సీఎస్‌ను కలిసిన అనంతరం బయటికి వస్తోన్న మహిళా ఐఏఎస్ అధికారులు
- ఐఏఎస్‌లమనే కనీస గౌరవం లేదు.. సీఎస్‌కు కలెక్టర్ల మొర
- బాధితుల్లో నలుగురు మహిళా ఐఏఎస్‌లు
- అన్ని చోట్లా అధికార పార్టీ నేతలే విలన్లు
- సీనియర్ మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలని ప్రీతి మీనా విజ్ఞప్తి
- ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరిన ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్ అధికారులమనే కనీస గౌరవం కూడా లేదు. అమర్యాదగా మాట్లాడుతున్నారు.. సంబోధించే పద్ధతి కూడా సరిగా ఉండటం లేదు. నువ్వు.. నువ్వు అంటున్నారు.. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక సాకు చూపించి తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదేం పద్ధతి..’అని ఓ మహిళా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అసభ్య ప్రవర్తన వ్యవహారాన్ని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. మహబూబాబాద్‌లోనే కాక.. మరో ఐదు జిల్లాల్లోనూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే ఉన్నాయని, కొందరు నాయకులు అదే పనిగా తమను వేధిస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా జనగాం జిల్లాకు సంబంధించి ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మెదక్ జిల్లాలో కలెక్టరేట్ స్థలానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఇసుక రవాణాకు సంబంధించి ఇద్దరు నేతల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయినట్లు ఐఏఎస్ అధికారులు ఈ సందర్భంగా ఉటంకించారు. కరీంనగర్‌లోనూ అధికార పార్టీ నేతలు అనవసరమైన అంశాల్లో తలదూర్చుతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలి..
హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా.. శుక్రవారం సీఎస్‌ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో 15 మంది ఐఏఎస్ అధికారులు ఆయనను కలిశారు. వీరిలో శ్రీదేవి, వాకాటి కరుణ, దేవసేన, అమ్రాపాలి, హోళికేరి భారతి, ప్రశాంతి, దివ్య, వాణీ మోహన్, పౌసమి బసు, శైలజా రామయ్యర్ ఉన్నారు. ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును వీరంతా ఖండించారు. మహిళా అధికారిపై జరిగిన సంఘటన అయినందున సీనియర్ ఐజీ స్థాయి మహిళా అధికారితో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ మేరకు ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వపరంగానే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ యంత్రాంగానికి ఫిర్యాదు చేసేలా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని సీఎస్ ఐఏఎస్ అధికారులకు భరోసా ఇచ్చారు. సీఎస్‌తో సమావేశం అనంతరం సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతోనూ అధికారులు భేటీ అయ్యారు. సీఎస్‌తో భేటీ అనంతరం బీపీ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఘటనను ఖండించారు. ఎమ్మెల్యే తప్పు చేశారు కాబట్టే చట్టపరంగా కేసు నమోదైందని అన్నారు. గురువారం నాటి అత్యవసర సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రతిని సీఎస్‌కు అందజేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రీతి మీనాకు అవసరమైన న్యాయపరమైన, చట్టపరమైన సహాయ సహకారాలను అసోసియేషన్ తరఫున అందిస్తామని చెప్పారు.