ravindranath
-
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. గురువారం ఓట్లు లెక్కించారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి నర్తు రామారావు, కర్నూలు జిల్లా నుంచి మధుసూదన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ ఘనవిజయం సాధించారు. ఈ నాలుగు స్థానాల్లోనూ సంఖ్యా బలం లేకపోయినా స్వతంత్రుల ముసుగులో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. కాగా, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలు మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎస్.మంగమ్మ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రమణ్యం, మేరుగ మురళీధర్, కుడిపూడి సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమలో రెండు స్థానాలూ వైఎస్సార్సీపీకే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైఎస్సార్సీపీ దక్కించుకుంది. గురువారం ఏలూరులో జరిగిన ఓట్ల లెక్కింపులో గంటన్నరలోనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1105 ఓట్లకు గాను 1088 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25 చెల్లుబాటు కాలేదు. వాటిలో 20 టీడీపీవికాగా, మరో 5 వైఎస్సార్‌సీపీవి. వాస్తవబలం కంటే వైఎస్సార్సీపీకి అదనంగా 50 ఓట్లు రావడం గమనార్హం. చెల్లుబాటైన 1063 ఓట్లలో మొదటి ప్రాధాన్యతలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 122 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్‌లను విజేతలుగా ప్రకటించారు. కర్నూలులో వైఎస్సార్సీపీకి బలానికి మించి ఓట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బోయ మధుసూదన్ ఘన విజయం సాధించారు. కర్నూలులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 9.30 గంటలకే పూర్తయింది. ఇక్కడ మొత్తం 1,178 ఓట్లలో 1,136 పోలయ్యాయి. 53 ఓట్లు చెల్లలేదు. ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వైఎస్సార్సీపీకి పోలయ్యాయి. వాస్తవానికి వైఎస్సార్సీపీకి 959 ఓట్లు బలం ఉండగా, 988 ఓట్లు వచ్చాయి. అధికంగా నమోదైన 29 ఓట్లనుబట్టి చూస్తే టీడీపీ, బీజేపీ, వామపక్షాల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీకే మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులు ఎన్.మోహన్‌రెడ్డికి 85, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. శ్రీకాకుళంలో రామారావు ఘన విజయం శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయ ఢంకా మోగించారు. మొత్తం 752 ఓట్లు పోలవగా.. అందులో నర్తు రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు. దీంతో 524 ఓట్ల ఆధిక్యతతో నర్తు విజయం సాధించారు. -
ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుంటాం
-
ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు
సాక్షి, అమరావతి/సాక్షి, కాకినాడ/కాకినాడ సిటీ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్పు చేస్తున్నామని, అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. విచారణ తర్వాత అరెస్టు చేయాల్సి వస్తే చేస్తామని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సహకరించక పోవడం వల్లే పూర్తి వివరాలు సేకరించడం ఆలస్యమైందని చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే.. ► ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర సుబ్రహ్మణ్యం ఐదారు సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతన్ని విధుల నుంచి తొలగించారు. సుబ్రహ్మణ్యం 20వ తేదీన అనుమానాస్పదంగా చనిపోయినట్లు అతని తల్లి రత్నం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. ► ఫిర్యాదు ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర నుంచి సాయంత్రం 7.30 – 8 గంటల మధ్య మణికంఠ అనే కుర్రాడు వస్తే అతనితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు వాళ్ల తల్లి ఫోన్ చేస్తే త్వరగానే ఇంటికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి 12.30 గంటలకు అనంతబాబు దగ్గర నుంచి వారి తండ్రికి ఫోన్ వచ్చింది. ► సుబ్రహ్మణ్యం ప్రమాదానికి గురై స్పృహ తప్పి పడిపోయాడని, తాను అక్కడికి వెళుతున్నానని ఆయన చెప్పాడు. మళ్లీ 1.30 గంటలకు వాళ్ల రెండో అబ్బాయి నవీన్‌కు ఫోన్ చేశాడు. సుబ్రహ్మణ్యం స్పృహ తప్పి పడిపోయి ఉంటే భానుగుడి జంక్షన్లో ఉన్న అమృత హాస్పిటల్‌కి తీసుకు వస్తున్నానని, మీరు కూడా రావాలని వాళ్లకి చెప్పాడు. ► దీంతో నవీన్, అతని స్నేహితులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు వాళ్ల సమక్షంలోనే డాక్టర్లు సుబ్రహ్మణ్యంను పరిశీలించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహంతోపాటు అతని సోదరుడు, స్నేహితుల్ని అనంతబాబు తన వాహనంలో కొండాయపాలెంలోని వాళ్ల తల్లితండ్రులు ఉండే ఆపార్టుమెంట్ (అతని తండ్రి సత్యనారాయణ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు) దగ్గరకు తీసుకెళ్లారు. ► మృతదేహంతోపాటు ఎమ్మెల్సీ తెల్లవారుజామున 4 గంటల వరకు అక్కడే ఉండి.. వారు నిలదీయడంతో కారు, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. ఈ మరణం ఎలా జరిగిందనే దానిపై అనుమానాలున్నాయి కాబట్టి ఫిర్యాదును బట్టి కేసు రిజిస్టర్ చేశాం. ► ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలు, ఆధారాలను బట్టి పారదర్శకంగా సీనియర్ అధికారులతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. డీజీపీ ప్రతి గంటకు కేసును సమీక్షించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదైంది కాబట్టి మృతదేహాన్ని శవపంచనామా చేస్తున్నప్పుడు రక్త సంబంధీకుల వాంగ్మూలాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ► శవ పంచనామా అయిన వెంటనే పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పంపాలి. కానీ బంధువులకు ఉన్న అనుమానాల నేపథ్యంలో సహకరించలేదు. శవ పంచనామాకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరినా రాలేదు. చివరికి వారిని ఒప్పించి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువచ్చి శవ పంచనామా మొదలుపెట్టాం. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతని భార్య, ఇతరులను విచారించాం. పోస్టుమార్టం తర్వాతే స్పష్టత ► అనంతబాబుపై తమకు అనుమానం ఉందని, ఆయనే ప్రధాన నిందితుడని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. వాళ్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ప్రస్తుతానికి అనంతబాబును ప్రధాన నిందితుడుగా భావిస్తున్నాం. మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుంది. ► శవ పంచనామా తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేస్తాం. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు, అతనితో మద్యం సేవించిన మిత్రులు, పరిశీలించిన వైద్యులు, మిగిలిన సాక్షులను యుద్ధ ప్రాతిపదికన విచారిస్తాం. కేసును 302 సెక్షన్‌గా మార్చబోతున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అదుపులోకి తీసుకుంటాం. విచారణ జరిపి చట్ట పరంగా అరెస్టు చేయాల్సి వస్తే చేస్తాం. -
మొక్కజొన్న మూటల్లో గంజాయి రవాణా
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్టిన నిఘా సత్ఫలితాలనిస్తోంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు కిర్లంపూడి మండలం క్రిష్ణవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,419 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.30 కోట్లు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం చెప్పారు. ముందస్తు సమాచారంతో కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి వెలుగు చూసింది. ఒక కారు, లారీలో మొక్కజొన్న బస్తాల మధ్యన 66 మూటలలో 1,419 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకుని విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు, మహారాష్ట్రకు చెందిన చొప్పడి ప్రతాప్‌లను అరెస్ట్ చేశారు. జయశ్వాల్, కరణం రవీంద్రబాబు, రాంబాబు అనే వ్యక్తులు పరారైనట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎడిషనల్ ఎస్పీ, ఎస్ఈబీ డీఎస్పీ అంబికాప్రసాద్, జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. -
సమగ్ర విచారణ జరుపుతున్నాం..
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘తుపాకులా.. పప్పుబెల్లాలా’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనంపై పోలీస్ యంత్రాంగం స్పందించింది. తుపాకులు వేలం వేయడంలో అవకతవకలు జరిగిన విషయాన్ని పోలీసులు అంగీకరించారు. అంతర్గత తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం నిర్వహణ ప్రక్రియలో జరిగిన లోపాలు, సంబంధిత విభాగాల పోలీస్ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. విచారణలో బహిర్గతమయ్యే వాస్తవాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా శాఖాపరమైన చర్యలుంటాయని ఎస్పీ పేర్కొన్నారు. -
ఉద్యోగం చేయలేను.. డీజీపీ రాజీనామా
సాక్షి, బెంగళూరు : పదోన్నతి లభించలేదని అసంతృప్తితో కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటవీశాఖ అదనపు డీజీపీగా ఉన్న ఆయన బుధవారం జరిగిన ఐపీఎస్‌ల పదోన్నతుల్లో తన పేరు లేదని కినుక వహించారు. బుధవారం అర్ధరాత్రి డీజీపీ ప్రవీణ్‌సూద్ కు రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లగా భేటీ కుదరలేదు. దీంతో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు. ముగ్గురికి ప్రమోషన్లు తాజా పదోన్నతుల్లో అమర్‌కుమార్‌పాండేను శాంతిభద్రతల అదనపు డీజీపీ పోస్టు నుంచి డీజీపీ– పోలీస్ శిక్షణ విభాగానికి, టీ.సునీల్‌కుమార్‌ను ఏసీబీ ఏడీజీపీ నుంచి సీఐడీ ప్రత్యేక ఆర్థిక నేరాల విభాగం డీజీపీగా, సీహెచ్.ప్రతాప్‌రెడ్డికి ఏడీజీపీ– పోలీస్ సంబంధాలు, ఆధునీకరణ, శాంతిభద్రతల విభాగం బాధ్యతలను అప్పగించారు. ఈ ముగ్గురికీ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా పదోన్నతులు జారీచేసింది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ నిరాశకు గురయ్యారు. సునీల్‌కుమార్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నప్పటికీ ప్రమోషన్ దక్కింది. దీంతో ఆయన ఒక్కరోజు డీజీపీగా రికార్డుల్లో ఉంటారు. నా కంటే జూనియర్లకు ఇస్తారా: రవ్రీందనాథ్ రాజీనామాపై విలేకరులతో రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగానికి బుధవారం రాత్రి రాజీనామా చేశాను. నా కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేను. పోలీస్‌శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం సామాన్యం. కానీ వీటన్నింటిని భరిస్తూ ఉండరాదు. ఈ తప్పులపై పోరాడాలి. డీజీపీకి నాకంటే రూ.300 వేతనం అధికంగా వస్తుందంతే. అయితే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించా అని చెప్పారు. తన సమర్థతలో లోపాలు ఉన్నాయని అంటుండడం బాధ కలిగిస్తోందన్నారు. ఇద్దరు ఐపీఎస్‌ల రిటైర్మెంటు బనశంకరి: సీనియర్ ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, అశిత్‌మోహన్‌ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమాన్ని గురువారం కోరమంగల కేఎస్ఆర్పీ మైదానంలో నిర్వహించారు. డీజీపీ ప్రవీణ్‌సూద్ వీరికి ప్రభుత్వ గౌరవాలతో వీడ్కోలు పలికారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ కర్ణాటక తనకు చాలా ప్రేమ ఇచ్చిందని, అందరికీ ధన్యవాదాలని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ బోట్లును అనుమతించకండి: ఎస్పీ
సాక్షి, కృష్ణా : మంగళవారం జిల్లా ఎస్పీ రవీద్రనాథ్ బాబు మెరైన్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెరైన్ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. మెరైన్ బోట్లను నిత్యం గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలు, మెరైన్ సిబ్బందితో కలిసి తీర ప్రాంత గ్రామాలలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిలకలదిండి, ఓర్లగొందితిప్ప, పాలకాయ తిప్పి పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ పరిస్థితులు సమీక్షిస్తామని అన్నారు. మత్స్యకారుల సంరక్షణ కోసం నిరంతర కార్యాచరణ రూపొందిస్తున్నామని, తీర ప్రాంత సంరక్షణ కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, వేట వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్లో సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేసి, మెరైన్ ఉనికి చాటేలా కార్యాచరణ చేపడతామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ బోట్లు కాకుండా, ప్రైవేట్ బోట్లు అనుమతించ వద్దని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సత్తిబాబు, కృష్ణ కాంత్ పటేల్ , డీఎస్పీ ధర్మేంద్ర, మెరైన్ ఎసై, సిఐలు పాల్గొన్నారు. -
245 మంది చిన్నారుల గుర్తింపు!
సాక్షి, కృష్ణాజిల్లా: బడి వయసు పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఎస్పీ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్లు, దుకాణాలల్లో మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించామని, వారిలో 183 మంది బాలురు, 62 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని పాపను గుర్తించి.. ఆ చిన్నారిని తిరిగి బడికి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మైలవరం సర్కిల్ పరిధిలో బడి బయట ఉన్న 29 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు స్టేషన్లో కౌన్సిలింగ్ ఇప్పించి పంపించినట్లు ఆయన తెలిపారు. -
వాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది
సాక్షి, అమరావతి: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కేసు వ్యవహారంలో విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ఆదేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని వాపోయారు. కొంతమంది ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కేసు విషయంలో విచారణే అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని తెలిపారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? ఏపీపీఎస్సీ నుంచి నేరుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. (చదవండి: సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’) -
డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కేసు వ్యవహారంలో ఆయన అధికారులతో కుమ్మకైనట్టు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశంతో రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని అన్నారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. ఈ కేసు విషయంలో విచారణ అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు. తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. -
ఇద్దరు ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, కృష్ణా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. ఈ మేరకు ఇద్దరు ఎస్ఐలు, ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. కైకలూరు పేకాట నిర్వాహకుల బృందంతో కొంతమంది పోలీసులు సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమని తేలడంతో కలిదిండి ఎస్సై సుధాకర్, కానిస్టేబుల్ రజనీకుమార్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఓ పార్టీ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పెనుగంచిప్రోలు ఎస్సై హశ్వక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. -
సాధారణ మనిషిలా మూటలు మోసిన కేరళ మంత్రి
-
రైల్వే ట్రాక్ పరిశీలన
రాయదుర్గం రూరల్ : రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం మీదుగా బెంగళూరుకు వెళ్లే రైల్వేలైన్‌ను చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏ.కే. గుప్తా, చీఫ్ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైలు వెళ్లే మార్గాలను మ్యాపుల ద్వారా అధికారులకు వివరించారు. మోటార్ ట్రాలీపై 40 కిలోమీటర్లు వెళ్లి రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. అక్టోబర్‌లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకూ కొత్త రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్యాకింగ్ మిషన్ ద్వారా పనులు వేగవంతం చేయాలని అధికారులను వారు ఆదేశించారు. రైల్వే పనులను అత్యంత నాణ్యతగా నిర్మించాలని సూచించారు. 2012లో రాయదుర్గం నుండి కళ్యాణదుర్గం వరకు రైల్వే పనులు ప్రారంభించారు. రైల్వేలైన్ కోసం రెండు విడతల్లో రైతుల భూములను కొనుగోలు చేసి ట్రాక్‌ను నిర్మించారు. మండలంలోని ఆవులదట్ల గ్రామ సమీపంలో నిర్మించిన రైల్వే స్టేషన్ పనులను కూడా వారు పరిశీలించారు. భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
90 డిపోల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ ఆర్టీసీ
-
చచ్చినా చావే..
♦ శ్మశానం విషయంలో ఇరువర్గాల వివాదం ♦ ఐదు గంటలపాటు రోడ్డుపైనే మృతదేహం ♦ తహశీల్దార్, ఎస్సైల చర్చలతో ముగిసిన అంత్యక్రియలు కలిగిరి : మండలంలోని అనంతపురం ఎస్సీ కాలనీలో శ్మశానానికి సంబంధించి ఇరువర్గాలు వారు గురువారం వివాదానికి దిగారు. దీంతో యువకుని మృతదేహం ఐదు గంటలపాటు నడి రోడ్డుపైనే ఉంచారు. ఎస్సీకాలనీకి చెందిన 15 కుటుంబాలు పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ వద్ద రెండేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. అక్కడ నివసిస్తున్న పాతల చిరంజీవి (22) అనారోగ్యంతో గురువారం వేకువజామున మృతి చెందాడు. మృతదేహాన్ని ఖననం చేయడానికి బంధువులు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరారు. పాతకాలనీవాసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో మృతదేహన్ని రోడ్డుపై ఉంచి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై ఖాదర్‌బాషా సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దార్ రవీంద్రనాథ్ వచ్చి ఇరువర్గాలతో చర్చించారు. తరతరాలుగా ఈ శ్మశానాన్నే వినియోగిస్తున్నామని మృతుని బంధువులు తెలిపారు. మృతుని కుటుంబీకులు కొత్త కాలనీలో పట్టాలు పొందారని, వారికి అక్కడే శ్మశానం కేటాయించాలని పాతకాలనీవాసులు పట్టుపట్టారు. దీంతో సమస్యను తహశీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు గ్రామంలో ఊరేగింపులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించే ఇరువర్గాలను ఒప్పించారు. ఎస్సై పర్యవేక్షణలో రాత్రి 8 గంటకు అంత్యక్రియలు ముగిశాయి. -
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారికి 3 ఏళ్ల జైలు
విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఫారెస్ట్ ఆఫీసర్‌కి మూడేళ్లు జైలు శిక్ష పడింది. పాలకొండ ఫారెస్ట్ రెంజర్గా పని చేసిన రవీంద్రనాథ్‌కి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష రూపాయల జరిమానాని ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించింది. ప్రస్తుతం రవింద్రనాథ్ పాడేరు ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య
నగరంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు భార్యతో గొడవ జరగడంతో ప్రాణం తీసుకోగా.. మరొకరు ప్రేమికురాలిని మరిచిపోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు స్థానికుల హృదయాలను కలచివేశాయి. పెళ్లైన మూడు నెలలకే.. జీడిమెట్ల:పెళ్లై మూడు నెలలు కూడా గడవ లేదు... తరచూ భార్యతో గొడవ జరుగుతోంది... దీంతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. ఎస్సై లింగ్యా నాయక్ కథనం ప్రకారం... గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన రమేష్ కుమారుడు మురళీ విహర్(29)కి తూర్పు గోదావరి జిల్లా అల్లవరం గ్రామానికి చెందిన యువతితో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైంది. అది ప్రేమగా మారింది. విషయాన్ని మురళి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో మురళి పని చేస్తున్నాడు. భార్యతో కలిసి జీడిమెట్ల జనప్రియ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. కాగా, నెల రోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మురళి బెడ్ రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమికురాలిని మరిచిపోలేక.. భాగ్యనగర్‌కాలనీ: ప్రేమించిన అమ్మాయిని తప్ప మరెవరినీ మనసులో ఊహించుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేట ఇందిరానగర్‌కు చెందిన సంగెపు రవీంద్రనాథ్(26) భార్యతో కలిసి మాధవరంనగర్ కాలనీలో ఉంటున్నాడు. భర్త హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా.. భార్య డెంటల్ డాక్టర్. వీరికి ఆగస్టులో పెళ్లైంది. రవీంద్రనాథ్ బుధవారం విధులు ముగించుకొని ఇంట్లోనే ఉన్నాడు. స్నేహితులు వచ్చి తలుపుకొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో స్థానికుల సహాయంతో ఇంటి యజమాని కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా రవీంద్రనాథ్ అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. అదే సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్య విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి కన్నీరు మున్నీరైంది. స్థానికులు వెంటనే బంధువులకు, కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. రవీంద్రనాథ్ రాసిన సూసైడ్‌నోట్ దొరికింది. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ‘ప్రేమించిన అమ్మాయి నాకెంతో సాయం చేసింది. ఆమె లేకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని, ఆమె నాతో లేకపోవడం ప్రాణం పోయినట్లు ఉంది’.. అని మృతుడు సూసైడ్ నోట్లో రాశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పొగచూరిన బతుకులు
బీడీ కార్మికులు... రెక్కాడితేగానీ డొక్కాడని వారు..ప్రతి రోజూ కుటుంబం యావత్తూ కష్టపడినా దక్కే ప్రతిఫలం అంతంతే.. వెయ్యి బీడీలు చుడితే వచ్చే కూలీ రూ. 150 మాత్రమే.. ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమ పథకాలు వీరికి ఏ మాత్ర ం అందడం లేదు.. ఇల్లు, పింఛన్, ఇన్సూరెన్స్ ఇలా ఒక్క సౌకర్యాన్ని కూడా వీరు పొందలేకపోతున్నారు.. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. రోజురోజుకూ వీరి కష్టం పెరుగుతుందేగానీ వీరి జీవితాల్లో మార్పు కానరావడం లేదు... దుర్భర పరిస్థితుల్లో జీవితాలను వెల్లదీస్తున్న బీడీ కార్మికులను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పలుకరించారు.. వీఐపీ రిపోర్టర్‌గా మారి వారి పరిస్థితులను చూసి చలించిపోయారు. అసెంబ్లీలో గళమెత్తుతా... బీడీ కార్మికులు దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.. వీరి సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా.. చాలీచాలని కూలీలతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.. కుటుంబం యావత్తూ కష్టపడి బీడీలు చుట్టినా వచ్చే కూలీ అంతంత మాత్రమే.. వీరి పిల్లలు చదువులకు నోచుకోవడం లేదు.. జిల్లాలోని వేల బీడీ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.. చేనేత కార్మికుల తరహాలోనే వీరికి కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి.. బ్యాంకులు వీరి బాగోగుల గురించి పట్టించుకోవాలి. ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి.. బీడీలు చుడుతుండటంతో టీబీ, ఆయాసం వంటి వ్యాధులకు గురవుతున్నారు.. వీరికోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి.. ఇల్లులేని వారికి పక్కా గృహాలను మంజూరు చేయాలి.. - రవీంద్రనాథ్‌రెడ్డి ఎమ్మెల్యే, కమాలపురం తెల్లారకముందే ఆ నిరుపేద మహిళలు తమ రోజువారి పని ఆరంభిస్తారు. కాసిన్ని టీ నీళ్లు గొంతులో పోసుకుని పద్మాసనం వేసి... సగం పొగాకు నిండిన చాటను తీసుకుని పని మొదలెడతారు.. ఆకు చుట్టడం.. పొగ చూరడం.. ఇంతే రోజంతా ఇదే పని.. 8 గంటలు..9,10.....1, 2 ఇలా గడియారంలో ముళ్లు తిరుగుతూనే ఉంటుంది... గంటలు గడుస్తూనే ఉంటాయి. అయినా లేవరు. కడుపులో పేగులు సిగ్నల్ ఇస్తున్నా గుక్కెడు మంచినీళ్లతో దాహం తీర్చుకుంటూ.. అలాగే కడుపుమాడ్చుకుంటూ పనిలో నిమగ్నమవుతుంటారు. టీ..టీఫెన్ కాదుకదా.. ఒక్కోసారి మధ్యాహ్నం అన్నానికీ లేవరు.. ఇలా రోజంతా పనిచేస్తేగానీ ఆ పూట తిండికి సరిపోయే కూలిరాని పరిస్థితి వారిది. వేళకు అన్నం తినకపోయినా.. ఈ పనితో రోగాలు వస్తాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన దుస్థితి. ఇలా ఒకటి రెండు కాదు దశాబ్దాల తరబడి అదే వారి జీవితం. బీడీ కార్మికుల వ్యథ ఇది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి వీఐపీ’ రిపోర్టర్‌గా మారి వారిని పలకరించినప్పుడు వారు వెల్లబుచ్చిన ఆవేదనకు అక్షరరూపం ఇది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి : నమస్తేమ్మా...! బీడిలు మీరు తయారు చేస్తారా? మిమ్మిల్ని ఎవరైనా పట్టించుకున్నారా?? పుల్లమ్మ : అవును సార్.. మేం తయారు చేసుకోవాలి. మా గురించి ఎవరూ పట్టించుకున్నోళ్లే లేర్సార్. ఎమ్మెల్యే: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏవైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా? ప్యారిజాన్ : ఏమొచ్చాండాయో తెలీదు సార్....హాస్పిటల్‌కు వెళ్లాలన్నా రూ. 50 పెట్టి అదేదో ఈఎస్ఐ ఆస్పత్రి అంటా...అక్కడికి వెళ్లాలి. ఎక్కువ లెక్క ఛార్జీలకు పెట్టి పోవాలా! ప్రభుత్వమేమో కనీసం పింఛన్ కూడా ఇయ్యకపోయే! అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పలకకపోయే... ఎమ్మెల్యే: బీడి చుట్టడానికి ఆకు ఎవరిస్తారు? ఎంత ఖర్చు వస్తుంది? కార్మికులకు బీడి చుట్టడం వల్ల ఏమైనా జబ్బులు వస్తున్నాయా? రఫీయున్ : ఎందుకులే సార్...చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. ఉబ్బసం, దగ్గు, ఆయాసం లాంటి జబ్బులు వస్తాయి. మాకు వచ్చే నూరు, నాట యాభైతో కష్టపడతాండాం! కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆకు, ఇతర సరుకు కంపెనోళ్లే ఇస్తారు. బీడీలు చుట్టి ఇస్తే కూలీ ఇస్తారు. ఎమ్మెల్యే: ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? అందరికీ సొంత ఇల్లు ఉన్నాయా? రబియా : చాలామందే ఉంటారు సార్....200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. ప్రతిరోజు పొద్దస్తమానం కష్టపడతాం...బీడీలు చుడతానేం ఉంటాం! స్వంత ఇల్లు అందరికీ లేవు సార్, ఏదో వచ్చినోళ్లకు వచ్చినాయ్..రానోళ్లకు రాలే... ఎమ్మెల్యే: బీడి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఎంతమందికి పని కల్పిస్తున్నారు? ఇర్ఫాన్‌బాష (వంకాయ ఫేమస్బీడి ప్రతినిధి) : కమలాపురం చుట్టుపక్కల పల్లెల్లో సుమారు 10 కంపెనీలు ఉన్నాయండి...మా అబ్బ కాలం నుంచి చాలామంది బీడీలు చుడుతున్నారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా. బిజినెస్ భారీగా పడిపోయింది. 500 కుటుంబాలకు పైనే బీడీలు చుడుతున్నారు సార్! ఎమ్మెల్యే: మీరు ఎన్నేళ్ల నుంచి బీడీలు చుడుతున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రోజుకు ఎన్ని చుడతారు..? షేక్ షమీమ్ బేగం : మేము 30 ఏళ్ల నుంచి బీడీలు చుడుతున్నాం...పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు చుడుతూనే ఉంటాం. కనీసమంటే వెయ్యి బీడీల వరకు చుడతాం.కంపెనోళ్లు 100 నుంచి 150 రూపాయలు ఇస్తారు. మాకు కూడా సమస్యలొచ్చి అక్కడ, ఇక్కడ తిరుగుతున్నాం. జబ్బులు వస్తుండడంతో ఈఎస్ఐ ఆస్పత్రికి కూడా పోయి వచ్చాం. బీడి కార్మికులకు పింఛన్ వచ్చేలా చూడండి సార్. ఎమ్మెల్యే: మీ కుటుంబంలో ఎంతమంది పనిచేస్తున్నారు? అందరూ చేస్తారా? రోజుకు ఎంత సంపాదిస్తారు? మాబున్నీ : సార్, మేమే 37 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తాండాం. మేము తొమ్మిది మంది ఉన్నాం. పిల్లోళ్లు చదువుకుంటాండారు. స్కాలర్షిప్పులు కూడా సక్రమంగాా రాలే! రోజూ బీడీలు చుట్టినా రూ. 200-300 కంటే ఎక్కువ రాలేదు. ఒక్కొసారి కుటుంబ ఖర్చులకే అంతా సరిపోతాంది. ఎమ్మెల్యే: (బజారులో బండమీద కూర్చొని బీడీలు చుడుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి) : ఎప్పటినుంచి వృత్తిలోకి వచ్చారు? ప్రభుత్వం సబ్సిడీ లాంటివి ఏమైనా సాయం చేసిందా? ఇబ్రహీం బాష : ఎవరు అడుగుతారు సార్... బీడి కార్మికులను ఎవరూ పట్టించుకోలేరు. దారుణం సార్.బాడుగ ఇళ్లలో ఉన్నాం. అంతా ఎలచ్ఛన్లపుడు వస్తారు. చెబుతారు...పోతారు...ఏమి చేయరు సార్...ఓటుకోసం అందరూ వస్తారు...నేను 30 ఏళ్ల నుంచి చుట్టిచుట్టి పడతాండ. ఏ పభుత్వం చిల్లిగవ్వ ఇయ్యలే...ఇంకే చేస్తారులే సార్. ఎమ్మెల్యే: (సమీపంలో ఉన్న డాక్టరు సురేష్బాబునుద్దేశించి) : ఏమయ్యా డాక్టర్...బీడీలు చుట్టి చుట్టి ఆరోగ్యాలు పాడవుతున్నాయి...వీరికి ఏమేం జబ్బులు ఉన్నాయో ఓసారి చెప్పండి? డాక్టర్ సురేష్‌బాబు : సార్, బీడి కార్మికులు రోజూ పొగాకు చుట్టడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధింధించిన జబ్బులతోపాటు ఇతరత్రా సమస్యలు వస్తున్నాయి. కార్మికులు జాగ్రత్తలు పాటించాలి. బీడి కార్మికులకు సపరేటు ఆస్పత్రి ఉండడంతో అంతా ఈఎస్ఐకి వెళతారు. ఎమ్మెల్యే: ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ బీడీలు చుడతారా? మాబుజాన్ : నేను 40 ఏళ్ల నుంచి చుడుతున్నా. మా ఇంట్లో తొమ్మిది మంది ఉన్నాం. నేనొక్కదాన్నే చుట్టిన బీడీలపై వచ్చే సొమ్ముతోనే ఇంట్లో జరగాలి. ఎమ్మెల్యే: బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ప్రభుత్వం కడుతుందా? ఎస్.ప్యారీజాన్ : ఏమి రాలేదు సార్...పింఛన్ రాలేదు. బీడి కార్మికులకు ఇన్స్యూరెన్స్ ఎవరిస్తారు సార్, ప్రభుత్వం చెప్పినోళ్లకే చేయలేదు. మాకేమి ఇన్స్యూరెన్స్ డబ్బులు కడతారు సార్. ఎమ్మెల్యే: (సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో) : చిన్నా..బాగున్నావా...? నీవేం చేస్తావు..అమ్మా నాన్న ఏం చేస్తారు? గౌసియా : సార్...నేను చదువుకుంటున్నా...అమ్మానాన్న లేరు. చనిపోయారు. మా అక్క ఒక్కతే కష్టపడి నన్ను సూలుకు పంపుతాంది. అక్క సంపాదనతోనే నేను చదువుకుంటాండా. అక్క కూడా చదువు చాలిచ్చింది సార్. ఎమ్మెల్యే: చనిపోతే బీడి కార్మికులకు ఎక్స్‌గ్రేషియా వస్తోందా? గౌసియా : ఒక్కపైసా కూడా రాలేదు. వైద్య సేవలు కూడా సక్రమంగా అందలేదు. ఎమ్మెల్యే: చేనేత పింఛన్ 50 ఏళ్లకే ఇస్తున్నారు. బీడి కార్మికులకు ఏమైనా ఇస్తున్నారా? బ్యాంకుల్లో రుణాలివ్వలేదా? ఖుర్షీద్ : ఎవరూ ఏమి చేయలేదు..డ్వాక్రాలో ఉన్నా సక్రమంగా రుణాలు రాలేదు. ఇక బీడీ కార్మికులకు ఏం ఇస్తారు సార్? బ్యాంకులకు వెళుతున్నా ఈ రుణాల గురించి ఎవరూ అడగరు..మాట్లాడరు..... ఎమ్మెల్యే: (ఇంటి బయట పాపను ఒళ్లో కూర్చొబెట్టుకుని మాట్లాడుతన్న తల్లితో) : మీ పాపనా అమ్మా....ఏం చదువుతోంది తల్లీ? నూర్ : అవును సార్..మా పాపే....చిన్నప్పుడే ఇబ్బంది జరిగి వికలాంగురాలిగా మారిందిసార్....100 శాతం వికలాంగురాలిగా డాక్టర్లు సర్టిఫికెట్లు ఇచ్చినా పింఛన్ ఇవ్వలేదు సార్! ఎమ్మెల్యే: మీరేం చేస్తారు? బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం ఆదరించింది? మాబుసాబ్ : బీడి కార్మికులకు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఆ మహానుభావుడు వైఎస్సార్ ఉన్నప్పుడే ఇల్లు, పింఛన్లతోపాటు ఆరోగ్యాన్ని చూపించుకునేందుకు ఒక కార్డు ఇచ్చినాడు. ఇప్పుడెవరు పట్టించుకుంటాడారు సార్...మాలాంటి చదువు రానోళ్లను తోచేస్తాండారు. -
తండ్రి అంత్యక్రియలకు వెళ్తుంటే.. ప్రమాదం
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీవో ఎం.రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తున్న కారును ఓ లారీ ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల ఆర్డీవో రవీంద్రనాథ్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియల కోసం రవీంద్రనాథ్, ఆయన సోదరుడు వెంకటరమణ, ఆయన భార్య జ్యోతి, పిల్లలు లక్ష్మి, సాత్విక్ కలిసి కారులో భద్రాచలానికి బయల్దేరారు. అయితే కారు కొమ్ముగూడెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొంది. దాంతో కారు డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. శరీరం కూడా కారుకు, లారీకి మధ్య ఇరుక్కు పోయింది. రెండు గంటల పాటు ప్రయత్నించినా రాకపోవడంతో.. ట్రాక్లర్లతో కారును బయటకు లాగి అప్పుడు సురేష్‌ను బయటకు తీయాల్సి వచ్చింది. ఆర్డీవో రవీంద్రనాథ్‌కు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి వచ్చిన 108 అంబులెన్సులో క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. -
పోకిరీ ఐపీఎస్ !
* కాఫీ షాప్‌లో అమ్మాయిల ఫొటోలు తీశారని ఆరోపణ * అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను చితకబాదిన స్థానికులు, కాఫీ డే సిబ్బంది * కుట్రతో తనను ఇరికించారని ఆవేదన * రాజీనామా చేసినట్లు వెల్లడి * కేసు విచారణ చేస్తున్నాం : హోం మంత్రి బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరులోని ఓ కాఫీ షాప్‌లో కూర్చుని ఉన్న అమ్మాయిలను ఫొటోలు తీశారనే కారణంతో సీనియర్ ఐపీఎస్ అధికారి, కేఎస్ఆర్పీ అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) డాక్టర్ రవీంద్రనాథ్ను స్థానికులు చితకబాదారు. యువతుల ఫిర్యాదు మేరకు నగర హైగ్రౌండ్‌స పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ ఫోన్‌ను సీజ్ చేశామని, అందులో రెండు ఫొటోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయనను అధికారికంగా అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. ఏడీజీపీపై ఫిర్యాదు చేసిన యువతుల్లో ఒకరు ఫ్రీలాన్‌స జర్నలిస్ట్ కాగా, మరొకరు ఆమె కజిన్ ఐటీ కంపెనీ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. సోమవారం ఉదయం ఇక్కడి కన్నింగ్ హ్యాం రోడ్డులోని జా-బాన్-ఫేన్ కాఫీ షాప్‌నకు ఏడీజీపీ రవీంద్రనాథ్ (ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్) మఫ్టీలో వెళ్లారు. పక్క టేబుల్‌పై ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. వారిని రవీంద్రనాథ్ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. దీన్ని గమనించిన వారు ఫొటోలు ఎందుకు తీశావ ంటూ ఆయన్ను ప్రశ్నించారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు, కాఫీ షాప్ ఉద్యోగులు ఏడీజీపీ రవీంద్రనాథ్ను చితకబాదారు. అంతలోనే పోలీసులు వచ్చి రవీంద్రనాథ్ను, యువతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు న మోదు చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కేసు న మోదు చేశారు. కాగా, తనను కుట్ర చేసి ఇరికించారని రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు. కన్నీరు పెట్టుకున్న ఏడీజీపీ తాను ఏ తప్పూ చేయలేదని, తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఏడీజీపీ రవీంద్రనాథ్ అన్నారు. ‘పక్కా ప్లాన్‌తో ఒక ఎస్ఐ సహా కొందరిని అడ్డు పెట్టుకుని కొందరు పోలీసు అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం ఆయన కన్నింగ్ హ్యాం రోడ్డులో సంఘటన జరిగిన కాఫీ షాప్‌నకు వచ్చి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. సోమవారం చెల్లించని కాఫీ బిల్లును చెల్లించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ‘సోమవారం ఉదయం ఇక్కడే కూర్చొని సెల్ ఫోన్లోని డేటాను చూసుకుని మళ్లీ టేబుల్‌పై పెట్టాను. ఇంతలో మొదటి అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు తీస్తావా అంటూ నా దగ్గరికి వచ్చాడు. మొబైల్, పర్స్ లాక్కున్నాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే ఒక ఎస్ఐ అక్కడికి వచ్చాడు. నేరుగా జీపు వద్దకు తీసుకెళ్లి అందులో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన వాదనను ఆయన పట్టించుకోలేదు. తాను ఐపీఎస్ అధికారినంటూ ఐడీ కార్డు చూపించినా ఆ ఎస్ఐ పట్టించుకోలేదు. ఎక్కువ మాట్లాడితే సెల్లో వేస్తానని బెదిరించారు. కళ్లజోడు సైతం లాగేసుకుని నన్ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశార’ని వాపోయారు. సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తనతో మాట్లాడి యువతికి క్షమాపణలు చెప్పాలని కోరారని, తాను తప్పు చేయనందున అందుకు నిరాకరించానని చెప్పారు. రాజీనామా లేఖను డీజీపీకి ఇచ్చాను.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వికాస సౌధలో రాష్ట్ర హోంశాఖ మంత్రి జార్జ్, డీజీపీ పచావో ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రవీంద్రనాథ్ సమావేశం అనంతరం బయటకు వచ్చి తాను రాజీనామా చేశానని, ఆ లేఖను డీజీపీ పచావోకు అందజేశానని మీడియాకు వెల్లడించారు. అనంతరం బయటకు వచ్చిన హౌం మంత్రి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, డీజీపీ పచావో నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కాగా, రవీంద్రనాథ్ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. -
యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి
బెంగళూరు: ఒక కాఫీ షాపులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఒకరు తన సెల్‌తో ఒక యువతిని ఫొటోలు తీశాడు. దాంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.రవీంద్రనాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఐపిసి 354, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రవీంద్రనాథ్ అభ్యంతరకరమైన ఫొటోలు తీసినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని డిసిపి రవికాంత్ గౌడ్ చెప్పారు. అతనిపై కేసు నమోదు చేశామని, అవసరమైతే అతనిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, తాను ఫొటోలు ఏమీ తీయలేదని రవీంద్రనాథ్ చెప్పారు. -
ఇలాగైతే బతికేదెలా?
లేపాక్షి/తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, న్యూస్‌లైన్ : సామాజిక భద్రత పింఛన్‌ను నిలిపివేయడంపై జిల్లాలో నిరసన పెల్లుబికింది. లేపాక్షి, తనకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లో ఆందోళనకు దిగారు. పింఛన్‌ను పునరుద్ధరించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేపాక్షి మండలంలో పింఛన్ రద్దయిన వారు సోమవారం ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులందరినీ బయటకు పంపి.. కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం కార్యాలయం ఎదుట మండుటెండలోనే ధర్నా చేశారు. వీరికి మాజీ ఎంపీపీలు కొండూరు మల్లికార్జున, ఆనంద్, లేపాక్షి సర్పంచ్ జయప్ప, మాజీ సర్పంచ్ రవీంద్రనాథ్, నాయకులు గంగిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతికి ఉన్నా చనిపోయారని, స్మార్టకార్డులు లేవని, వేలిముద్రలు కంప్యూటర్లు తీసుకోలేదని కారణాలు చూపుతూ పింఛన్ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని జాబితా నుంచి తీసేయకుండా.. వారి పేరిట వచ్చే పింఛన్ సొమ్మును సిబ్బంది స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. రెండు నెలలుగా వెయ్యి మందికి పింఛన్లు పంపిణీ చేయడం లేదని తనకల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ముట్టడించారు. యాక్సిస్ బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాట్ల వల్లే తమకు పింఛన్ అందకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల పింఛన్‌ను వచ్చే నెలలో ఒకేసారి మంజూరయ్యేలా చూస్తామని ఈఓపీఆర్డీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. వీరి ఆందోళనకు ఏపీ రైతు సంఘం మండల కన్వీనర్ రమణ మద్దతు తెలిపారు. ‘అయ్యా.. కొన్నేళ్లుగా నెలనెలా ఇన్నూరు..ఐదునూర్లు.ఫించన్ తీసుకునేవాళ్లం. వచ్చిన ఫించన్‌తో నెలపాటు అవసరాలు తీరేవి. రెణ్నెళ్లుగా ఫించన్ ఈలేదు. మా ఫించన్ ఏమైంది?’ అంటూ బోరంపల్లికి చెందిన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కళ్యాణదుర్గం తహశీల్దార్ శ్రీనివాసులు వద్ద ఏకరువు పెట్టారు. దీంతో తహశీల్దార్ సంబంధిత అధికారులతో విషయం కనుగొన్నారు. వేలిముద్రల సమస్యలతో జాప్యం జరిగిందని, వచ్చే నెలలో పెడింగ్ పింఛన్‌తోపాటు మొత్తం అందుతుందని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఈఓఆర్డీ క్రిష్ణమూర్తి వద్ద కూడా గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే నెలలో ఫించన్లు అందుతాయని ఈఓఆర్డీ హామీ ఇచ్చారు. ‘సార్... మూడేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నాం.. రెండు నెలలుగా 40 మందికి పింఛన్ ఇవ్వడం లేదు.. ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడండి’ అని కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వృద్ధులు ఎంపీడీఓ నాగేశ్వర్రావుతో గోడు వెళ్లబోసుకొన్నారు. బ్రహ్మసముద్రం గ్రామంలో 20 మందికి పింఛన్ రావడం లేదని వైఎస్సార్సీపీ సర్పంచు లోకేష్‌గౌడ్ ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ వచ్చేలా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. -
నకిలీ ఇంగ్లిష్ టీచర్లపై దర్యాప్తు ముమ్మరం
కొణిజర్ల(వైరా),న్యూస్‌లైన్: జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన 66 మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ఈ నివేదిక రాగానే సంబంధిత ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం వైరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరు ఉపాధ్యాయులపై శాఖా పరమైన దర్యాప్తు పూర్తి చేసి, క్రిమినల్ కేసులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. అలాగే తప్పుడు వైద్య ధ్రుపత్రాలతో రీయింబర్స్మెంట్ పొందిన 21 మంది ఉపాధ్యాయులకు 3 ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నట్లు తెలిపారు. పదో తర గతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చే స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా స్థలం లేక 31 పాఠశాలలు ప్రారంభం కాలేద ని, రెండు పాఠశాలలు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయని వివరించారు. జాతీయ సగటు మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో మాత్రమే మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కోర్టులో ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా పదోన్నతులు చేపట్టి, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు. ఆర్వీఎం పీఓ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆర్వీఎం ద్వారా ఈ ఏడాది రూ.84.65 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.62.51 కోట్లు వివిధ పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు పుష్కలంగా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంఓ వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.