Preeti Meena
-
అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు
-
అడవిలో 12 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్లు
మహబూబాబాద్: వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు ఆటవిడుపు కోసం బయ్యారం అడవుల్లో కాలి నడకన ప్రయాణించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు అడవిలో నడిచిన ఇరువురు అధికారులు అడవిలో ఉన్న చెరువును సందర్శించారు. అనంతరం పక్కనే ఉన్న పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. కలెక్టర్లు ఇద్దరూ ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తూ ఉంటే.. వారితో పాటు నడవలేక మిగిలిన అధికారులు ఆపసోపాలు పడ్డారు. -
ఐదు జిల్లాల్లో అదే వేదన
- ఐఏఎస్లమనే కనీస గౌరవం లేదు.. సీఎస్‌కు కలెక్టర్ల మొర - బాధితుల్లో నలుగురు మహిళా ఐఏఎస్‌లు - అన్ని చోట్లా అధికార పార్టీ నేతలే విలన్లు - సీనియర్ మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలని ప్రీతి మీనా విజ్ఞప్తి - ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరిన ఐఏఎస్ అసోసియేషన్ సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్ అధికారులమనే కనీస గౌరవం కూడా లేదు. అమర్యాదగా మాట్లాడుతున్నారు.. సంబోధించే పద్ధతి కూడా సరిగా ఉండటం లేదు. నువ్వు.. నువ్వు అంటున్నారు.. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక సాకు చూపించి తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదేం పద్ధతి..’అని ఓ మహిళా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అసభ్య ప్రవర్తన వ్యవహారాన్ని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. మహబూబాబాద్‌లోనే కాక.. మరో ఐదు జిల్లాల్లోనూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే ఉన్నాయని, కొందరు నాయకులు అదే పనిగా తమను వేధిస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జనగాం జిల్లాకు సంబంధించి ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మెదక్ జిల్లాలో కలెక్టరేట్ స్థలానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఇసుక రవాణాకు సంబంధించి ఇద్దరు నేతల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయినట్లు ఐఏఎస్ అధికారులు ఈ సందర్భంగా ఉటంకించారు. కరీంనగర్లోనూ అధికార పార్టీ నేతలు అనవసరమైన అంశాల్లో తలదూర్చుతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలి.. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా.. శుక్రవారం సీఎస్‌ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో 15 మంది ఐఏఎస్ అధికారులు ఆయనను కలిశారు. వీరిలో శ్రీదేవి, వాకాటి కరుణ, దేవసేన, అమ్రాపాలి, హోళికేరి భారతి, ప్రశాంతి, దివ్య, వాణీ మోహన్, పౌసమి బసు, శైలజా రామయ్యర్ ఉన్నారు. ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును వీరంతా ఖండించారు. మహిళా అధికారిపై జరిగిన సంఘటన అయినందున సీనియర్ ఐజీ స్థాయి మహిళా అధికారితో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వపరంగానే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ యంత్రాంగానికి ఫిర్యాదు చేసేలా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని సీఎస్ ఐఏఎస్ అధికారులకు భరోసా ఇచ్చారు. సీఎస్‌తో సమావేశం అనంతరం సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతోనూ అధికారులు భేటీ అయ్యారు. సీఎస్‌తో భేటీ అనంతరం బీపీ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఘటనను ఖండించారు. ఎమ్మెల్యే తప్పు చేశారు కాబట్టే చట్టపరంగా కేసు నమోదైందని అన్నారు. గురువారం నాటి అత్యవసర సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రతిని సీఎస్‌కు అందజేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రీతి మీనాకు అవసరమైన న్యాయపరమైన, చట్టపరమైన సహాయ సహకారాలను అసోసియేషన్ తరఫున అందిస్తామని చెప్పారు. (చదవండి: శంకర్‌దాదా.. ఇదేం మర్యాద?) -
కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్‌లో ఎట్టకేలకు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిగొచ్చారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రీతి మీనాకు ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పానని, కలెక్టర్ తనకు సోదరిలాంటిదన్నారు. అనుకోకుండా తన చేయి తాకిందని ఆయన తెలిపారు. కాగా తనతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించారంటూ కలెక్టర్ ప్రీతి మీనా ఇవాళ ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్ అయ్యారు. తక్షణమే కలెక్టర్‌కు స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... కలెక్టర్‌తో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వార్త... ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ వార్నింగ్ -
ఎమ్మెల్యేకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ : జిల్లా కలెక్టర్ పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేసీఆర్... ప్రవర్తన సరిగా లేదంటూ ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో మందలించారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను సీఎం ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చిరించారు. మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్ ప్రీతిమీనాతో... ప్రభుత్వం తరఫున మాట్లాడి సముదాయించాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను సూచించారు. CM KCR strongly admonished Mahbubabad MLA Shankar Naik's improper behaviour with District Collector. Expressed regret over the incident — Telangana CMO (@TelanganaCMO) 12 July 2017 Hon'ble CM has asked the MLA to tender an unconditional apology to the District Collector in person — Telangana CMO (@TelanganaCMO) 12 July 2017 కాగా ఎమ్మెల్యే తనతో అసభ్యంగా ప్రవర్తించారని కలెక్టర్ ప్రీతి మీనా .. ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో ఇవాళ చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఇద్దరి మధ్య వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అమర్యాదగా ప్రవర్తించిన ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే తాము గురువారం విధులకు హాజరు అయ్యేది లేదని హెచ్చరించారు. -
‘ఆధార్’కు డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవు
రాంనగర్ : జిల్లాలో కొన్ని మీ-సేవ కేంద్రాలలో ఆధార్‌కార్డుకు రూ. 35 నుంచి రూ. 100 వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి మీ-సేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లు, సబ్-పోస్ట్ మాస్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మాట్లాడారు. ఎవరైనా మీ-సేవ కేంద్రాల వారు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసినట్లైతే వారి లెసైన్స్‌ను రద్దు చేస్తామన్నారు. ఆధార్‌కార్డు నమోదు చేసినందుకు యూఐడీ వారు మీ- సేవ వారికి రూ.35 రీయింబర్స్మెంట్ ఇస్తారని తెలిపారు. అందువల్ల ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. కొన్ని మీ-సేవ కేంద్రాలలో ఎన్రోల్మెంట్ చేసుకోవడం కోసం వచ్చిన వారికి రశీదులు కూడా ఇవ్వడం లేదని అటువంటి వారిపై చర్యలు తప్పవన్నారు. మండలాల్లోని అన్ని మీ-సేవ కేంద్రాలను తనిఖీ చేసి ఆధార్‌కార్డుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారో? ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు అందజేయాలని తహసీల్దార్లకు సూచించారు. పోస్టాఫీస్‌లకు ఆధార్‌కార్డులు వచ్చిన వెంటనే బట్వాడా చేయించాలని, ఒక వేళ ఆధార్ తీయించుకున్న వ్యక్తి చిరునామా మారినట్లైతే సంబంధిత వీఆర్ఓ సహాయంతో విధిగా ఆధార్ కార్డులను అందించాలన్నారు. ప్రతి బ్రాంచ్ పోస్టాఫీసుకు ఎన్ని ఆధార్‌కార్డులు వచ్చాయో, ఎన్ని పంపిణీ చేశారో, ఇంకా ఎన్ని పంపిణీ చేయాలో పోస్టాఫీసుల వారీగా వివరాలు పంపించాలని కోరారు. ఆహార భద్రత కార్డులకు వివిధ రకాల పెన్షన్లకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేసినందున పోస్టల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి ఆధార్‌కార్డులను బట్వాడా చేయాలన్నారు. ప్రతి మండలంలో ఆహార భద్రత కార్డులు, వివిధ రకాల పెన్షన్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ వెంకట్రావ్, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, హెడ్‌పోస్టాఫీస్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.