సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్ ‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు లభించిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ సమ్మిట్ అవార్డ్– 2017’ను గెల్చుకుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్ సమర్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 180 దేశాలు ఎనిమిది కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపాయని, వాటిలో భారత్ నుంచి హైదరాబాద్ కాప్ నామినేట్ అయిందని కొత్వాల్ తెలిపారు. గత వారం జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. హైదరాబాద్ కాప్ ‘గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్’కేటగిరీలో అవార్డు దక్కించుకుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన, ప్రజలకు ఉపయుక్తంగా మారిన యాప్స్‌ను ఈ వార్డుకు ఎంపిక చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీలో 24 దేశాల నుంచి వచ్చిన 39 ప్రాజెక్టులను అధిగమించి ‘హైదరాబాద్ కాప్’అవార్డు దక్కించుకుందని కొత్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 20–22 మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్ గ్లోబల్ కాంగ్రెస్’లో సిటీ పోలీసులు ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment