రాజీవ్ త్రివేదీ, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు డీజీపీలుగా పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ త్రివేదీ, ఎం.మహేందర్‌రెడ్డి, టి.కృష్ణప్రసాద్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న అలోక్ ప్రభాకర్‌లకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్‌గ్రేడ్ చేస్తూ రాజీవ్ త్రివేదీని అక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు.
నగర కమిషనర్ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మహేందర్‌రెడ్డిని, రైల్వే, రోడ్‌సేఫ్టీ విభాగం అదనపు డీజీపీ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ టి.కృష్ణప్రసాద్‌ను వారి వారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజీపీ హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించడం ఇది మూడోసారి. గతంలో 13 ఏళ్ల క్రితం పేర్వారం రాములు, మూడేళ్ల ముందు అనురాగ్ శర్మ ఈ విధంగా వ్యవహరించగా.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీ హోదాలో నగర కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.