంలో ఓ హోటల్ వద్ద ఆగి భోజనం చేశారు. అక్కడివరకు వాహనం మధ్య సీట్లో కూర్చున్న శ్రీధర్ ఎదురుగా వాహనాల వెలుతురు పడుతుండడంతో నిద్రపోవాలని భావించి వెనక సీట్లో కూర్చున్నాడు. బస్సు వెనకనుంచి ఢీకొని లాక్కెళ్లడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే కన్నుమూశాడు. శ్రీధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్లూరులో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతానికి చెందిన రవీందర్‌రెడ్డికి, రమేశ్‌నగర్‌కు చెందిన రమేశ్‌కు చేయి విరిగింది. వాహన డ్రైవర్ ఆరె శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బాధితులు గోదావరిఖనికి చెందినవారు కావడంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. సిరిసిల్ల సర్దార్‌నగర్‌కు చెందిన గెంట్యాల జయంత్‌కుమార్ లోక్‌సత్తా జిల్లా కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తూ పట్టణంలో మీసేవ కేంద్రా న్ని నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మీ-తులసీదాస్, భార్య పద్మతో కలిసి సర్దార్‌నగర్‌లో నివాసముంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే జయంత్ మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లి రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారి రావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ స్వచ్ఛంద సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. పట్టణ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. -
మున్సిపాలిటీల్లో నిలిచిపోనున్న మీసేవ
నిర్వహణలోపం.. సేవలకు శాపం 27 నుంచి మూతపడనున్న కేంద్రాలు నిర్వాహకులకు కమీషన్లు చెల్లించకపోవడమే ప్రధాన కారణం కోదాడఅర్బన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 27 నుంచి మీసేవలు నిలిచిపోనున్నాయి. మీసేవ, ఈ సేవ కేంద్రాలను హెచ్‌సీఎల్ కంపెనీ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కమీషన్ చెల్లించకపోవడంతో కేంద్రాలను మూసివేయాలని ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్వాహకులు నిర్ణయించారు. అంతేకాక కంపెనీ నిర్వహిస్తు న్న కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో వారు కూడా సేవలను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. అందని వేతనాలు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రభు త్వ సర్వీసులను అందించేందుకు గాను హెచ్‌సీఎల్ కంపెనీ 53 మీసేవ కేంద్రాల ను ఫ్రాంచైజీల ద్వారా ఏర్పాటు చేసింది. వీటికి తోడు నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడలలో హెచ్‌సీఎల్ కంపెనీ సొంతంగా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ సర్వీసులను అందజేస్తోం ది. మీసేవ కేంద్రాలలోనే గతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈసేవ సర్వీసులు కూ డా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల నిర్వహణకు గాను హెచ్సీఎ ల్ కంపెనీ ఫ్రాంచైజీ నిర్వాహకులకు వా రు అందించే సేవలను బట్టి కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తమ సొం త కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూ డా హెచ్‌సీఎల్ కంపెనీ వేతనాలు చెల్లిం చాల్సి ఉంటుంది. కేంద్రాలు ప్రారంభిం చిన నాటి నుంచి ఫ్రాంచైజీలకు అంతంత మాత్రంగానే కమీషన్లు చెల్లించింది. ఇక ఎనిమిది నెలలుగా మాత్రం అసలు కమీషన్లు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు తమ కంపెనీ కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి కూడా నాలుగు నెల లుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాలను నిర్వహించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీఏ సేవలపై ప్రభావం మున్సిపాలిటీలలో మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే దాని ప్రభావం ఆర్టీఏ సేవలపై ఎక్కువగా పడనుంది. ఆర్టీఏ సేవలను హెచ్‌సీఎల్ కంపెనీ పరిధిలోని కేంద్రాల్లో మాత్రమే లభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వాహనాల ట్యాక్స్‌లను మూడు నెలలకోసారి చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం ఈనెల 31వ తేదీలోపు మూడునెలల ట్యాక్స్‌ను వాహనదారులు చెల్సించాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత చెల్లించే పన్నులపై అధికంగా జరిమానా ఉంటుంది. ఈనెల 27 నుంచి మీసేవ, ఈ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే ట్యాక్స్ చెల్లించే వీలులేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. నిరవధిక బంద్‌కు నిర్ణయం హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి కమీషన్లు సక్రమంగా రాకపోవడంతో ఫ్రాంచైజీల నిర్వాహకులు పలుమార్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల నల్లగొండలో సమావేశమైన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఈ నెల 27వ తేదీ నుంచి హెచ్‌సీఎల్ కంపెనీ కింద జిల్లాలో ఉన్న అన్ని ఫ్రాంఛైజీలను నిరవధికంగా బంద్ చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వారితో పాటు బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మీసేవ కేంద్రాలు మూతపడనున్నాయి. -
కష్టంగా..ఆలస్యంగా!
దళారీల ప్రమేయం లేకుండా ధ్రువపత్రాలు పొందేందుకు వీలుగా కిరణ్ సర్కారు అమల్లోకి తీసుకొచ్చిన మీసేవ కేంద్రాలు ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. సులభంగా.. వేగంగా సర్టిఫికెట్లు పొందవచ్చనే నినాదం అర్థమే మారిపోతోంది. సర్టిఫికెట్ల జారీలో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. దరఖాస్తు చేసుకుని గడువు మీరినా ధ్రువపత్రాలు అందని వారి సంఖ్య 26,649 మందికి పైనే కావడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కర్నూలు(కలెక్టరేట్): జిల్లాలో 287 మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీకి సంబంధించి అర్బన్ మీసేవ కింద 12 సెంటర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో 54 సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఏపీ ఆన్లైన్ ద్వారా 55 మీసేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. సీఎంఎస్ కంపెనీ ద్వారా 178 మీసేవ కేంద్రాలు పని చేస్తున్నాయి. మరో 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా 318 రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 33 శాఖలకు సంబంధించిన సేవలను దళారీల ప్రమేయం లేకుండా వివిధ ధ్రువపత్రాలను పొందేందుకు అవకాశం కల్పించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖ ద్వారా 75 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు జారీలో ఈ శాఖ పూర్తిగా వెనుకబడింది. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికం రెవెన్యూకు సంబంధించినవే కావడం గమనార్హం. గత మార్చి నెల నుంచి సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. సాధారణ ఎన్నికల షెడ్యుల్ వెలువడినప్పటి నుంచి తహశీల్దార్లు ధ్రువపత్రాల జారీని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ కారణంగా విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాల ఇక్కట్లు వర్ణనాతీతం. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కులం, ఆదాయ, నివాస ధ్రువ పత్రాలు అత్యవసరం. గతంలో ఈ సర్టిఫికెట్లను ఒక్క రోజులోనే పొందే వీలుండేది. మీ సేవ కేంద్రాలు ఏర్పాటయ్యాక సర్టిఫికెట్లు పొందడం పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా 30 పని దినాల్లోపు సర్టిఫికెట్లను జారీ చేయాల్సి ఉండగా తహశీల్దార్ల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమవుతోంది. ఎంతో కష్టపడి మీసేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు గుడ్డిగా తిరస్కరిస్తున్నారు. జిల్లాలో 41,012 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించడం అధికారుల తీరుకు నిదర్శనం. ఫలితంగా దరఖాస్తుదారులు వ్యయ ప్రయాసలకు లోనవ్వాల్సి వస్తోంది. మీసేవ కేంద్రాల్లో దోపిడీపర్వం: మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్లకు యాజమాన్యాలు అత్తెసరు జీతాలతో సరిపెడుతున్నారు. స్కిల్, నాన్ స్కిల్ కింద వేతనం అందిస్తున్నారు. కార్మిక చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉన్నా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సర్టిఫికెట్ అవసరాన్ని బట్టి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అర్బన్ మీసేవ కేంద్రాలు సహా ఏపీ ఆన్లైన్, సీఎంఎస్ మీసేవ కేంద్రాల్లోనూ మామూళ్ల పర్వం కొనసాగుతోంది. ఓటరు కార్డు పొందేందుకు ఫీజు రూ.10 మాత్రమే కాగా.. చాలాచోట్ల రూ.50 వసూలు చేస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లు లేకపోవడం కూడా సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మీసేవ కేంద్రాల్లో ధ్రువపత్రాల జారీ వేగవంతమయ్యేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.