క్యాంటీన్‌లో కలెక్టర్‌ భోజనం | sircilla collector was take lunch in canteen | Sakshi
Sakshi News home page

క్యాంటీన్‌లో కలెక్టర్‌ భోజనం

Published Mon, Feb 5 2018 3:48 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

sircilla collector was take lunch in canteen - Sakshi

క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్‌

వేములవాడ: జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదివారం స్వామివారి క్యాంటీన్‌కు చేరుకుని సామాన్య భక్తుడిలా రూ. 25 చెల్లించి టోకెన్‌ తీసుకుని భోజనం చేశారు. జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చారు. అనంతరం స్వామి వారి క్యాంటీన్‌ భోజనం బాగుందంటూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్‌కు చెప్పారు. మెట్లపై కూర్చుండి షూ తొడుక్కుని తిరిగి వెళ్లిపోయారు. క్యాంటీన్‌కు చేరుకున్న కలెక్టర్‌ను చూసిన భక్తులు వావ్‌ కలెక్టర్‌ అంటా అని చెప్పుకున్నారు.

రాజన్నను దర్శించుకున్న కలెక్టర్‌
వేములవాడ రాజన్నను జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్‌ క్యూలైన్లలో వచ్చి స్వామివారిని బయట నుంచే దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు.

నగరపంచాయతీ కమిషనర్‌పై ఫైర్‌
పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా, ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, జాతరగ్రౌండ్‌ ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి. అలాగే ప్రైవేట్‌ హౌస్‌లను లాడ్జ్‌లుగా నిర్వహిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటూ నగరపంచాయతీ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌పై జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఫైర్‌ అయ్యారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలనీ, ప్రైవేట్‌ లాడ్జ్‌ల లిస్టును తమకు సమర్పించాలని ఆదేశించారు. తక్షణమే వాటిని తొలిగిస్తామని కమిషనర్, కలెక్టర్‌కు సమాధానమిచ్చారు.

పోలింగ్‌ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ
పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్‌ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్‌లోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, అర్బన్‌ కాలనీ కేంద్రాన్ని డీఆర్‌వో తనిఖీ చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీశారు. అంగన్‌వాడీ టీచర్లకు తగు సూచనలు చేశారు. వారి వెంట తహసీల్దారు నక్క శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

వాటర్‌ బెడ్‌ పరిశీలన
వేములవాడఅర్బన్‌: అర్బన్‌ మండలంలోని నాంపల్లిలో కరీంనగర్‌ డ్యామ్‌ నుంచి వేములవాడకు వచ్చే మంచినీటి వాటర్‌ బెడ్‌ను, నందికమాన్‌ నుంచి తిప్పాపూర్‌ వరకు రోడ్డును కలెక్టర్‌ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ అదివారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి కోరత ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నాంపల్లి గుడికట్ట మీద ఉన్న పైపులైన్‌ను పరిశీలించారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ నామాల ఉమ, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్, డీఎస్పీ అవధాని చంద్రశేఖర్, పట్టణ సీఐ వెంకటస్వామి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement