cs sp singh
-
అమ్రపాలి వివరణ కోరిన సీఎస్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర వేడుకల్లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ప్రసంగించిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వివరణ కోరారు. సోమవారం ఆమ్రపాలితో సీఎస్ ఫోన్లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తన ప్రసంగం మధ్యలో కలెక్టర్ హోదాలో ఉన్న అమ్రపాలి పలుమార్లు అకారణంగా నవ్వడంతో పాటు గణాంకాల దగ్గర తడబడ్డారు. మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటు, మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఈ సందర్భంగా అమ్రపాలి సీఎస్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
తెలుగు మహాసభలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహాసభల నిర్వహణపై సీఎస్ సమీక్ష సమావే శం నిర్వహించారు. వివిధ అంశాలకు సంబంధించి సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వారికి తగు బాధ్యతలు, నిధులు అప్పగించి నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. వేదికల వద్ద ఏర్పాట్లు, భోజన వసతి, అలంకరణ అంశాలపై సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల నుంచి పాల్గొనే అధ్యాపకులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరారు. పాఠశాల, కళాశాల, వర్సిటీ విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సాహిత్యానికి సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నట్లు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎ.శ్రీధర్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డి.ప్రభాకర్‌రావు, వివిధ శాఖల ఉన్నాతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా ఈఓడీబీ సంస్కరణలు
ప్రభుత్వ శాఖలకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) సంస్కరణల లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. కేంద్ర పరిశ్రమల శాఖ నిర్దేశించిన 372 సంస్కరణల్లో ఇప్పటికే 315 సంస్కరణలను అమల్లోకి తెచ్చామని, మిగిలిన 57 సంస్కరణలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈఓడీబీ సంస్కరణల పురోగతిపై శనివారం ఆయన అన్ని శాఖల అధిపతులతో సమీక్ష జరిపారు. 78 సంస్కరణల అమలు తీరుపై కేంద్రం మార్గదర్శకాలను పంపిందని, వీటి ఆధారంగా పరిశ్రమల నుంచి సమాచారం తెప్పించుకుని విశ్లేషించనుందని తెలిపారు. సంస్కరణల ద్వారా అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ సేవలు, ఇతర సదుపాయాల వినియోగంపై పరిశ్రమలకు సరైన అవగాహన కల్పించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. రెవెన్యూ, న్యాయ శాఖకు సంబంధించిన సంస్కరణల అమలు క్లిష్టమైన అంశాలని, వీటిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. -
ఐదు జిల్లాల్లో అదే వేదన
- ఐఏఎస్లమనే కనీస గౌరవం లేదు.. సీఎస్‌కు కలెక్టర్ల మొర - బాధితుల్లో నలుగురు మహిళా ఐఏఎస్‌లు - అన్ని చోట్లా అధికార పార్టీ నేతలే విలన్లు - సీనియర్ మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలని ప్రీతి మీనా విజ్ఞప్తి - ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరిన ఐఏఎస్ అసోసియేషన్ సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్ అధికారులమనే కనీస గౌరవం కూడా లేదు. అమర్యాదగా మాట్లాడుతున్నారు.. సంబోధించే పద్ధతి కూడా సరిగా ఉండటం లేదు. నువ్వు.. నువ్వు అంటున్నారు.. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక సాకు చూపించి తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.. ఇదేం పద్ధతి..’అని ఓ మహిళా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అసభ్య ప్రవర్తన వ్యవహారాన్ని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది. మహబూబాబాద్‌లోనే కాక.. మరో ఐదు జిల్లాల్లోనూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే ఉన్నాయని, కొందరు నాయకులు అదే పనిగా తమను వేధిస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జనగాం జిల్లాకు సంబంధించి ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మెదక్ జిల్లాలో కలెక్టరేట్ స్థలానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, ఇసుక రవాణాకు సంబంధించి ఇద్దరు నేతల నుంచి రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోయినట్లు ఐఏఎస్ అధికారులు ఈ సందర్భంగా ఉటంకించారు. కరీంనగర్లోనూ అధికార పార్టీ నేతలు అనవసరమైన అంశాల్లో తలదూర్చుతున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా ఐపీఎస్‌తో విచారణ చేయించాలి.. హరితహారం సందర్భంగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా.. శుక్రవారం సీఎస్‌ను కలిశారు. తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య నేతృత్వంలో 15 మంది ఐఏఎస్ అధికారులు ఆయనను కలిశారు. వీరిలో శ్రీదేవి, వాకాటి కరుణ, దేవసేన, అమ్రాపాలి, హోళికేరి భారతి, ప్రశాంతి, దివ్య, వాణీ మోహన్, పౌసమి బసు, శైలజా రామయ్యర్ ఉన్నారు. ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును వీరంతా ఖండించారు. మహిళా అధికారిపై జరిగిన సంఘటన అయినందున సీనియర్ ఐజీ స్థాయి మహిళా అధికారితో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వపరంగానే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ యంత్రాంగానికి ఫిర్యాదు చేసేలా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని సీఎస్ ఐఏఎస్ అధికారులకు భరోసా ఇచ్చారు. సీఎస్‌తో సమావేశం అనంతరం సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతోనూ అధికారులు భేటీ అయ్యారు. సీఎస్‌తో భేటీ అనంతరం బీపీ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఘటనను ఖండించారు. ఎమ్మెల్యే తప్పు చేశారు కాబట్టే చట్టపరంగా కేసు నమోదైందని అన్నారు. గురువారం నాటి అత్యవసర సమావేశంలో తీసుకున్న తీర్మానాల ప్రతిని సీఎస్‌కు అందజేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రీతి మీనాకు అవసరమైన న్యాయపరమైన, చట్టపరమైన సహాయ సహకారాలను అసోసియేషన్ తరఫున అందిస్తామని చెప్పారు. (చదవండి: శంకర్‌దాదా.. ఇదేం మర్యాద?) -
గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయండి
జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హరిత హారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటే శ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్.పీ.సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, గొర్రెల పంపిణీకి పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మొదటి ఏడాదీ దాదాపు 3.5లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పథకం అమలులో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. మొదటి విడత పంపిణీలో ఎంపిక చేసిన సొసైటీలు, సభ్యుల వివరాలను ఈ–లాబ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. గొర్రెల ట్యాగింగ్, ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్‌కు తగు సిబ్బందిని, గొర్రెల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల వాటా 25 శాతం కంట్రిబ్యూషన్ వసూలు చేయాలన్నారు. స్టైలో గ్రాస్ పెంపకానికి తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా మాట్లాడుతూ, కలెక్టర్లు సొసైటీలు, గ్రామాల వారీగా తగిన ప్రాధాన్యం రూపొందించుకొని కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. చెల్లింపులన్ని అకౌంట్ పే ద్వారా జరగాలన్నారు. గొర్రెలను అమ్మే వారి ఆధార్ , ఐడి కార్డుల వివరాలను సేకరించాలన్నారు. పంపిణీ చేసిన గడ్డి విత్తనాలు పెంచడానికి స్థలాలను గుర్తించి, సొసైటీలకు బాధ్యత అప్పగించాలన్నారు. సాదాబైనామాలపై సమీక్ష పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా కేసులను పరిష్కరించి ఈ నెల 21వ తేదీ లోపు అప్ లోడ్ చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశిం చారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ అందు బాటులో ఉండదని అప్రమత్తం చేశారు. మరో 11.31 శాతం కేసులు పరిష్కరిం చాల్సి ఉందన్నారు. భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్ (అర్బన్, రూరల్) జిల్లాల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
పెంపుడు కుక్కతో సచివాలయానికి సీఎస్!
ఫొటోలు తీసిన మీడియాపై మండిపాటు సాక్షి, హైదరాబాద్: రెండో శనివారం సచివాలయానికి సెలవు.. ఉన్నతాధికారులు హాలీడే మూడ్‌లో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మాత్రం ఉదయం 11.40 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మరో కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ కారులో నుంచి ‘మరొకరు’ కూడా దిగారు. వీరంతా ఏదో ముఖ్యమైన పనిపై వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. వారంతా కలసి పైకి వెళ్తున్న సమయంలో కెమెరాలతో ఆ చిత్రాలను బంధిస్తున్న మీడియాపై సీఎస్ మండిపడ్డారు. అయితే ఆయన తన ఇంటి పని మనుషులతోపాటు పెంపుడు కుక్కను సచివాలయానికి తీసుకువచ్చారు. ఆ ఫొటోలు తీసేందుకు మీడియా ప్రయత్నిం చడంతోనే ఎస్పీ సింగ్ కోపంతో ఊగిపోయారు. -
‘వాణిజ్య’ అధికారులపై సీఎస్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంపై సీఐడీ చేపట్టిన దర్యాప్తుకు సహకరించడంలేదంటూ ఆ శాఖ అధికారులపై సీఎస్ ఎస్పీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్యాప్తుపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. బోధన్, కామారెడ్డిల్లోనే కాకుండా నిజామాబాద్ రూరల్, అర్బన్ సర్కిల్ కార్యాలయల్లోనూ స్కాం సూత్రధా రి శివరాజ్ కుంభకోణాలకు పాల్పడ్డట్టు సీఎస్ దృష్టికి సీఐడీ తీసుకెళ్లింది. ఆరోపణ లెదుర్కొంటున్న అధికారుల జాబితా ఇవ్వాలని ఆ శాఖ అధికారులను కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదని, తాము 22 మంది అధికారులను విచారించాల్సి ఉంద ని సీఐడీ అధికారులు సీఎస్ దృష్టికి తీసు కెళ్లారు. దీనితో ఆయన వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులను తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. ఏ2గా ఉన్న సునీల్‌ను తాము గుర్తించామని, రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఐడీ ఉన్నతాధికారులు సీఎస్‌కు తెలిపారని సమాచారం. (బోధన్ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!) -
పెండింగ్ ప్రశ్నలకు సమాధానాలివ్వండి
అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశం హైదరాబాద్: వివిధ శాఖలకు సం బంధించి శాసనమండలి, శాసనసభల గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని వివిధ శాఖ ల ఉన్నతాధికారులను సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. పెండింగ్, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల ని బుధవారం సచివాలయంలో సూచిం చారు. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించుకొని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకునేలా చూడాలన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికా రులందరూ అందుబాటులో ఉండాలన్నా రు. ఆర్థిక శాఖ సర్క్యులర్ ప్రకారం అవుట్ కమ్ బడ్జెట్, డిమాండ్ ఫర్ గ్రాంట్లను వేర్వేరుగా తయారు చేయాలన్నారు. సీఎం సూచనలమేరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టేలా ప్రయత్నించా లని అధికారులకు సూచించారు. ప్రాయోజిత పథకాలకు ఆర్థిక శాఖలో నోడల్ అధికారిని నియమిస్తున్నామని, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. -
నలుగురు అదనపు డీజీపీలకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు డీజీపీలుగా పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ త్రివేదీ, ఎం.మహేందర్‌రెడ్డి, టి.కృష్ణప్రసాద్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న అలోక్ ప్రభాకర్లకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్‌గ్రేడ్ చేస్తూ రాజీవ్ త్రివేదీని అక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు. నగర కమిషనర్ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మహేందర్‌రెడ్డిని, రైల్వే, రోడ్‌సేఫ్టీ విభాగం అదనపు డీజీపీ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ టి.కృష్ణప్రసాద్‌ను వారి వారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజీపీ హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించడం ఇది మూడోసారి. గతంలో 13 ఏళ్ల క్రితం పేర్వారం రాములు, మూడేళ్ల ముందు అనురాగ్ శర్మ ఈ విధంగా వ్యవహరించగా.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీ హోదాలో నగర కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.