Labour Works
-
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
దొరగారి వనంలో ‘ఖాకీ’ కూలీలు
-
దొరగారి వనంలో ‘ఖాకీ’ కూలీలు
► పోలీసు శాఖలో అదనపు డీజీపీ అరాచకాలు ► 60 ఎకరాల ఫాంహౌస్‌లో హోంగార్డులు, కానిస్టేబుళ్లతో కూలి పనులు ► పూలు కోయడం నుంచి అమ్మడం దాకా అడ్డగోలు చాకిరీ ► అయ్యవారి ఇంట్లో 10 మంది.. ఫాంహౌస్‌లో 30 మంది.. ► పూలు అమ్మడానికి ప్రత్యేకంగా ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ► డబ్బులు బ్యాంకులో జమచేయడానికి నలుగురు కానిస్టేబుళ్లు ► ఎదురుతిరిగితే సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులు ► బంధువుకు కారు తాకిందని కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించిన వైనం ► ఇంట్లో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించారంటూ ఓ ఎస్సై స్థాయి అధికారి కన్నీళ్లు సాక్షి నెట్వర్క్ : ఆయనో సీనియర్ ఐపీఎస్. కీలక విభాగాలకు అధిపతిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో ఆయనదే పెత్తనం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కీలక పోస్టు వస్తుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఎక్కడ ఏమీ దొరక్కపోవడంతో ఖరీదైన ‘వ్యవసాయం’ మొదలుపెట్టారు. వికారాబాద్ జిల్లాలోని ముఖ్య ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఫాంహౌస్ కట్టుకున్నారు. హైదరాబాద్‌లో పూలకు.. అది కూడా బొకేల్లో ఉపయోగించే పూలకు భారీ డిమాండ్ ఉండటంతో ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది... అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు.. చేతిలో కానిస్టేబుళ్లు ఉండనే ఉంటారు.. ఇంట్లో హోంగార్డులు ఆర్డర్లీగా పనిచేస్తారు.. ఆయన విభాగంలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారు.. ఇదే అదునుగా చేసుకొని పూల సాగు మొదలుపెట్టారు. విత్తనాలు వేసే దగ్గరి నుంచి పూలు, కోయడం, వాటిని అందంగా కత్తిరించి, ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మడం, ఆ డబ్బులు బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వరకు అన్ని కూలి పనులను కానిస్టేబుళ్లు, హోంగార్డులతో చేయించేస్తున్నారు! పోలీస్ శాఖలో అదనపు డీజీపీగా పనిచేస్తున్న ఈ అయ్యగారి ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన వ్యవహారంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వాళ్లు పేరుకు పోలీసులు.. చేసేది కూలీ.. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్లంతా ఉద్యోగంలో చేరారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రజల కోసం పనిచేద్దామనుకుంటే చివరకు వారితో చేయిస్తున్నది కూలీ పని. కీలక అధికారిగా పేరు సంపాదించిన అదనపు డీజీపీ వికారాబాద్ జిల్లాల్లోని తన ఫాంహౌజ్‌లో వారితో పూల వ్యవసాయం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆ వ్యవస్థలో రాష్ట్రం తరపున భద్రత కల్పించాల్సిన విభాగానికి అధిపతి అయి ఉండి సిబ్బందితో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారు. ఆయన విభాగానికి ప్రత్యేకంగా భద్రత కల్పిచేందుకు వినియోగించాల్సిన ఏఆర్ బలగాలను సైతం ఫాంహౌజ్‌లో పెట్టి పూల వ్యాపారం చేయిస్తున్నారు. పేరుకు పోలీస్ అని చెప్పుకోవడం తప్పా తాము చేస్తున్న పనికి ఏం సంబంధం లేదని సిబ్బంది ‘సాక్షి’తో గోడు వెల్లబోసుకున్నారు. పోలీస్ వాహనాల్లో తీసుకెళ్లి మరీ.. పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారుల ఇళ్లలో ఒకరు నుంచి ఇద్దరు ఆర్డర్లీగా పనిచేయడం సర్వసాధారణం. అయితే ఈ అదనపు డీజీపీ ఇంట్లో మాత్రం ఏకంగా 10 నుంచి 15 మంది పనిచేస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఫాంహౌజ్‌లో ప్రతీరోజు సికింద్రాబాద్ నుంచి పోలీస్ వాహనాల్లో 20 మందిని తీసుకెళతారని, ఆవసరమైతే ఆయన ఫాంహౌజ్‌కు దగ్గరలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని కూడా తీసుకెళ్తారని తెలిసింది. ఇలా రోజు 30 మంది పోలీస్ సిబ్బంది అదనపు డీజీపీ ఫాంహౌజ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారని సమాచారం. ఆపరేషన్ గంజాయి పేరుతో.. గడిచిన నెలలో ఫాంహౌజ్‌లో పనులకు కూలీల అవసరం ఉండటంతో అదనపు డీజీపీ తన మెదడుకు పనిపెట్టారు. ప్రస్తుత సమయంలో కూలీ రేట్లు భారీగా ఉండటంతో పోలీస్ సిబ్బందితోనే చేయించేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ అంత మందిని వ్యవసాయి కూలీలుగా వాడిన సంగతి బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి ఓ పథకం రూపొందించారు. వికారాబాద్ పరిసరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, వాటిని స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకోవడానికి 40 మంది పోలీస్ సిబ్బంది అవసరం అని చెప్పి ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఎలాగూ తన విభాగమే కావడం.. పైగా ఆన్ రికార్డు గంజాయి ఆపరేషన్ అని సర్క్యులర్ ఉండటంతో దర్జాగా 40 మంది సిబ్బందిని ఫాంహౌజ్‌కు తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ 40 మందిని తీసుకెళ్లి రెండ్రోజులపాటు ఫాంహౌజ్‌లోనే కూలి పని చేయించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎదురు తిరిగినందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయిస్తానని ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్తో బెదిరించినట్టు సిబ్బంది ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది. గుడిమల్కాపూర్‌లో పూల అమ్మకం ఫాంహౌజ్‌లో సాగుచేసిన పూలను తెంపి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయించే బాధ్యతలను ఒక రిజర్వ్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఐదేళ్లుగా బదిలీ లేకుండా ఒకే స్థానంలో పనిచేస్తున్న ఆ రిజర్వ్ ఇన్స్పెక్టర్... అదనపు డీజీపీ మెప్పుకోసం ఈ పనిచేయడాన్ని అందివచ్చిన అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ప్రతీరోజు పూలను సాయంత్రం 6 గంటలకల్లా పోలీస్ విభాగానికి చెందిన బొలేరో వాహనంలో గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తీసుకురావడం, వాటిని విక్రయించి వెళ్లడం చేస్తున్నారు. ఈ డబ్బులు వసూలు చేసేందుకు నలుగురు కానిస్టేబుళ్లను సైతం అదనపు డీజీపీ నియమించారు. ప్రతీ రోజు కలెక్షన్ చేసుకోవడం, వచ్చిన డబ్బులను తీసుకెళ్లి వికారాబాద్‌లోని అదనపు డీజీపీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేయడం చేస్తున్నారు. ఇంట్లో పెళ్లికి 170 మంది పోలీస్ సిబ్బంది డిసెంబర్లో అదనపు డీజీపీ ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఆయన వ్యవహారం పోలీస్ సిబ్బందిని మొహం ఎత్తుకోలేకుండా చేసింది. తన ఇంట్లో జరిగే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంచేందుకు ఏకంగా విభాగంలోని డీఎస్పీ నుంచి హోంగార్డు వరకు అందరికీ టార్గెట్ పెట్టారు. వారంతా పదిహేను రోజులపాటు ఎలాంటి పెట్రోల్ ఖర్చులు లేకుండా కార్డులు పంచారు. అంతటితో అదనపు డీజీపీ ఆగలేదు. పెళ్లి సమయంలో వచ్చిన వీఐపీలందరికీ సేవచేయడం, చివరకు వారితో ఎంగిలి ప్లేట్లు కూడా తీయించడం చేశాడని ఓ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. పెళ్లిరోజు, తర్వాత ఫాంహౌజ్‌లో జరిగిన పార్టీకి తన విభాగంలోని మొత్తం 170 మంది సిబ్బందిని ఆర్డర్లీ కింద వాడుకున్నట్టు నిఘా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడ అధికార పార్టీ మాదే... పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్ కావడంతోపాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు ఈయన కుటుంబీకులే కావడంతో అదనపు డీజీపీ మరింత రెచ్చిపోయారు. ఆయన కుటుంబీకులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో అక్కడి నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన వాహనాలు ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇప్పించడంలోనూ ఈ అదనపు డీజీపీ కీలకపాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఆ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించినా సక్సెస్ కాలేదని, అక్కడి ఉన్నతాధికారులకు ఈయన గురించి తెలియడంతో వద్దని ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. చెప్పుతో కొట్టించాడు ఈ అదనపు డీజీపీ విభాగంలో నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఒకరు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గడిచిన నెలలో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన బంధువులను కారులో తీసుకెళ్లాడు. అక్కడ పొరపాటున ఓ బంధువుకు కారు తగిలింది. ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆ బంధువు ఫీలయ్యాడని, ఏకంగా ఆయన చేతే కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టించాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి సిబ్బందికి మర్యాద తెలియదని, తమ ప్రాంతం నుంచి సిబ్బందిని తెచ్చి పెట్టుకోవాలని అదనపు డీజీపీకి ఆయన బంధువు చెప్పినట్లు సిబ్బంది వివరించారు. -
రాజధానిలో ‘కష్ట’జీవి
కూలికి పిలిచి పనివ్వకుండా తిప్పిపంపేస్తున్న వైనం రోజుకు 12 గంటలు పని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో ఇదీ తీరు సాక్షి, అమరావతి: 8 గంటలు పని విధానం.. ఎన్నో పోరాటాలు చేసి కష్టజీవులు సాధించుకున్న హక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని తరలింపు హడావిడితో కష్టజీవి హక్కులు హరించుకుపోతున్నాయి. తక్కువ కూలితోనే 12 గంటలు పనిచేయిస్తూ కాంట్రాక్టర్లు కష్టజీవికి చుక్కలు చూపిస్తున్నారు. వెలగపూడి వద్ద నూతన రాజధాని నిర్మాణ పనులతో ఉపాధి దొరుకుతుందని సుదూర ప్రాంతాలనుంచి వలస వచ్చిన వేలాది మంది పేదలు బెంబేలెత్తే పరిస్థితి. మామూలు ఇచ్చే కూలి మొత్తంతోనే 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఫలితంగా కూలీలకు సరైన విశ్రాంతి, నిద్ర దొరక్క ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. అందుకు ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలే నిదర్శనం. గత నెల 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర, అంతకుముందు పశ్చిమబెంగాల్‌కు చెందిన మరో కూలీ మరణించిన సంఘటనలు కూలీలను కలవరపెడుతున్నాయి. దీంతో ఒడిస్సా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన అనేకమంది కూలీలు పనులు మానేసి వెళ్లిపోయారు. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రోజు కూలీలను బలవంతంగా సచివాలయ నిర్మాణ పనులకోసం తీసుకెళ్తున్నారు. అక్కడ పరిస్థితులు తెలుసుకున్న కూలీలు సచివాలయ పనులకు రాలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ స్థితిలో వెలగపూడి వద్ద చేపట్టిన తాత్కాలిక సచివాలయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. అగ్రిమెంట్ రాసివ్వాలట! తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యే వరకు కూలీలు వెళ్లకుండా ఉండేందుకు వారి నుంచి వందరూపాయల బాండ్‌పై అగ్రిమెంట్ రాయించుకుంటున్నట్లు కూలీలు వెల్లడించారు. ఆ పత్రాలు కాంట్రాక్టర్ల వద్దే ఉంచుకుని కూలీలను బెదిరిస్తున్నట్లు శ్రీకాకుళానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ నిబంధనలు తెలుసుకున్న కొందరు కూలీలు సచివాలయ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఇష్టం లేక వెనుదిరిగి వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్ల నిబంధనలకు అంగీకరించి సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 2వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారితో పాటు ఎక్కువగా నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల కూలీలు ఉన్నారు. పనులిస్తామని చెప్పి సాయంత్రానికి తిప్పి పంపారు రెండు రోజుల క్రితం పని ఉందని చెప్పి 10 మందిని బెంజిసర్కిల్‌లో బస్సెక్కించారు. రాజధాని పనులు చేస్తున్నచోట దిగబెట్టారు. పనులు చెప్పకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకుండా సాయంత్రం ఒట్టిచేతుల్తో తిప్పిపంపారు. - చిన్న, విజయవాడ కూలిడబ్బుల కోసం అర్ధరాత్రి వరకు... శనివారం పని ఇస్తామని తీసుకెళ్లారు. సాయంత్రం 5.30వరకు పనిచేయించుకున్నారు. డబ్బులివ్వమంటే అక్కడికెళ్లి తీసుకో.. అంటూ తిప్పారు. రాత్రి 11గంటలకు డబ్బులిచ్చారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.400లే. అదే మేం బయట చేసుకుంటే రోజుకు రూ.600 వస్తుంది. అందుకే మరుసటిరోజు నుంచి వెళ్లటం మానేశాం. -సంతోష్, విజయవాడ అక్కడ పనిచేయలేం రాజధాని కట్టేచోట పనిచేయలేం సార్. 12గంటలు పనిచేయాలంట. పనిచేయాలన్నా అగ్రిమెంట్ రాసివ్వాలంట. కూలి మాత్రం రోజుకు రూ.400లేనట. ఇలా అయితే ఎలా పనిచేయగలం. షిఫ్ట్‌ల ప్రకారం పెట్టి పనిచేయాలని చెప్పాలి. కూలి గిట్టుబాటు కావాలి కదా? -బాలస్వామి, విజయవాడ -
దుబాయిలో కరీంనగర్ వాసి మృతి
సిద్దిపేట(కరీంనగర్): దుబాయిలో కూళీ పనులు చేస్తూ కోనాయిపల్లి వాసి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోనాయిపల్లి గ్రామానికి చెందిన మల్లమారి రాములు (50) దుబాయిలో 25 సంవత్సరాలుగా కూలీ పనులు చేస్తున్నాడు. రెండు సంవత్సరాల కిందట కూతురు వివాహం జరిపించి తిరిగి దుబాయి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలో రాములుకు గుండెపోటు రావడంతో మృతి చెందాడని సమాచారం అందింది. తన భర్త మృతదేహన్ని ఇండియాకు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మృతుని బార్య ఎల్లవ్వ వేడుకుంటొంది. -
మద్యం మత్తులో కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం(అశ్వారావుపేట): మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని నారంవారిగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం... నారంవారిగూడెం(కొత్తూరు)కు చెందిన సంగం శివాజీ, శంకా వీర్రాజు కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీర్రాజు మద్యం మత్తులో శివాజీ ఇంటికి వచ్చి.. గొడవపడి క త్తితో దాడి చేశాడు. ఈదాడిలో శివాజీ నడుము, తుంటె, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బంధువులు కేకలు వేయడంతో వీర్రాజు పరారయ్యాడు. బాధితుడిని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సత్తుపల్లి తరలించాలని వైద్యులు సూచించారు. -
ఇలా ఓ నాన్న తీర్పు
కొడుకును గొంతు నులిమి చంపిన తండ్రి పాలకుర్తి: కన్నకొడుకును దారుణంగా గొంతు నులిమి హత్య చేయడంతో పాటు, మృతదేహా న్ని చెరువులో పడేసిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మహంకాళి ఆంజనేయులు- కవిత దంపతులకు కుమారులు రాకేష్, కమల్ ఉన్నారు. ఆంజనేయులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ తల్లి వద్ద ఉంటుండగా, కవిత గ్రామంలోనే ఉంటూ పిల్లల్ని పోషిస్తోంది. బుధవారం ఆంజనేయులు గ్రామానికి వచ్చి కొడుకులను శివారులోని ఎర్రచెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన కవిత విషయం తెలిసి, గ్రామస్తులతో కలిసి పిల్లల కోసం వెతికింది. అయితే, ఆంజనేయులు పెద్దకుమారుడు రాకేష్‌ను తీసుకొని తీగారం గుట్టకు వెళ్లాడు. బంధువులకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ‘చెరువు గట్టు మీద చిన్న కొడుకు కమల్ గొంతు పిసికి చంపేసి, చెరువులో పడేశాను.’అని చెప్పాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. కాగా, గురువారం ఆంజనేయులు భార్యకు ఫోన్ చేసి.. ‘చిన్నోన్ని చంపేసి పెద్దోన్ని తీసుకొస్తున్నా’ అని చెప్పాడు. గ్రామస్తులు చిన్న కొడుకు గురించి ప్రశ్నించగా, చెరువులో శవాన్ని చూపించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని చితకబాది జనగామ పోలీసులకు అప్పగించారు.