‘ఆధార్’కు డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవు | actions taken if money received for aadhar | Sakshi
Sakshi News home page

‘ఆధార్’కు డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవు

Published Tue, Oct 14 2014 3:48 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

actions taken if money received for aadhar

రాంనగర్ : జిల్లాలో కొన్ని మీ-సేవ కేంద్రాలలో ఆధార్‌కార్డుకు రూ. 35 నుంచి రూ. 100 వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి మీ-సేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌డీఓలు, మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లు, సబ్-పోస్ట్ మాస్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మాట్లాడారు. ఎవరైనా మీ-సేవ కేంద్రాల వారు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసినట్లైతే వారి లెసైన్స్‌ను రద్దు చేస్తామన్నారు.

ఆధార్‌కార్డు నమోదు చేసినందుకు యూఐడీ వారు మీ- సేవ వారికి రూ.35 రీయింబర్స్‌మెంట్ ఇస్తారని తెలిపారు. అందువల్ల ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. కొన్ని మీ-సేవ కేంద్రాలలో ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవడం కోసం వచ్చిన వారికి రశీదులు కూడా ఇవ్వడం లేదని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు. మండలాల్లోని అన్ని మీ-సేవ కేంద్రాలను తనిఖీ చేసి ఆధార్‌కార్డుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారో? ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు అందజేయాలని తహసీల్దార్లకు సూచించారు.

పోస్టాఫీస్‌లకు ఆధార్‌కార్డులు వచ్చిన వెంటనే బట్వాడా చేయించాలని, ఒక వేళ ఆధార్ తీయించుకున్న వ్యక్తి చిరునామా మారినట్లైతే సంబంధిత వీఆర్‌ఓ సహాయంతో విధిగా ఆధార్ కార్డులను అందించాలన్నారు. ప్రతి బ్రాంచ్ పోస్టాఫీసుకు ఎన్ని ఆధార్‌కార్డులు వచ్చాయో, ఎన్ని పంపిణీ చేశారో, ఇంకా ఎన్ని  పంపిణీ చేయాలో పోస్టాఫీసుల వారీగా వివరాలు పంపించాలని కోరారు. ఆహార భద్రత కార్డులకు వివిధ రకాల పెన్షన్లకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసినందున పోస్టల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి ఆధార్‌కార్డులను బట్వాడా చేయాలన్నారు. ప్రతి మండలంలో ఆహార భద్రత కార్డులు, వివిధ రకాల పెన్షన్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ వెంకట్రావ్, డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు,  హెడ్‌పోస్టాఫీస్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement