
వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర వేడుకల్లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి ప్రసంగించిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వివరణ కోరారు. సోమవారం ఆమ్రపాలితో సీఎస్ ఫోన్‌లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున హన్మకొండలోని పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తన ప్రసంగం మధ్యలో కలెక్టర్ హోదాలో ఉన్న అమ్రపాలి పలుమార్లు అకారణంగా నవ్వడంతో పాటు గణాంకాల దగ్గర తడబడ్డారు. మధ్యలో ‘ఇట్స్ ఫన్నీ’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటు, మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఈ సందర్భంగా అమ్రపాలి సీఎస్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.