నిర్వాహకులతో మాట్లాడుతున్న కలెక్టర్ జవహర్‌లాల్, ముక్తేశ్వరరావు, తదితరులు
విజయనగరం కొత్తవలసరూరల్: గ్రీవెన్స్‌సెల్‌లో భాగంగా ఓ సోమవారం అర్జీలు స్వీకరించి బయటకు వస్తున్న నాకు కొమరాడకు చెందిన ఓ పెద్దాయన మెట్లముందు కూర్చుని ఆలోచించడం గమనించాను..ఉదయం అర్జీ ఇచ్చి ఇప్పటివరకు ఎందుకు ఇక్కడ ఉన్నావని అడగ్గా భోజనం చేస్తే ఇంటికి వెళ్లడానికి డబ్బులు చాలవని వృద్ధుడు చెప్పడంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇకపై గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే క్యాంటీన్ పెట్టించానని కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఆనాటి సంఘటనకు సంబంధించి మంగళపాలెం గురుదేవా చారిటబుల్ ట్రస్టులో దివ్యాంగులతో తన మనోభావాలు పంచుకున్నారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్‌ను ఆదివారం ఆయన సందర్శించి దివ్యాంగులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ నిర్వహణకు ఓ అధికారి రూ. 20 వేలు ఇచ్చారని తెలిపారు. అలాగే అధికారులు, స్నేహితులు కూడా విరాళాలు ఇస్తుండడంతో క్యాంటీన్ నిర్వహణ కొనసాగుతోందని చెప్పారు. తన బంగ్లాలో పండిన కూరగాయలనే క్యాంటీన్ యజమానికి ఇవ్వడంతో తక్కువ ధరకే భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని మంగళపాలెం మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సేవలు విలువకట్టలేం..
ఫలితం ఆశించకుండా దివ్యాంగులకు చేసే సేవలకు విలువ కట్టలేమని కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. గురుదేవా చారిటబుల్ ట్రస్ట్‌లో పలువురు దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు టీటీడీ శ్వేత ప్రాజెక్ట్ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ ఎన్. ముక్తేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు రాపర్తి జగదీష్‌బాబు అవయవ తయారీలో ఉన్న ఇబ్బందులు, పంపిణీ, తదితర అంశాలను వివరించారు. 13 జిల్లాల్లో ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీకీ భారీగా ఖర్చు అవుతున్నప్పటికీ ప్రముఖ కంపెనీలు, అధికారులు ఆర్థిక సహాయంతో ఉచితంగా అవయవాలు పంపిణీచేస్తున్నట్లు జగదీష్‌బాబు తెలిపారు. అనంతరం సభాద్యక్షుడు శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, గతంలో తాను అనంతపురం కలెక్టర్‌గా పనిచేసినపుడు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేదని, ఆయా కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు తెలుసుకునే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. శ్వేత ప్రాజెక్ట్ డైరెక్టర్ ముక్తేశ్వర్ మాట్లాడుతూ, దయాగుణం.. సేవాగుణం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఇంతమందికి కృత్రిమ అవయవాలు పంపిణీ చేసి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగదీష్‌బాబును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శంకరనారాయణ, తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment