ఆ కంపెనీకి 45 రోజుల్లోనే అనుమతులు: లోకేశ్
అమరావతి: హెచ్‌సీఎల్ కంపెనీకి కావాల్సిన భూమితో సహా అన్ని అనుమతులు కేవలం 45 రోజుల్లోనే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో హెచ్ సీఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణం ఐటీకి ఒక చరిత్రగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు అమరావతికి హెచ్‌సీఎల్ కంపెనీ రావడం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి నూతన అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు.
125 రోజుల్లోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్‌సీఎల్ చెబుతోందని, 2018 జూన్ నాటికి మొదటి ప్రాజెక్ట్ పూర్తవనున్నట్టు తెలిపారు. కంపెనీ ఏర్పాటులో భాగంగా హెచ్‌సీఎల్ రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో కాలేజీల్లో ఉండగానే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి లోకేశ్ చెప్పారు.