మహనీయుల స్ఫూర్తితో ప్రగతి పథాన | Inspired by the progress of men pathana | Sakshi
Sakshi News home page

మహనీయుల స్ఫూర్తితో ప్రగతి పథాన

Published Tue, Jan 27 2015 2:56 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

మహనీయుల స్ఫూర్తితో ప్రగతి పథాన - Sakshi

మహనీయుల స్ఫూర్తితో ప్రగతి పథాన

విజయనగరం కంటోన్మెంట్ : మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మనకిచ్చిన మహనీయుల కలలకు అనుగుణంగా నడచుకుందామని, వారి ఆశయాలనే స్ఫూర్తిగా తీసుకుని  ప్రగతి బాటన పయనిద్దామని  కలెక్టర్ ఎంఎం నాయక్ అన్నారు. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసుల నుంచి గౌరవందనం తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  తెలుగు దిగ్గజాలైన భోగరాజు పట్టాభిరామయ్య, టంగుటూరి ప్రకాశం పంతు లు, నీలం సంజీవరెడ్డి తదితరులు నవభారత నిర్మాణం కోసం పాటు పడ్డారన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నామని తెలిపారు.
 
 జిల్లాలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నామన్నారు. బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, జన్మభూమి, రైతు సాధికార సదస్సులు, స్వచ్ఛభారత్, స్మార్ట్ విలేజ్ వంటి కార్యక్రమాలతో ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ అమలులో భాగంగా 1,44,621 మంది  రైతులకు  మొదటి దశలో రూ.184 కోట్లను వారి ఖాతాల్లో సర్దుబాటు చేశామన్నారు. రెండో విడతలో   90 వేల మందిని గుర్తించామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా  2,42,715 మందికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్నామన్నారు.
 
  మహిళా సాధికారతను పెంపొందించేందుకు వీలుగా  ఇసుక రీచ్‌లను మహిళలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.  ఇప్పటివరకూ జిల్లాలోని 30 ఇసుక రీచ్‌ల ద్వారా 43,659 క్యూబిక్ మీటర్ల ఇసుకను రూ.2.66 కోట్లకు విక్రయించామన్నారు. 4,364 పట్టణ, గ్రామీణ స్వయం సంఘాలకు రూ. 109.74 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించాని,  మార్చి నెలాఖరులోగా రూ.150 కోట్లు పైబడి మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. స్త్రీ నిధి కింద 1,486 సంఘాలకు రూ 2.86 కోట్ల రుణాలు అందజేసినట్టు చెప్పారు. సంక్రాంతి పండగకు చంద్రన్న ఉచిత సరుకుల కింద రూ.241లు విలువ చేసే ఆరు నిత్యావసరాలను  పంపిణీ చేశామన్నారు.  ఈ పథకం కింద జిల్లాలో 6,64,316 లబ్ధిదారులకు ఈ సరుకులను అందించినట్టు చెప్పారు.
 
 కరుణించని ప్రకృతి
 ఎన్ని కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నా ప్రకృతి గత ఏడాది కరుణించలేదని కలెక్టర్ ఎంఎం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానుకు జిల్లా అతలాకుతలమైందని, బాధితులకు   రూ.44.31 కోట్ల నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.  దెబ్బతిన్న 15వేల ఇళ్లకు, 19,689 మంది రైతులకు సుమారు 6.83 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించామన్నారు. ఉద్యాన పంటలకు రూ.31 కోట్లు, మత్స్యకారులకు రూ.కోటీ 29 లక్షలు అందించామన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయవలసిన రూ.6.29 కోట్లలో ఇప్పటికే రూ.4.92 కోట్లను  బాధితులకు అందజేశామని చెప్పారు.
 
 లక్షా85వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  జిల్లాలో రైతులకు మద్దతు ధర  అందించేందుకు గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఇప్పటివరకూ లక్షా85వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 45 రోజుల పాటు 2,344 గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లాలోని 91 గ్రామాల్లో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం,15 గ్రామాల్లో పొలంబడి నిర్వహించినట్టు చెప్పారు.  రైతలకు రెండు కోట్ల రూపాయల విలువైన రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తున్నామన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి 1,380 మంది బడి బయట ఉన్న బాలలను తిరిగి పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించామన్నారు.
 
  27,455 విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల నిరంతర విద్యుత్ సరఫరా  చేస్తున్నామని, హుద్‌హుద్ తుపాను వల్ల   జరిగిన నష్టాన్ని రూ 129.15 కోట్ల  వ్యయంతో పునరుద్ధరించామని తెలిపారు. వలసలను నివారించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లక్షా 31వేల కుటుంబాలకు వంద పనిదినాలను కల్పించినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ ఏడాది నుంచి పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో వేతనాలు అందిస్తామని తెలిపారు. జిల్లాను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు    నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పది వేల ఎకరాల్లో జీడి, మామిడి మొక్కలను నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు.   ఉపాధి హామీ నిధులతో  డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నామని,  రూ. లక్షా47వేల  అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు.
 
 మార్చి 15 నాటికి 50వేల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పేదలకు కార్పొరేట్ వైద్యం చేయించేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో ఇంత వరకూ 80,391 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రూ.208 కోట్లు ఖర్చు చేశామన్నారు.  గృహ నిర్మాణ సంస్థ ద్వారా జియోట్యాగింగ్ చేపట్టి అర్హులకే లబ్ధి చేకూర్చుతున్నామని చెప్పారు. సాక్షరభారత్ కార్యక్రమం ద్వారా 6.95లక్షల మందిని  అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని,  మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 2,38,475 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చుతున్నామని తెలిపారు.   పదో తరగతి చదువుతున్న 16,42,000 మందికి పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించామని,  సర్వశిక్షాభియాన్ కింద రూ.13.89కోట్ల ను విడుదల చేసి పాఠశాలలకు తాగునీరు, మరుగుదొడ్ల  సౌకర్యం కల్పించామని చెప్పారు.   పశు సంవర్ధక శాఖ ద్వారా రూ.2.28 కోట్లతో 50 శాతం రాయితీపై 4,560 దూడలకు దాణా అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతి కోసం వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ద్వారా వివిధ వ్యాపారాలకు 51.59 కోట్లను  మంజూరు చేశామని చెప్పారు.
 
 జిల్లాలో 113 పరిశ్రమలకు అనుమతులు, లెసైన్సులను మంజూరు చేశామన్నారు. రూ. 42 కోట్ల రాయితీతో 42 యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   తోటపల్లి,  తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్టు పనులను   వేగవంతంగా పూర్తి చేసి  ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయానికి గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాల్లో స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు పంపామన్నారు. దీంతో పాటు వైద్య కళాశాల, అగ్రికల్చర్ ఫుడ్‌పార్కు, ఎలక్ట్రానిక్ హబ్, మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలున్నాయని సీఎం చెప్పారన్నారు.  జిల్లాను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకాభివృద్ధికి  రూ.18కోట్లతో ప్రతిపాదనలు పంపామని నాయక్ చెప్పారు. శాంతి భద్రతలకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తి 18.051 కోట్లను రాబోయే ఐదేళ్లలో 37.338 కోట్లకు పెంచడానికి ప్రణాళికలు తయారు చేశామని కలెక్టర్ వివరించారు.
 
 ఆకట్టుకున్న ప్రదర్శనలు
 ఈ సందర్భంగా  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.పలు పాఠశాలల విద్యార్థులు  ప్రదర్శంచిన నృత్యాలు సందర్శకులను అలరించాయి ప్రదర్శనల్లో మొదటి బహుమతిని మున్సిపల్ కస్పా హై స్కూల్ విద్యార్థులు, రెండో బహుమతిని సెయింట్‌మేరీ, మూడో బహుమతిని ఫోర్డ్ సిటీ, నాలుగో బహుమతిని పోలీస్ సంక్షేమ పాఠశాల విద్యార్థులు అందుకున్నారు. కలెక్టర్ ఎం.ఎం నాయక్ వీరికి బహుమతులు అందించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement