
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్ర 5గంటల నుంచి తెలంగాణలో(నిజామాబాద్ మినహా) ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెల్లడించిన నాటి నుంచి రాష్ట్ర పోలీస్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. నిజామాబాద్‌లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.37.76 కోట్ల నగదుతో పాటు రూ.1.01 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకునే క్రమంలో ఎన్నికల కమిషన్ అనుమతి ఉందా లేదా అనే అంశాన్ని పరశీలిస్తామన్నారు. ఆ సమయంలో విచారణలో సదరు వ్యక్తులు వెల్లడించిన అంశాలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. అంతేకాక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఇప్పటి వరకూ 423 కేసులు నమోదు చేయడమే కాక 4 వేల అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో అదనపు బలగాల మోహరించామన్నారు. ఎన్నికల్లో మావోయిస్ట్‌ల ప్రభావం లేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగిలే చూస్తామని తెలిపారు.