గాయపడ్డ గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్‌లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి చేశారని అన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఎమ్‌ఐఎమ్‌తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్‌లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment