Additional DGP
-
జీవో నెంబర్ 1పై దుష్ప్రచారం.. ఏపీ అడిషనల్ డీజీపీ క్లారిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై జరగుతున్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్ వివరణ ఇచ్చారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 1861 పోలీస్ యాక్ట్‌కు లోబడే జీవో నెంబర్ 1 విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇస్తామన్నారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదన్నారు. బ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇటీవల ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవో తీసుకొచ్చినట్లు ఏడీజీపీ రవి శంకర్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. అదికూడా అత్యవసరమైతే అనుమతులతో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ జీవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్1ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టం దేశ వ్యాప్తంగా అమలవుతున్నదేనని అన్నారు. అందుకే వద్దన్నాం ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రహదారుల మీద సభలు వద్దన్నామని లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ తెలిపారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సన్నగా, ఇరుగ్గా ఉండే రోడ్లమీద సభల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది ఏర్పుడుతుందని.. అంబులెన్సులు, విమాన ప్రయాణాల వారికి సమస్యలు తేవద్దని సూచించారు. అందువల్లే పబ్లిక్ గ్రౌండ్లలో సభలు జరుపుకోవాలని జీవోలో ఉందని పేర్కొన్నారు. చదవండి: మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు -
ప్రశాంతత కొనసాగేలా అందరూ సహకరించాలి: అదనపు డీజీపీ దేవేందర్ సింగ్ చౌహాన్
-
ఉద్యోగం చేయలేను.. డీజీపీ రాజీనామా
సాక్షి, బెంగళూరు : పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటవీశాఖ అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కినుక వహించారు. బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు. ముగ్గురికి ప్రమోషన్లు తాజా పదోన్నతుల్లో అమర్‌కుమార్‌పాండేను శాంతిభద్రతల అదనపు డీజీపీ పోస్టు నుంచి డీజీపీ– పోలీస్ శిక్షణ విభాగానికి, టీ.సునీల్‌కుమార్‌ను ఏసీబీ ఏడీజీపీ నుంచి సీఐడీ ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం డీజీపీగా, సీహెచ్.ప్రతాప్‌రెడ్డికి ఏడీజీపీ– పోలీస్ సంబంధాలు, ఆధునీకరణ, శాంతిభద్రతల విభాగం బాధ్యతలను అప్పగించారు. ఈ ముగ్గురికీ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా పదోన్నతులు జారీచేసింది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ నిరాశకు గురయ్యారు. సునీల్‌కుమార్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నప్పటికీ ప్రమోషన్ దక్కింది. దీంతో ఆయన ఒక్కరోజు డీజీపీగా రికార్డుల్లో ఉంటారు. నా కంటే జూనియర్లకు ఇస్తారా: రవ్రీందనాథ్ రాజీనామాపై విలేకరులతో రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగానికి బుధవారం రాత్రి రాజీనామా చేశాను. నా కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేను. పోలీస్‌శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం సామాన్యం. కానీ వీటన్నింటిని భరిస్తూ ఉండరాదు. ఈ తప్పులపై పోరాడాలి. డీజీపీకి నాకంటే రూ.300 వేతనం అధికంగా వస్తుందంతే. అయితే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించా అని చెప్పారు. తన సమర్థతలో లోపాలు ఉన్నాయని అంటుండడం బాధ కలిగిస్తోందన్నారు. ఇద్దరు ఐపీఎస్‌ల రిటైర్మెంటు బనశంకరి: సీనియర్ ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, అశిత్‌మోహన్‌ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమాన్ని గురువారం కోరమంగల కేఎస్ఆర్పీ మైదానంలో నిర్వహించారు. డీజీపీ ప్రవీణ్‌సూద్ వీరికి ప్రభుత్వ గౌరవాలతో వీడ్కోలు పలికారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ కర్ణాటక తనకు చాలా ప్రేమ ఇచ్చిందని, అందరికీ ధన్యవాదాలని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్ఐఎమ్తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు. -
ఎన్నికల నిర్వహణకు సర్వ సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్ర 5గంటల నుంచి తెలంగాణలో(నిజామాబాద్ మినహా) ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెల్లడించిన నాటి నుంచి రాష్ట్ర పోలీస్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. నిజామాబాద్‌లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.37.76 కోట్ల నగదుతో పాటు రూ.1.01 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకునే క్రమంలో ఎన్నికల కమిషన్ అనుమతి ఉందా లేదా అనే అంశాన్ని పరశీలిస్తామన్నారు. ఆ సమయంలో విచారణలో సదరు వ్యక్తులు వెల్లడించిన అంశాలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. అంతేకాక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇప్పటి వరకూ 423 కేసులు నమోదు చేయడమే కాక 4 వేల అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో అదనపు బలగాల మోహరించామన్నారు. ఎన్నికల్లో మావోయిస్ట్‌ల ప్రభావం లేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగిలే చూస్తామని తెలిపారు. -
భద్రతకు తొలి ప్రాధాన్యం
సాక్షి,రంగారెడ్డి జిల్లా : ప్రగతి నివేదన సభకు ప్రజలు క్షేమంగా హాజరై, తిరిగి గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాలు తెలిసేలా అన్ని దారుల్లో ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. 2వ తేదీన ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పైకి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించబోమన్నారు. సభా ప్రాంగణాన్ని మొత్తం 24 సెక్టార్లుగా విభజించి బందోబస్తు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్ ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
నలుగురు అదనపు డీజీపీలకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు డీజీపీలుగా పనిచేస్తున్న నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ త్రివేదీ, ఎం.మహేందర్‌రెడ్డి, టి.కృష్ణప్రసాద్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న అలోక్ ప్రభాకర్లకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్‌గ్రేడ్ చేస్తూ రాజీవ్ త్రివేదీని అక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు. నగర కమిషనర్ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మహేందర్‌రెడ్డిని, రైల్వే, రోడ్‌సేఫ్టీ విభాగం అదనపు డీజీపీ పోస్టును డీజీపీ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ టి.కృష్ణప్రసాద్‌ను వారి వారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజీపీ హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించడం ఇది మూడోసారి. గతంలో 13 ఏళ్ల క్రితం పేర్వారం రాములు, మూడేళ్ల ముందు అనురాగ్ శర్మ ఈ విధంగా వ్యవహరించగా.. తాజా ఉత్తర్వుల ప్రకారం ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీ హోదాలో నగర కమిషనర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. -
దొరగారి వనంలో ‘ఖాకీ’ కూలీలు
-
దొరగారి వనంలో ‘ఖాకీ’ కూలీలు
► పోలీసు శాఖలో అదనపు డీజీపీ అరాచకాలు ► 60 ఎకరాల ఫాంహౌస్‌లో హోంగార్డులు, కానిస్టేబుళ్లతో కూలి పనులు ► పూలు కోయడం నుంచి అమ్మడం దాకా అడ్డగోలు చాకిరీ ► అయ్యవారి ఇంట్లో 10 మంది.. ఫాంహౌస్‌లో 30 మంది.. ► పూలు అమ్మడానికి ప్రత్యేకంగా ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ► డబ్బులు బ్యాంకులో జమచేయడానికి నలుగురు కానిస్టేబుళ్లు ► ఎదురుతిరిగితే సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులు ► బంధువుకు కారు తాకిందని కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించిన వైనం ► ఇంట్లో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించారంటూ ఓ ఎస్సై స్థాయి అధికారి కన్నీళ్లు సాక్షి నెట్వర్క్ : ఆయనో సీనియర్ ఐపీఎస్. కీలక విభాగాలకు అధిపతిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో ఆయనదే పెత్తనం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కీలక పోస్టు వస్తుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఎక్కడ ఏమీ దొరక్కపోవడంతో ఖరీదైన ‘వ్యవసాయం’ మొదలుపెట్టారు. వికారాబాద్ జిల్లాలోని ముఖ్య ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఫాంహౌస్ కట్టుకున్నారు. హైదరాబాద్‌లో పూలకు.. అది కూడా బొకేల్లో ఉపయోగించే పూలకు భారీ డిమాండ్ ఉండటంతో ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది... అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు.. చేతిలో కానిస్టేబుళ్లు ఉండనే ఉంటారు.. ఇంట్లో హోంగార్డులు ఆర్డర్లీగా పనిచేస్తారు.. ఆయన విభాగంలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారు.. ఇదే అదునుగా చేసుకొని పూల సాగు మొదలుపెట్టారు. విత్తనాలు వేసే దగ్గరి నుంచి పూలు, కోయడం, వాటిని అందంగా కత్తిరించి, ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మడం, ఆ డబ్బులు బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వరకు అన్ని కూలి పనులను కానిస్టేబుళ్లు, హోంగార్డులతో చేయించేస్తున్నారు! పోలీస్ శాఖలో అదనపు డీజీపీగా పనిచేస్తున్న ఈ అయ్యగారి ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన వ్యవహారంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వాళ్లు పేరుకు పోలీసులు.. చేసేది కూలీ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్లంతా ఉద్యోగంలో చేరారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రజల కోసం పనిచేద్దామనుకుంటే చివరకు వారితో చేయిస్తున్నది కూలీ పని. కీలక అధికారిగా పేరు సంపాదించిన అదనపు డీజీపీ వికారాబాద్ జిల్లాల్లోని తన ఫాంహౌజ్‌లో వారితో పూల వ్యవసాయం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆ వ్యవస్థలో రాష్ట్రం తరపున భద్రత కల్పించాల్సిన విభాగానికి అధిపతి అయి ఉండి సిబ్బందితో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. ఆయన విభాగానికి ప్రత్యేకంగా భద్రత కల్పిచేందుకు వినియోగించాల్సిన ఏఆర్ బలగాలను సైతం ఫాంహౌజ్‌లో పెట్టి పూల వ్యాపారం చేయిస్తున్నారు. పేరుకు పోలీస్ అని చెప్పుకోవడం తప్పా తాము చేస్తున్న పనికి ఏం సంబంధం లేదని సిబ్బంది ‘సాక్షి’తో గోడు వెల్లబోసుకున్నారు. పోలీస్ వాహనాల్లో తీసుకెళ్లి మరీ.. పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లలో ఒకరు నుంచి ఇద్దరు ఆర్డర్లీగా పనిచేయడం సర్వసాధారణం. అయితే ఈ అదనపు డీజీపీ ఇంట్లో మాత్రం ఏకంగా 10 నుంచి 15 మంది పనిచేస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఫాంహౌజ్‌లో ప్రతీరోజు సికింద్రాబాద్ నుంచి పోలీస్ వాహనాల్లో 20 మందిని తీసుకెళతారని, ఆవసరమైతే ఆయన ఫాంహౌజ్‌కు దగ్గరలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని కూడా తీసుకెళ్తారని తెలిసింది. ఇలా రోజు 30 మంది పోలీస్ సిబ్బంది అదనపు డీజీపీ ఫాంహౌజ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారని సమాచారం. ఆపరేషన్ గంజాయి పేరుతో.. గడిచిన నెలలో ఫాంహౌజ్‌లో పనులకు కూలీల అవసరం ఉండటంతో అదనపు డీజీపీ తన మెదడుకు పనిపెట్టారు. ప్రస్తుత సమయంలో కూలీ రేట్లు భారీగా ఉండటంతో పోలీస్ సిబ్బందితోనే చేయించేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ అంత మందిని వ్యవసాయి కూలీలుగా వాడిన సంగతి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఓ పథకం రూపొందించారు. వికారాబాద్ పరిసరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, వాటిని స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకోవడానికి 40 మంది పోలీస్ సిబ్బంది అవసరం అని చెప్పి ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఎలాగూ తన విభాగమే కావడం.. పైగా ఆన్ రికార్డు గంజాయి ఆపరేషన్ అని సర్క్యులర్ ఉండటంతో దర్జాగా 40 మంది సిబ్బందిని ఫాంహౌజ్‌కు తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ 40 మందిని తీసుకెళ్లి రెండ్రోజులపాటు ఫాంహౌజ్‌లోనే కూలి పని చేయించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎదురు తిరిగినందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయిస్తానని ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్తో బెదిరించినట్టు సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది. గుడిమల్కాపూర్‌లో పూల అమ్మకం ఫాంహౌజ్‌లో సాగుచేసిన పూలను తెంపి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయించే బాధ్యతలను ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఐదేళ్లుగా బదిలీ లేకుండా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఆ రిజర్వ్ ఇన్స్పెక్టర్... అదనపు డీజీపీ మెప్పుకోసం ఈ పనిచేయడాన్ని అందివచ్చిన అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ప్రతీరోజు పూలను సాయంత్రం 6 గంటలకల్లా పోలీస్ విభాగానికి చెందిన బొలేరో వాహనంలో గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తీసుకురావడం, వాటిని విక్రయించి వెళ్లడం చేస్తున్నారు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నలుగురు కానిస్టేబుళ్లను సైతం అదనపు డీజీపీ నియమించారు. ప్రతీ రోజు కలెక్షన్ చేసుకోవడం, వచ్చిన డబ్బులను తీసుకెళ్లి వికారాబాద్‌లోని అదనపు డీజీపీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేయడం చేస్తున్నారు. ఇంట్లో పెళ్లికి 170 మంది పోలీస్ సిబ్బంది డిసెంబర్లో అదనపు డీజీపీ ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఆయన వ్యవహారం పోలీస్ సిబ్బందిని మొహం ఎత్తుకోలేకుండా చేసింది. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంచేందుకు ఏకంగా విభాగంలోని డీఎస్పీ నుంచి హోంగార్డు వరకు అందరికీ టార్గెట్ పెట్టారు. వారంతా పదిహేను రోజులపాటు ఎలాంటి పెట్రోల్ ఖర్చులు లేకుండా కార్డులు పంచారు. అంతటితో అదనపు డీజీపీ ఆగలేదు. పెళ్లి సమయంలో వచ్చిన వీఐపీలందరికీ సేవచేయడం, చివరకు వారితో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించడం చేశాడని ఓ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. పెళ్లిరోజు, తర్వాత ఫాంహౌజ్‌లో జరిగిన పార్టీకి తన విభాగంలోని మొత్తం 170 మంది సిబ్బందిని ఆర్డర్లీ కింద వాడుకున్నట్టు నిఘా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ అధికార పార్టీ మాదే... పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ కావడంతోపాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు ఈయన కుటుంబీకులే కావడంతో అదనపు డీజీపీ మరింత రెచ్చిపోయారు. ఆయన కుటుంబీకులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో అక్కడి నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన వాహనాలు ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇప్పించడంలోనూ ఈ అదనపు డీజీపీ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించినా సక్సెస్ కాలేదని, అక్కడి ఉన్నతాధికారులకు ఈయన గురించి తెలియడంతో వద్దని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. చెప్పుతో కొట్టించాడు ఈ అదనపు డీజీపీ విభాగంలో నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఒకరు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గడిచిన నెలలో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన బంధువులను కారులో తీసుకెళ్లాడు. అక్కడ పొరపాటున ఓ బంధువుకు కారు తగిలింది. ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆ బంధువు ఫీలయ్యాడని, ఏకంగా ఆయన చేతే కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి సిబ్బందికి మర్యాద తెలియదని, తమ ప్రాంతం నుంచి సిబ్బందిని తెచ్చి పెట్టుకోవాలని అదనపు డీజీపీకి ఆయన బంధువు చెప్పినట్లు సిబ్బంది వివరించారు. -
అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం
చిలకలగూడ (హైదరాబాద్): అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం సృష్టించింది. లక్డీకపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో లక్తాకియా ఇంట్లోకి పాము ప్రవేశించింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని అధికారులకు తెలిపారు. డీజీపీ కార్యాలయం సెక్యూరిటీ అధికారులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ ఠాణా కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వెంకటేష్‌నాయక్ అర్ధగంట పాటు శ్రమపడి ఆరు అడుగుల పాము (జెర్రిపోతు)ను పట్టుకోవడంతో అడిషనల్ డీజీపీ కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.