పోకిరీ ఐపీఎస్ ! | FIR against IPS officer P Ravindranath for clicking pictures of a woman | Sakshi
Sakshi News home page

పోకిరీ ఐపీఎస్ !

Published Wed, May 28 2014 8:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

పోకిరీ ఐపీఎస్ !

పోకిరీ ఐపీఎస్ !

*  కాఫీ షాప్‌లో అమ్మాయిల ఫొటోలు     తీశారని ఆరోపణ
* అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను చితకబాదిన స్థానికులు, కాఫీ డే సిబ్బంది
*  కుట్రతో తనను ఇరికించారని ఆవేదన
*  రాజీనామా చేసినట్లు వెల్లడి
*  కేసు విచారణ చేస్తున్నాం : హోం మంత్రి

 
 బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరులోని ఓ కాఫీ షాప్‌లో కూర్చుని ఉన్న అమ్మాయిలను ఫొటోలు తీశారనే కారణంతో సీనియర్ ఐపీఎస్ అధికారి, కేఎస్‌ఆర్‌పీ అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) డాక్టర్ రవీంద్రనాథ్‌ను స్థానికులు చితకబాదారు. యువతుల ఫిర్యాదు మేరకు నగర హైగ్రౌండ్‌‌స పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ ఫోన్‌ను సీజ్ చేశామని, అందులో రెండు ఫొటోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయనను అధికారికంగా అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. ఏడీజీపీపై ఫిర్యాదు చేసిన యువతుల్లో ఒకరు ఫ్రీలాన్‌‌స జర్నలిస్ట్ కాగా, మరొకరు ఆమె కజిన్ ఐటీ కంపెనీ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు.
 
 పోలీసులు, బాధితుల కథనం మేరకు.. సోమవారం ఉదయం ఇక్కడి కన్నింగ్ హ్యాం రోడ్డులోని జా-బాన్-ఫేన్ కాఫీ షాప్‌నకు ఏడీజీపీ రవీంద్రనాథ్ (ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్) మఫ్టీలో వెళ్లారు. పక్క టేబుల్‌పై ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. వారిని రవీంద్రనాథ్ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. దీన్ని గమనించిన వారు ఫొటోలు ఎందుకు తీశావ ంటూ ఆయన్ను ప్రశ్నించారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు, కాఫీ షాప్ ఉద్యోగులు ఏడీజీపీ రవీంద్రనాథ్‌ను చితకబాదారు. అంతలోనే పోలీసులు వచ్చి రవీంద్రనాథ్‌ను, యువతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు న మోదు చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కేసు న మోదు చేశారు. కాగా, తనను కుట్ర చేసి ఇరికించారని రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు.
 
 కన్నీరు పెట్టుకున్న ఏడీజీపీ
 తాను ఏ తప్పూ చేయలేదని, తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఏడీజీపీ రవీంద్రనాథ్ అన్నారు. ‘పక్కా ప్లాన్‌తో ఒక ఎస్‌ఐ సహా కొందరిని అడ్డు పెట్టుకుని కొందరు పోలీసు అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం ఆయన కన్నింగ్ హ్యాం రోడ్డులో సంఘటన జరిగిన కాఫీ షాప్‌నకు వచ్చి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. సోమవారం చెల్లించని కాఫీ బిల్లును చెల్లించారు.
 
 ఆ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ‘సోమవారం ఉదయం ఇక్కడే కూర్చొని సెల్ ఫోన్‌లోని డేటాను చూసుకుని మళ్లీ టేబుల్‌పై పెట్టాను. ఇంతలో మొదటి అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు తీస్తావా అంటూ నా దగ్గరికి వచ్చాడు. మొబైల్, పర్స్ లాక్కున్నాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే ఒక ఎస్‌ఐ అక్కడికి వచ్చాడు. నేరుగా జీపు వద్దకు తీసుకెళ్లి అందులో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన వాదనను ఆయన పట్టించుకోలేదు. తాను ఐపీఎస్ అధికారినంటూ ఐడీ కార్డు చూపించినా ఆ ఎస్‌ఐ పట్టించుకోలేదు. ఎక్కువ మాట్లాడితే సెల్‌లో వేస్తానని బెదిరించారు. కళ్లజోడు సైతం లాగేసుకుని నన్ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశార’ని వాపోయారు. సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తనతో మాట్లాడి యువతికి క్షమాపణలు చెప్పాలని కోరారని, తాను తప్పు చేయనందున అందుకు నిరాకరించానని చెప్పారు.
 
 రాజీనామా లేఖను డీజీపీకి ఇచ్చాను..
 మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వికాస సౌధలో రాష్ట్ర హోంశాఖ మంత్రి జార్జ్, డీజీపీ పచావో ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రవీంద్రనాథ్ సమావేశం అనంతరం బయటకు వచ్చి తాను రాజీనామా చేశానని, ఆ లేఖను డీజీపీ పచావోకు అందజేశానని మీడియాకు వెల్లడించారు. అనంతరం బయటకు వచ్చిన హౌం మంత్రి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, డీజీపీ పచావో నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కాగా, రవీంద్రనాథ్ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement