సాక్షితో తమ గోడు వెల్లబోసుకుంటున్న కూలీలు
కూలికి పిలిచి పనివ్వకుండా తిప్పిపంపేస్తున్న వైనం
రోజుకు 12 గంటలు పని
తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో ఇదీ తీరు
సాక్షి, అమరావతి: 8 గంటలు పని విధానం.. ఎన్నో పోరాటాలు చేసి కష్టజీవులు సాధించుకున్న హక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని తరలింపు హడావిడితో కష్టజీవి హక్కులు హరించుకుపోతున్నాయి. తక్కువ కూలితోనే 12 గంటలు పనిచేయిస్తూ కాంట్రాక్టర్లు కష్టజీవికి చుక్కలు చూపిస్తున్నారు. వెలగపూడి వద్ద నూతన రాజధాని నిర్మాణ పనులతో ఉపాధి దొరుకుతుందని సుదూర ప్రాంతాలనుంచి వలస వచ్చిన వేలాది మంది పేదలు బెంబేలెత్తే పరిస్థితి. మామూలు ఇచ్చే కూలి మొత్తంతోనే 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఫలితంగా కూలీలకు సరైన విశ్రాంతి, నిద్ర దొరక్క ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. అందుకు ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలే నిదర్శనం.
గత నెల 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర, అంతకుముందు పశ్చిమబెంగాల్‌కు చెందిన మరో కూలీ మరణించిన సంఘటనలు కూలీలను కలవరపెడుతున్నాయి. దీంతో ఒడిస్సా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన అనేకమంది కూలీలు పనులు మానేసి వెళ్లిపోయారు. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రోజు కూలీలను బలవంతంగా సచివాలయ నిర్మాణ పనులకోసం తీసుకెళ్తున్నారు. అక్కడ పరిస్థితులు తెలుసుకున్న కూలీలు సచివాలయ పనులకు రాలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ స్థితిలో వెలగపూడి వద్ద చేపట్టిన తాత్కాలిక సచివాలయ పనులు మందకొడిగా సాగుతున్నాయి.
అగ్రిమెంట్ రాసివ్వాలట!
తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యే వరకు కూలీలు వెళ్లకుండా ఉండేందుకు వారి నుంచి వందరూపాయల బాండ్‌పై అగ్రిమెంట్ రాయించుకుంటున్నట్లు కూలీలు వెల్లడించారు. ఆ పత్రాలు కాంట్రాక్టర్ల వద్దే ఉంచుకుని కూలీలను బెదిరిస్తున్నట్లు శ్రీకాకుళానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ నిబంధనలు తెలుసుకున్న కొందరు కూలీలు సచివాలయ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఇష్టం లేక వెనుదిరిగి వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్ల నిబంధనలకు అంగీకరించి సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 2వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారితో పాటు ఎక్కువగా నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల కూలీలు ఉన్నారు.
పనులిస్తామని చెప్పి సాయంత్రానికి తిప్పి పంపారు
రెండు రోజుల క్రితం పని ఉందని చెప్పి 10 మందిని బెంజిసర్కిల్‌లో బస్సెక్కించారు. రాజధాని పనులు చేస్తున్నచోట దిగబెట్టారు. పనులు చెప్పకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకుండా సాయంత్రం ఒట్టిచేతుల్తో తిప్పిపంపారు.
- చిన్న, విజయవాడ
కూలిడబ్బుల కోసం అర్ధరాత్రి వరకు...
శనివారం పని ఇస్తామని తీసుకెళ్లారు. సాయంత్రం 5.30వరకు పనిచేయించుకున్నారు. డబ్బులివ్వమంటే అక్కడికెళ్లి తీసుకో.. అంటూ తిప్పారు. రాత్రి 11గంటలకు డబ్బులిచ్చారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.400లే. అదే మేం బయట చేసుకుంటే రోజుకు రూ.600 వస్తుంది. అందుకే మరుసటిరోజు నుంచి వెళ్లటం మానేశాం.
-సంతోష్, విజయవాడ
అక్కడ పనిచేయలేం
రాజధాని కట్టేచోట పనిచేయలేం సార్. 12గంటలు పనిచేయాలంట. పనిచేయాలన్నా అగ్రిమెంట్ రాసివ్వాలంట. కూలి మాత్రం రోజుకు రూ.400లేనట. ఇలా అయితే ఎలా పనిచేయగలం. షిఫ్ట్‌ల ప్రకారం పెట్టి పనిచేయాలని చెప్పాలి. కూలి గిట్టుబాటు కావాలి కదా?
-బాలస్వామి, విజయవాడ