సాక్షి, బెంగళూరు : పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటవీశాఖ అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కినుక వహించారు. బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు.
ముగ్గురికి ప్రమోషన్లు
తాజా పదోన్నతుల్లో అమర్‌కుమార్‌పాండేను శాంతిభద్రతల అదనపు డీజీపీ పోస్టు నుంచి డీజీపీ– పోలీస్ శిక్షణ విభాగానికి, టీ.సునీల్‌కుమార్‌ను ఏసీబీ ఏడీజీపీ నుంచి సీఐడీ ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం డీజీపీగా, సీహెచ్.ప్రతాప్‌రెడ్డికి ఏడీజీపీ– పోలీస్ సంబంధాలు, ఆధునీకరణ, శాంతిభద్రతల విభాగం బాధ్యతలను అప్పగించారు. ఈ ముగ్గురికీ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా పదోన్నతులు జారీచేసింది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ నిరాశకు గురయ్యారు. సునీల్‌కుమార్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నప్పటికీ ప్రమోషన్ దక్కింది. దీంతో ఆయన ఒక్కరోజు డీజీపీగా రికార్డుల్లో ఉంటారు.
నా కంటే జూనియర్లకు ఇస్తారా: రవ్రీందనాథ్
రాజీనామాపై విలేకరులతో రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగానికి బుధవారం రాత్రి రాజీనామా చేశాను. నా కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేను. పోలీస్‌శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం సామాన్యం. కానీ వీటన్నింటిని భరిస్తూ ఉండరాదు. ఈ తప్పులపై పోరాడాలి. డీజీపీకి నాకంటే రూ.300 వేతనం అధికంగా వస్తుందంతే. అయితే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించా అని చెప్పారు. తన సమర్థతలో లోపాలు ఉన్నాయని అంటుండడం బాధ కలిగిస్తోందన్నారు.
ఇద్దరు ఐపీఎస్‌ల రిటైర్మెంటు
బనశంకరి: సీనియర్ ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, అశిత్‌మోహన్‌ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమాన్ని గురువారం కోరమంగల కేఎస్‌ఆర్‌పీ మైదానంలో నిర్వహించారు. డీజీపీ ప్రవీణ్‌సూద్ వీరికి ప్రభుత్వ గౌరవాలతో వీడ్కోలు పలికారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ కర్ణాటక తనకు చాలా ప్రేమ ఇచ్చిందని, అందరికీ ధన్యవాదాలని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment