నిజాయితీగా ఉండాలి
- పోలీసులకు హోంమంత్రి సూచన
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే పోలీసులు నిజాయితీగా ఉండాలని ఆయన కోరారు. బాలానగర్‌లోని ఉషా పరిశ్రమలో బుధవారం నగర ఇన్‌స్పెక్టర్లకు నిర్వహించిన ఐదు సూత్రాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, ప్రజలకు మరింత సేవలందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు శాఖకు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.350 కోట్లతో 1500 ఇన్నోవా కార్లు, 2050 ద్విచక్ర వాహనాలు ఇచ్చారన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 35 శాతం అలవెన్స్ ఇచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
పోలీసులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రజలకు సేవలందించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. బంజారాహిల్స్‌లో 8 వేల గజాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అత్యాధునికంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ... పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన సదుపాయాలు కల్పించారని, పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు.
నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఇక నుంచి హోంగార్డులకు నెలనెలా జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐదు సూత్రాలను పాటిస్తే తప్పకుండా పోలీస్ వ్యవస్థలో మార్పు వచ్చి ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్, డీసీపీ సత్యనారాయణ. బాలానగర్ ఏసీసీ నంద్యాల నర్సింహారెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డితో పాటు నగరంలోని అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు. ఎస్‌హెచ్‌ఓలకు ఉషా కంపెనీ ఈడీ రవిరాజుతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.