![Pilli Subhash Chandra Bose Give Suspension On DIG Ravindranath In Amaravati - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/30/pilli_0.jpg.webp?itok=6VEt03Oz)
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్
సాక్షి, అమరావతి: మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ కేసు వ్యవహారంలో విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్ర బోస్ ఆదేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని వాపోయారు. కొంతమంది ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. కేసు విషయంలో విచారణే అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు.
తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని తెలిపారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా? ఏపీపీఎస్సీ నుంచి నేరుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. (చదవండి: సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’)
Comments
Please login to add a commentAdd a comment