m mahender reddy
-
కరోనా వారియర్ సాంగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్ వీడియో సాంగ్‌ను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు పోలీసు శాఖ చేస్తున్న నిరంతర కృషికి స్పూర్తినిస్తూ.. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ‘కరోనా వారియర్’ వీడియోను సాంగ్‌ను రూపొందించారు. (దశల వారిగా షూటింగ్స్‌ను అనుమతి: కేసీఆర్) నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ పాట విడుదల చేసిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖలు చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా మహిత్ నారాయణ్ వీడియో సాంగ్‌ను రూపొందించడం పట్ల డీజీపీ అభినందించారు. బాలాజీ రచించిన ఈ పాటను గాయకులు మనో, గీతా మాధురిలతో పాటు తమిళ గాయకుడు టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్, నిహాత్, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణ, బేబీలు పాడారు. (సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి) -
టెక్నాలజీ బాగుంది
హైదరాబాద్: కేసుల ఛేదనలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పంజాగుట్ట పోలీసులు ముందుకు వెళ్తున్న తీరు భేషుగ్గా ఉందని మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రేయ పదసాల్‌గీకర్ కితాబిచ్చారు. దేశంలోనే రెండవ ఉత్తమ పోలీస్‌స్టేషన్, రాష్ట్రంలో మోడల్ స్టేషన్ అయిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఆయనకు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్ అంజనీకుమార్‌లు పోలీస్‌స్టేషన్‌లో టెక్నికల్ గ్రౌండ్లెవల్లో విధులు ఎలా నిర్వహిస్తున్నారనే అంశాలను వివరించారు. అనంతరం హ్యాక్ఐ తదితర యాప్‌ల పని తీరు, ఫైల్స్ మేనేజ్మెంట్, రిసెప్షన్ పని తీరు, కమాండ్ కంట్రోల్ రూం, లైబ్రరీ, జిమ్, కోర్టు రూం, లాకప్, ఇన్స్పెక్టర్ రూమ్‌లలో విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానం, సీసీ కెమెరాల ఏర్పా టు, ట్యాబ్ ద్వారా పాతనేరస్థుల కదలికలు ఎలా గుర్తిస్తాం వంటి పలు విషయాలను దత్తాత్రేయకు అక్కడి సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పదసాల్‌గీకర్ మాట్లాడుతూ.. దేశంలోనే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను రెండవ ఉత్తమ స్టేషన్‌గా గుర్తించడం సరైనదే అని కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న సిబ్బంది టెక్నాలజీ పనితీరుని ఎంతో చక్కగా వివరించారని కొనియాడారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలోనే ఎక్కువ టెక్నాలజీ: డీజీపీ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేరాలు అదుపుచేసేందుకు భారత్‌లోనే అన్ని నగరాల్లోకన్నా హైదరాబాద్‌లోనే ఎక్కువగా టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. మనంవాడుతున్న టెక్నాలజీని గ్రౌండ్లెవల్లో ఎలా వాడుతున్నాం? అవి ఎలా పనిచేస్తున్నాయి? అనేది ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు మహారాష్ట్ర డీజీపీ స్టేషన్‌ను సందర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్ ‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు లభించిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ సమ్మిట్ అవార్డ్– 2017’ను గెల్చుకుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్ సమర్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 180 దేశాలు ఎనిమిది కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపాయని, వాటిలో భారత్ నుంచి హైదరాబాద్ కాప్ నామినేట్ అయిందని కొత్వాల్ తెలిపారు. గత వారం జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. హైదరాబాద్ కాప్ ‘గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్’కేటగిరీలో అవార్డు దక్కించుకుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన, ప్రజలకు ఉపయుక్తంగా మారిన యాప్స్‌ను ఈ వార్డుకు ఎంపిక చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీలో 24 దేశాల నుంచి వచ్చిన 39 ప్రాజెక్టులను అధిగమించి ‘హైదరాబాద్ కాప్’అవార్డు దక్కించుకుందని కొత్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 20–22 మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్ గ్లోబల్ కాంగ్రెస్’లో సిటీ పోలీసులు ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు. -
నలుగురు అదనపు డీజీపీలకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు డీజీపీలుగా పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ త్రివేదీ, ఎం.మహేందర్‌రెడ్డి, టి.కృష్ణప్రసాద్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న అలోక్ ప్రభాకర్లకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్‌గ్రేడ్ చేస్తూ రాజీవ్ త్రివేదీని అక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు. నగర కమిషనర్ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మహేందర్‌రెడ్డిని, రైల్వే, రోడ్‌సేఫ్టీ విభాగం అదనపు డీజీపీ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ టి.కృష్ణప్రసాద్‌ను వారి వారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజీపీ హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించడం ఇది మూడోసారి. గతంలో 13 ఏళ్ల క్రితం పేర్వారం రాములు, మూడేళ్ల ముందు అనురాగ్ శర్మ ఈ విధంగా వ్యవహరించగా.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీ హోదాలో నగర కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. -
ప్రతి ఠాణాకు ఫేస్బుక్ ఐడీ
సోషల్ మీడియాపై పోలీసుల దృష్టి ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం సాక్షి, సిటీబ్యూరో: పోలీసులు తమ సేవలు వేగవంతం చేసేందుకు సోషల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని 62 శాంతి భద్రత పోలీసుస్టేషన్లకు ఐటీ విభాగం అధికారులు ఫేస్బుక్ ఐడీ కేటాయిస్తున్నారు. ప్రజల వద్దకు పోలీసులు అన్న నినాదంలో భాగంగా ఫేస్బుక్ ఐడియాకు వచ్చారు. ఒక్కో ఠాణాకు ఒక్కో ఫేస్బుక్ ఐడీ ఉంటుంది. దాని పాస్వర్డ్ స్టేషన్ ఎస్హెచ్ఓ (ఇన్స్పెక్టర్) వద్ద ఉంటుంది. ప్రజలు ఠాణా మెట్లు ఎక్కకుండానే తమ సమస్యను ఫేస్బుక్ ద్వారా పోలీసులకు తెలియజేయవచ్చు. బస్తీలు, కాలనీలలో అసాంఘిక శక్తుల కదలికలు, వైన్‌షాప్‌ల వద్ద మందుబాబుల ఆగడాలు, రౌడీల బెదిరింపులు, కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, నెట్ సెంటర్ల వద్ద మహిళలను వేధించే పోకిరీల గురించి ఆయా పరిధిలోని ఠాణాల ఫేస్బుక్ ఐడీకి సమాచారం ఇవ్వవచ్చు. ఫేస్బుక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ పోలీసుల ఫేస్‌బుక్‌ను తమ అకౌంట్‌తో జత చేసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు చూసుకుని వెంటనే స్పందిస్తారు. అలాగే ఫేస్బుక్ ద్వారా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఠాణాలతో పాటు 17 ఏసీపీ డివిజన్లు, ఐదు జోన్ కార్యాలయాలకు సైతం ఫేస్బుక్ ఐడీ కేటాయిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టికి... ఠాణాలో తమ న్యాయం జరగడంలేదని, అక్కడి అధికారి నిందితులకు వత్తాసు పలుకుతున్నారని బాధితుడు భావిస్తే ఫేస్బుక్ ద్వారా ఆ విషయాన్ని డీసీపీ దృష్టి తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ ఠాణా పరిధిలోని ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో పాటు సిబ్బంది పారదర్శకతతో పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. -
నిజాయితీగా ఉండాలి
పోలీసులకు హోంమంత్రి సూచన సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పోలీసులు నిజాయితీగా ఉండాలని ఆయన కోరారు. బాలానగర్‌లోని ఉషా పరిశ్రమలో బుధవారం నగర ఇన్స్పెక్టర్లకు నిర్వహించిన ఐదు సూత్రాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, ప్రజలకు మరింత సేవలందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు శాఖకు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లతో 1500 ఇన్నోవా కార్లు, 2050 ద్విచక్ర వాహనాలు ఇచ్చారన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ ఇచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. పోలీసులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రజలకు సేవలందించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. బంజారాహిల్స్‌లో 8 వేల గజాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అత్యాధునికంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ... పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన సదుపాయాలు కల్పించారని, పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఇక నుంచి హోంగార్డులకు నెలనెలా జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐదు సూత్రాలను పాటిస్తే తప్పకుండా పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చి ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్, డీసీపీ సత్యనారాయణ. బాలానగర్ ఏసీసీ నంద్యాల నర్సింహారెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డితో పాటు నగరంలోని అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. ఎస్హెచ్ఓలకు ఉషా కంపెనీ ఈడీ రవిరాజుతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.