
దొరగారి వనంలో ‘ఖాకీ’ కూలీలు
► పోలీసు శాఖలో అదనపు డీజీపీ అరాచకాలు
► 60 ఎకరాల ఫాంహౌస్‌లో హోంగార్డులు, కానిస్టేబుళ్లతో కూలి పనులు
► పూలు కోయడం నుంచి అమ్మడం దాకా అడ్డగోలు చాకిరీ
► అయ్యవారి ఇంట్లో 10 మంది.. ఫాంహౌస్‌లో 30 మంది..
► పూలు అమ్మడానికి ప్రత్యేకంగా ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్
► డబ్బులు బ్యాంకులో జమచేయడానికి నలుగురు కానిస్టేబుళ్లు
► ఎదురుతిరిగితే సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులు
► బంధువుకు కారు తాకిందని కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించిన వైనం
► ఇంట్లో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించారంటూ ఓ ఎస్సై స్థాయి అధికారి కన్నీళ్లు
సాక్షి నెట్‌వర్క్ : ఆయనో సీనియర్ ఐపీఎస్. కీలక విభాగాలకు అధిపతిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో ఆయనదే పెత్తనం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కీలక పోస్టు వస్తుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఎక్కడ ఏమీ దొరక్కపోవడంతో ఖరీదైన ‘వ్యవసాయం’ మొదలుపెట్టారు. వికారాబాద్ జిల్లాలోని ముఖ్య ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఫాంహౌస్ కట్టుకున్నారు. హైదరాబాద్‌లో పూలకు.. అది కూడా బొకేల్లో ఉపయోగించే పూలకు భారీ డిమాండ్ ఉండటంతో ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది... అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు.. చేతిలో కానిస్టేబుళ్లు ఉండనే ఉంటారు.. ఇంట్లో హోంగార్డులు ఆర్డర్లీగా పనిచేస్తారు.. ఆయన విభాగంలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారు.. ఇదే అదునుగా చేసుకొని పూల సాగు మొదలుపెట్టారు. విత్తనాలు వేసే దగ్గరి నుంచి పూలు, కోయడం, వాటిని అందంగా కత్తిరించి, ప్యాక్ చేసి మార్కెట్‌లో అమ్మడం, ఆ డబ్బులు బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వరకు అన్ని కూలి పనులను కానిస్టేబుళ్లు, హోంగార్డులతో చేయించేస్తున్నారు! పోలీస్ శాఖలో అదనపు డీజీపీగా పనిచేస్తున్న ఈ అయ్యగారి ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన వ్యవహారంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.
వాళ్లు పేరుకు పోలీసులు.. చేసేది కూలీ..
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్లంతా ఉద్యోగంలో చేరారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రజల కోసం పనిచేద్దామనుకుంటే చివరకు వారితో చేయిస్తున్నది కూలీ పని. కీలక అధికారిగా పేరు సంపాదించిన అదనపు డీజీపీ వికారాబాద్ జిల్లాల్లోని తన ఫాంహౌజ్‌లో వారితో పూల వ్యవసాయం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆ వ్యవస్థలో రాష్ట్రం తరపున భద్రత కల్పించాల్సిన విభాగానికి అధిపతి అయి ఉండి సిబ్బందితో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. ఆయన విభాగానికి ప్రత్యేకంగా భద్రత కల్పిచేందుకు వినియోగించాల్సిన ఏఆర్ బలగాలను సైతం ఫాంహౌజ్‌లో పెట్టి పూల వ్యాపారం చేయిస్తున్నారు. పేరుకు పోలీస్ అని చెప్పుకోవడం తప్పా తాము చేస్తున్న పనికి ఏం సంబంధం లేదని సిబ్బంది ‘సాక్షి’తో గోడు వెల్లబోసుకున్నారు.
పోలీస్ వాహనాల్లో తీసుకెళ్లి మరీ..
పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లలో ఒకరు నుంచి ఇద్దరు ఆర్డర్లీగా పనిచేయడం సర్వసాధారణం. అయితే ఈ అదనపు డీజీపీ ఇంట్లో మాత్రం ఏకంగా 10 నుంచి 15 మంది పనిచేస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఫాంహౌజ్‌లో ప్రతీరోజు సికింద్రాబాద్ నుంచి పోలీస్ వాహనాల్లో 20 మందిని తీసుకెళతారని, ఆవసరమైతే ఆయన ఫాంహౌజ్‌కు దగ్గరలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని కూడా తీసుకెళ్తారని తెలిసింది. ఇలా రోజు 30 మంది పోలీస్ సిబ్బంది అదనపు డీజీపీ ఫాంహౌజ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారని సమాచారం.
ఆపరేషన్ గంజాయి పేరుతో..
గడిచిన నెలలో ఫాంహౌజ్‌లో పనులకు కూలీల అవసరం ఉండటంతో అదనపు డీజీపీ తన మెదడుకు పనిపెట్టారు. ప్రస్తుత సమయంలో కూలీ రేట్లు భారీగా ఉండటంతో పోలీస్ సిబ్బందితోనే చేయించేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ అంత మందిని వ్యవసాయి కూలీలుగా వాడిన సంగతి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఓ పథకం రూపొందించారు. వికారాబాద్ పరిసరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, వాటిని స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకోవడానికి 40 మంది పోలీస్ సిబ్బంది అవసరం అని చెప్పి ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఎలాగూ తన విభాగమే కావడం.. పైగా ఆన్ రికార్డు గంజాయి ఆపరేషన్ అని సర్క్యులర్ ఉండటంతో దర్జాగా 40 మంది సిబ్బందిని ఫాంహౌజ్‌కు తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ 40 మందిని తీసుకెళ్లి రెండ్రోజులపాటు ఫాంహౌజ్‌లోనే కూలి పని చేయించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎదురు తిరిగినందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయిస్తానని ఓ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌తో బెదిరించినట్టు సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది.
గుడిమల్కాపూర్‌లో పూల అమ్మకం
ఫాంహౌజ్‌లో సాగుచేసిన పూలను తెంపి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్‌లో విక్రయించే బాధ్యతలను ఒక రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఐదేళ్లుగా బదిలీ లేకుండా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఆ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్... అదనపు డీజీపీ మెప్పుకోసం ఈ పనిచేయడాన్ని అందివచ్చిన అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ప్రతీరోజు పూలను సాయంత్రం 6 గంటలకల్లా పోలీస్ విభాగానికి చెందిన బొలేరో వాహనంలో గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తీసుకురావడం, వాటిని విక్రయించి వెళ్లడం చేస్తున్నారు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నలుగురు కానిస్టేబుళ్లను సైతం అదనపు డీజీపీ నియమించారు. ప్రతీ రోజు కలెక్షన్ చేసుకోవడం, వచ్చిన డబ్బులను తీసుకెళ్లి వికారాబాద్‌లోని అదనపు డీజీపీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేయడం చేస్తున్నారు.
ఇంట్లో పెళ్లికి 170 మంది పోలీస్ సిబ్బంది
డిసెంబర్‌లో అదనపు డీజీపీ ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఆయన వ్యవహారం పోలీస్ సిబ్బందిని మొహం ఎత్తుకోలేకుండా చేసింది. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంచేందుకు ఏకంగా విభాగంలోని డీఎస్పీ నుంచి హోంగార్డు వరకు అందరికీ టార్గెట్ పెట్టారు. వారంతా పదిహేను రోజులపాటు ఎలాంటి పెట్రోల్ ఖర్చులు లేకుండా కార్డులు పంచారు. అంతటితో అదనపు డీజీపీ ఆగలేదు. పెళ్లి సమయంలో వచ్చిన వీఐపీలందరికీ సేవచేయడం, చివరకు వారితో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించడం చేశాడని ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. పెళ్లిరోజు, తర్వాత ఫాంహౌజ్‌లో జరిగిన పార్టీకి తన విభాగంలోని మొత్తం 170 మంది సిబ్బందిని ఆర్డర్లీ కింద వాడుకున్నట్టు నిఘా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అక్కడ అధికార పార్టీ మాదే...
పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ కావడంతోపాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు ఈయన కుటుంబీకులే కావడంతో అదనపు డీజీపీ మరింత రెచ్చిపోయారు. ఆయన కుటుంబీకులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో అక్కడి నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన వాహనాలు ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇప్పించడంలోనూ ఈ అదనపు డీజీపీ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించినా సక్సెస్ కాలేదని, అక్కడి ఉన్నతాధికారులకు ఈయన గురించి తెలియడంతో వద్దని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.
చెప్పుతో కొట్టించాడు
ఈ అదనపు డీజీపీ విభాగంలో నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఒకరు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గడిచిన నెలలో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన బంధువులను కారులో తీసుకెళ్లాడు. అక్కడ పొరపాటున ఓ బంధువుకు కారు తగిలింది. ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆ బంధువు ఫీలయ్యాడని, ఏకంగా ఆయన చేతే కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి సిబ్బందికి మర్యాద తెలియదని, తమ ప్రాంతం నుంచి సిబ్బందిని తెచ్చి పెట్టుకోవాలని అదనపు డీజీపీకి ఆయన బంధువు చెప్పినట్లు సిబ్బంది వివరించారు.