canteen
-
మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకలి్పంచారని, మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్, థర్డ్‌ఫ్లోర్‌లో మహిళాశక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళాశక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లోనూ.... మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళాశక్తి కాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళాసంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయ, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, అధికారులు నర్సింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికే ‘మహిళా శక్తి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కలి్పంచేందుకే.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలమన్నారు. ఇందుకు అనుగుణంగా మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడళ్లను అధికారులు గుర్తించాలని సూచించారు. మహిళా సంఘాలను డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళల ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని.. ఆధార్ కేంద్రాలు, మీసేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కలి్పస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శక్తి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీపై డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులే ‘మహిళా శక్తి’కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను సకాలంలో అందించిన అధికారులను అభినందించారు. ఆగస్టు 15 న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. పీఆర్ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఐఆర్డీ సీఈవో కాత్యాయిని, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభంసాక్షి, హైదరాబాద్: సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించనున్నారు. మహి ళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్థిక పురోగతికి కృషి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా వీటికి మంత్రి తుదిరూపునిచ్చారు. బిహార్‌లో అమలు చేస్తున్న దీదీ–కి–రసోయి మోడల్‌కు అనుగుణంగా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను రూపొందిస్తున్నారు.సచివాలయంతో పాటు కలెక్టర్ ఆఫీస్ కేంద్రాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, ఆర్టీíసీ బస్టాండ్లు, ఇండ్రస్టియల్ పార్కులు, రిజి్రస్టేషన్ ఆఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంకలి్పంచారు. రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున మొత్తం 150 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యాంటీన్లు పెట్టే మహిళాసంఘాలకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో శిక్షణ, వివిధ రూపాల్లో ప్రభుత్వ సహకారాన్ని అందించనున్నారు. క్యాంటీన్ల మోడళ్లను బట్టి ఒక్కో దానికి ఏటా రూ.ఏడున్నర లక్షల నుంచి రూ.12 లక్షల దాకా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
పార్లమెంట్ క్యాంటీన్లో ఏమేమి దొరుకుతాయి? వెజ్, నాన్ వెజ్ ధరలు ఎంత?
నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇక్కడే పార్లమెంట్ కార్యకలాపాలన్నీ కొనసాగనున్నాయి. అయితే పార్లమెంటు గురించి మాట్లాడినప్పుడల్లా అక్కడి క్యాంటీన్ గురించిన ప్రస్తావన వస్తుంది. పార్లమెంటు క్యాంటీన్లో అతి చౌక ధరలకు లభించే ఆహార పదార్థాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతుంటుంది. పార్లమెంటు క్యాంటీన్లో ఏ ఆహారం ఎంత ధరకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2021వ సంవత్సరంలో పార్లమెంట్ క్యాంటీన్ రేట్ లిస్ట్‌లో మార్పులు చేశారు. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లను సవరించింది. దీంతో పలు ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. ఉదాహరణకు గతంలో చపాతీ రేటు రూ.2 ఉండగా, తర్వాత దానిని రూ.3కి పెంచారు. అలాగే చికెన్, మటన్ వంటకాల రేట్లు కూడా పెంచారు. పార్లమెంట్ క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి. ఆలూ బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోశ రూ.30, లెమన్ రైస్ రూ.30, మటన్ బిర్యానీ రూ.150, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఖీర్ రూ.30, ఉప్మా రూ.25, సూప్ రూ.25, సమోసా రూ.10, కచోరీ రూ. 15, పనీర్ పకోడా రూ. 50కు దొరుకుతుంది. ఇది కూడా చదవండి: ఏఏ దేశాల్లో వరద ముప్పు అధికం? దీనికి ప్రధాన కారణం ఏమిటి? -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..
ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్లో నాన్‌వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. హాస్టల్లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు. ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మొబైల్ ఘుమఘుమలు
ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్ బంకు, నంద్యాల చెక్‌పోస్టు, రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్ క్యాంటీన్ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్‌కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది. ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్ టేబుల్ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్ ఇవ్వకపోతే వెయిటర్ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. వంట మాస్టర్లకు గిరాకీ హోటల్ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మొబైల్ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. వ్యాపారానికి అనువుగా వాహనాలు మొబైల్ క్యాంటీన్ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్ హ్యాండ్ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్ క్యాంటీన్‌గా అదనపు డబ్బుతో తీర్చిద్దుకుంటున్నారు. ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్‌పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతను హుస్సేన్‌రెడ్డి. దూరదర్శన్ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు. తక్కువ ధరలో అల్పాహారం నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్, కర్నూలు కళ్లెదుటే వేడివేడిగా.. మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి. నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్‌వలి, నంద్యాల చాలా రుచిగా ఉంటాయి నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ. – రాజశేఖర్, దూపాడు, కర్నూలు -
పప్పుచారులో పాముపిల్ల
కుషాయిగూడ(హైదరాబాద్): ప్రతిరోజూ వేలాదిమంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే ఓ ప్రసిద్ధ కంపెనీ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పాముపిల్ల బయటపడింది. ఈ ఘటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలిపోయారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్లో వండిన ఆహారపదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్రతిరోజూ తరలిస్తుంటారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పుచారులో నుంచి ఓ పాముపిల్ల బయటపడింది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. భోజనాల అనంతరం విషయం తెలుసుకుని ఉద్యోగులు భయకంపితులయ్యారు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత క్యాంటీన్ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో కూడా ఈ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పలుమార్లు ఎలుకలు, బీడీలు, సిగరెట్లు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ నిర్లక్ష్యంపై స్పందించి, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. -
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపు) -
పట్టణాల్లో ‘ఆహా’ క్యాంటీన్లు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు, మార్కెట్లకు సరుకులు తెచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నడుంబిగించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతం కావడం, సమాఖ్య సభ్యులు ఆదాయం సముపార్జించడంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 110 యూఎల్బీల్లో 140 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తోంది. రూ.13 వేల చొప్పున ప్రభుత్వ సాయం పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంగా మెప్మా కృషి చేస్తోంది. ‘ఆహా’ క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వే, మార్కెటింగ్ అధికారులతో మెప్మా అధికారులు మాట్లాడి అనుమతులు తీసుకున్నారు. క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతినెలా రూ. 500 చొప్పున స్థానిక టౌన్ లెవెల్ ఫెడరేషన్ (పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీ)లో జమ చేసి మరింత మందికి ఆ ర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహారాన్ని రుచి, శుచిగా ఇంటి వద్దే వండి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన కియోస్‌్కల్లో విక్రయిస్తారు. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, అవసరాలను బట్టి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు విక్రయించేలా అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 40కే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. మహిళలకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల్లో గల ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోంది. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టుల తరహాలో మహిళలకు ఉపాధి కల్పించనున్నాం. ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించేందుకు 140 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తాం. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అంటే ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకుంటారు. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. – వి. విజయలక్ష్మి, మెప్మా ఎండీ ఒక్కపూట రూ. 3 వేల వ్యాపారం పదిహేను రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్ ప్రారంభించాం. ముగ్గురం సభ్యులం కలిసి సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టాం. కేవలం 2.30 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. పూటకు రూ. 3 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయించాం. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యాపారం, ఆదాయం వస్తుంది. పదార్థాలు మా ఇళ్లల్లోనే తయారు చేసి తెస్తున్నాం. ఆహా క్యాంటీన్‌తో మాకు ఉపాధి లభించింది. – పి.జయలక్ష్మి, ఆహా క్యాంటీన్ నిర్వాహకురాలు, కర్నూలు -
నీరా కేఫ్, క్యాంటీన్ ప్రారంభం
పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి బుధవారం ప్రారంభించారు. నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు. నీరా వంటకాలు సైతం.. క్యాంటీన్లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్‌క్రీం, తాటి ముంజ ఐస్క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘోర ప్రమాదం.. ఇస్రో క్యాంటీన్లో పనిచేసే ఉద్యోగులు దుర్మరణం
తిరువనంతపురం: కేరళ అలప్పూజ జిల్లా అంబలపూజలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సోమవారం ఉదయం 1:30 గంటల సమయంలో జాతీయ రాహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. మృతులను ప్రసాద్, శిజు, అమల్, సచిన్, సుమోద్‌గా గుర్తించారు. వీరంతా తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటీన్లో పనిచేస్తున్నారు. మృతుల్లో నలుగురు తిరువనంతపురానికే చెందిన వారు కాగా.. ఒక్కరు కొల్లంకు చెందివారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చదవండి: కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం.. -
మాట్లాడుతూనే చెంప పగలకొట్టింది.. అమ్మాయిల కొట్లాట వైరల్
వైరల్: కాలేజ్ క్యాంటీన్లో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కుడివైపు వున్న అమ్మాయి ఎడమ వైపు వున్న అమ్మాయిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతితో తన చెంప పగలకొట్టింది. దీంతో.. ఎదురుగు వున్న అమ్మాయి కూడా చేతితో బుద్దిచెప్పింది. అంతే.. అక్కడ రణరంగమే మొదలైంది. అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి ‘హూ.. అంటూ చప్పట్లు కొడుతూ ఆస్వాదిందించారు. ఆ అమ్మాయిల గొడవకు కారణం ఏంటో తెలియదు. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్లో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోపై మేనేజ్మెంట్ స్పందన కూడా తెలియాల్సి ఉంది. Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w — r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022 -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!
సాక్షి,సిరిసిల్లఅర్బన్: టిఫిన్ కావాలంటే ఇప్పుడు హోటళ్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి, వేడి టిఫిన్ ప్రస్తుతం మోబైల్ వాహనం రూపంలో అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రధాన కూడళ్లలో మొబైల్ టిఫిన్ సెంటర్ల ద్వారా అందిస్తున్నారు. కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సెంటర్లో దోసా, ఇడ్లీ, వడ, బోండా, పూరి నిమిషాల్లో తయారు చేసి వేడి, వేడిగా అల్లం చట్నీతో అందిస్తున్నారు. రుచి, శుచికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వినియోగదారులు వీటి వద్ద క్యూ కడుతున్నారు. ప్రజాదరణ పెరగడంతో వీటి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రహదారులే అడ్డాలుగా.. జిల్లా కేంద్రంలో విద్యానగర్, రగుడు, కొత్త చెరువు, బస్టాండ్, పెద్దూరు తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అడ్డాలుగా చేసుకొని చిరువ్యాపారులు మొబైల్ టిఫిన్ సెంటర్లను నడిపిస్తున్నారు. వీటికి అద్దె చెల్లించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో హోటళ్లలో ఉండే ధరల కంటే తక్కువ ధరలకే టిఫిన్స్ అందిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి మోబైల్ టిఫిన్ సెంటర్ల వ్యాపారం నిరుద్యోగులకు వరంలా మారింది. నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువగానే ఉండడంతో వీటి ఆధారంగా రోజుకు రూ.4 నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరు జీవనోపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఐదేళ్లుగా నడుపుతున్నా మాది తంగళ్లపల్లి గ్రామం. దాదాపు ఐదేళ్లుగా మొబైల్ టిఫిన్ సెంటర్‌ని నడిపిస్తున్నా. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో విద్యానగర్ చౌరస్తా వద్ద వాహనాన్ని నిలిపి ఉంచుతా. నాతో పాటు మరో ఇద్దరం దీని వల్ల ఉపాధి పొందుతున్నాం. – తలగోప్పుల రాజు, మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు నాణ్యతకే ప్రాధాన్యత స్వచ్ఛమైన, రుచికరమైన టిఫిన్స్ అందించడంతో ఆదరణ పెరుగుతోంది. అలాగే హోటళ్లలో కంటే తక్కువ ధరకు అందిస్తున్నాం. వాహనదారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆగి మరి తిని వెళ్తుంటారు. – మనోహార్, సిరిసిల్ల, మొబైల్ సెంటర్ నిర్వాహకుడు రుచికరంగా ఉంటుంది కొత్త చెరువు వద్ద ఒక మోబైల్ టిఫిన్ సెంటర్ ఉదయం అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు రుచికరంగా అందిస్తుండడంతో వాహనదారులు, వ్యాపారులు ఇక్కడే టిఫిన్ చేసి వెళ్లారు. నిర్వాహకులు అల్పాహరాన్ని రుచితో పాటు శుచి, శుభ్రత పాటిస్తున్నారు. – సందవేణి శ్రీనివాస్, సిరిసిల్ల -
ఆలోచన ‘సిరి’.. ఆరోగ్య దరి
కర్నూలు (హాస్పిటల్): దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండడంతో ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. సిరి ధాన్యాలతో(మిల్లెట్స్‌తో) తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉండగా, మరికొందరు వాటిని ఎలా వండుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొందరు వినూత్న ఆలోచన చేశారు. సిరి ధాన్యాలతో అల్పాహారాన్ని తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. సాధారణ ప్రజలు సైతం వీటిని ఇష్టంగా తింటున్నారు. రోగులను గమనించి... కర్నూలుకు చెందిన టి. చంద్రకాంత్ ఎంబీఏ పూర్తి చేశాడు. నాలుగేళ్లు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో డయాబెటీస్, బీపీ రోగుల ఇక్కట్లను గమనించాడు. వారికి అవసరమైన ఆహారాన్ని అందించాలని భావించి, కర్నూలు ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశాడు. తల్లి సహాయంతో రాత్రి సమయాల్లో రాగి ఇడ్లి, కొర్ర ఇడ్లి, రాగి దోశ, కొర్ర దోశలను పల్లీ, గోంగూర చట్నీతో అందిస్తున్నాడు. రెండు ఇడ్లీలు రూ.25, దోశ రూ.40 చొప్పున అమ్ముతున్నాడు. వ్యాపారం బాగా జరుగుతోందని, తన ఇద్దరు చెల్లెళ్ల వివాహం కూడా జరిపించినట్లు చంద్రకాంత్ తెలిపారు. పల్లె నుంచి వచ్చి.. అందరూ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా వంటి టిఫిన్లు చేస్తారు కానీ వాటికి భిన్నంగా, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తయారు చేయాలని భావించాడు ఎ. మద్దయ్య. సొంత ఊరు అవుకు. అక్కడ ఊళ్లో పొలం పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. పిల్లల చదువు కోసం 1999లో కర్నూలుకు వచ్చి శ్రీకృష్ణకాలనీలో స్థిరపడ్డాడు. 2020 నుంచి స్థానిక వెంకట రమణ కాలనీలో రోడ్డులో మిల్లెట్స్ ఫుడ్స్ పేరుతో మొబైల్ క్యాంటీన్ కొనసాగిస్తున్నాడు. కొర్ర ఇడ్లీ, కొర్ర నెయ్యి దోశ, కొర్ర పొంగలి, పాలకూర పూరీలను రుచిగా, శుచిగా అందించడం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే వీటికి ప్రజల ఆదరణ లభించింది. వచ్చిన ఆదాయంతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నట్లు మద్దయ్య తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, జీర్ణకోశ సమస్యలు ఉన్న వారికి జీవనశైలి మార్చుకోవాలని, కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉన్న వరి, గోధుమలు, మైదాతో వండి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో చిరుధాన్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొర్రలు, సామలు, ఆరికెలు, ఊదలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాల విక్రయ కేంద్రాలు జిల్లాలో పలు చోట్ల వెలిశాయి. చాలా మంది చిరు ధాన్యాల ఆహారంవైపు మళ్లుతున్నారు. తాము ఈ ఆహారాన్ని వాడటం వల్ల దీర్ఘకాలిక జబ్బులు తగ్గినట్లు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. దీంతో మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు నేను సీడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. కర్నూలులోనే ఉంటూ ఇక్కడి నుంచి ఇతర ఊళ్లకు ప్రతిరోజూ వ్యాపార నిమిత్తం వెళ్తుంటాను. వెంకటరమణ కాలనీలో మిల్లెట్స్ ఫుడ్స్ రుచి చూశాను. ప్రతిరోజూ ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తున్నాను. నా లాంటి వారికి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది. – కేశవరెడ్డి, పులివెందుల, వైఎస్సార్ జిల్లా రాగి దోశ ఇష్టం నాకు రాగి దోశ తినడం ఇష్టం. అందుకే వారంలో కనీసం మూడు, నాలుగు రోజులైనా వచ్చి ఆర్ఎస్ రోడ్డులో టిఫిన్ చేస్తాను. ఇక్కడ దోశలు రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యం కూడా. –భవానీ శివనరేష్, కర్నూలు షుగర్ నియంత్రణలో ఉంటుంది చిరుధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల విరేచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణాశయ సమస్యలు తగ్గిపోతాయి. వరి అన్నం తింటే 45 నిమిషాల్లోనే శరీరంలో గ్లూకోజ్‌గా మారుతుంది. అదే చిరు ధాన్యాలు అయితే 4 నుంచి 5 గంటలు సమయం పడుతుంది. దీని వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒకసారి తింటే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు తగ్గుతారు. చిరుధాన్యాల్లో అన్ని రకాల మైక్రో న్యూట్రిషిన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. – డాక్టర్ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
పేదల ఆకలి తీరుస్తున్న గంభీర్ 'జాన్ రసోయి'
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ 'జాన్ రసోయి' పేరిట క్యాంటీన్ ప్రారంభించి ఒక్క రూపాయికే నాణ్యమైన భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో గాంధీనగర్‌లో జాన్ రసోయి క్యాంటీన్‌ను లాంచ్ చేయగా.. తాజాగా మంగళవారం గంభీర్ తన లోక్‌సభ పరిధిలోని అశోక్ నగర్లో రెండో క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆధ్వర్యంలో గంభీర్ దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. కులం, మతం, లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోశాం. గాంధీనగర్‌లో ప్రారంభించిన జన్ రసోయి మొదటి క్యాంటీన్లో రోజుకు వెయ్యి మంది చొప్పున ఆకలి తీరుస్తుంది. కాగా ఇప్పటివరకు 50వేల మందికి పైగా పేద ప్రజలు జన్ రసోయి క్యాంటీన్లో నాణ్యమైన ఆహారాన్ని పొందడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తామంటూ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించొచ్చు.. పేదల ఆకలి తీర్చే విషయంలో రాజకీయం చేయకూడదనే జాన్ రసోయి క్యాంటీన్లకు శంకుస్థాపన చేశాం.అంటూ తెలిపాడు. కేవలం రూపాయికే భోజనం అందిస్తున్న జాన్ రసోయి క్యాంటీన్లో భోజనంలోకి బియ్యం, కాయధాన్యాలు, కూరగాయలు ఇవ్వనున్నారు. కాగా ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌తోపాటు తన వ్యక్తిగత వనరుల నుంచి నిధులు సమకూరుస్తున్నారు. -
అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్మీ క్యాంటీన్లలో దిగుమతి చేసుకున్న వస్తువులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనడం మానేయాలని దేశంలోని 4000 ఆర్మీ క్యాంటీన్లకు ఆదేశాలిచ్చినట్టు తాజా నివేదికల సమాచారం. అంతేకాదు ఆర్మీ క్యాంటిన్లలో ఇకమీదట విదేశీ మద్యం అమ్మకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ 19న అంతర్గత ఉత్తర్వులు జారీ అయినట్టు తెలుస్తోంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనం ప్రకారం, ఫ్రెంచ్ కంపెనీ పెర్నోడ్ రిచర్డ్, యూకే కంపెనీ డియాజియోకు చెందిన స్కాచ్ లాంటి విదేశీ మద్యం అమ్మకాలను నిలిపివేయనుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే విదేశీ బ్రాండ్ల కోసం ఆర్డర్లను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే, జూలై నెలల్లో ఈ అంశంపై సైన్యం, వైమానిక, నావికాదళంతో చర్చల అనంతరం, దేశ వస్తువులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఏ ఉత్పత్తులను నిలిపివేయాలో ఆర్డర్ నిర్దిష్టంగా పేర్కొనలేదనీ అయితే, విదేశీ మద్యం కూడా జాబితాలో ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి డియోజియో, పెర్నోడ్ ప్రతినిధులు తిరస్కరించారు. దీనికి సంబంధించి క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు డిఫెన్స్ స్టోర్లలో దిగుమతి చేసుకున్న మద్యం అమ్మకాలు వార్షిక అమ్మకాలలో కేవలం 17 మిలియన్ డాలర్లు మాత్రమేనని, ఈ బ్రాండ్లపై బ్యాన్ విధించినా కూడా కలిగే నష్టం ఏమీ లేదని, స్టాక్ చాలా తక్కువగానే ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనుకునే ప్రభుత్వం ఆలోచనకు తాజా ఆర్డర్ ప్రతికూల సంకేతాన్ని పంపుతుందన్నారు. కాగా దేశవ్యాప్తంగా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ దాదాపు 5,000 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిద్వారా మద్యం సహా ఎలక్ట్రానిక్స్, ఇతర నిత్యావసర వస్తువులను సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు రాయితీ ధరలకు విక్రయిస్తుంది. 2 బిలియన్ డాలర్లకు పైగా వార్షిక అమ్మకాలతో, భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్స్ లో ఒకటిగా క్యాంటీన్ స్టోర్స్ ఉన్నాయి. -
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న కేంద్రం
సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’) ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫిగర్ షర్ట్స్, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్లలో చేర్చిన సదరు సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు. ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. -
లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం
బెర్హంపూర్: దేశమంతా నిర్బంధంలో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒడిశాలో కామాంధుల బారిన పడి ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మల్కాన్‌గిరి పోలీస్ క్యాంటీన్లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలు మంగళవారం బెర్హంపూర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కన్నుమూసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుర్తుతెలియని దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది? పోలీసుల నివేదిక ప్రకారం... బాధితురాలు అనారోగ్యం పాలైందని మే 7న బాధితురాలి భర్తకు పోలీస్ క్యాంటీన్ ఇన్చార్జి సమాచారం ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. తన భార్య శరీరంపై గాయాలను గుర్తించిన బాధితురాలి భర్త మే 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని అతడు ఆరోపించాడు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను బెర్హంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె చనిపోయింది. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు మల్కాన్‌గిరి మోడల్ పోలీస్‌స్టేషన్ సీఐ రాంప్రసాద్ నాగ్ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేస్తుందని, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మల్కాన్‌గిరి ఏఎస్పీ అన్నారు. జూన్ 9లోగా నివేదిక ఇవ్వండి: ఓహెచ్‌ఆర్‌సీ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి జూన్ 9లోగా నివేదిక సమర్పించాలని మల్కాన్‌గిరి ఎస్పీని ఒడిశా మానవ హక్కుల సంఘం(ఓహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. సామాజిక కార్యకర్త నమ్రతా చాద్దా ఫిర్యాదుతో ఓహెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ నేరంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని మల్కాన్‌గిరి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి అన్ని రకాల చికిత్సలు అందేలా చూడాలని, వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఇంతకుముందు ఓహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రోజు కూలీ అయిన బాధితురాలి భర్తకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని నమ్రత తన పిటిషన్లో కోరారు. పోలీసులపైనే అనుమానం సాక్షాత్తు పోలీస్ క్యాంటీన్లోనే మహిళపై అఘాయిత్యం జరగడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీస్ క్యాంటీన్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారు? అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవని అడుగుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీస్ క్యాంటీన్ సంరక్షకులు ఏమి చేస్తున్నారు? పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (రైలు దిగగానే.. ‘ముద్ర’ పడింది!) -
‘ఆనంద్జీ.. అరిటాకు ఐడియా అదిరింది’
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ నేపథ్యంలో చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోకుండా పలువురు తమకు తోచిన ఆలోచనలతో ముందుకెళుతున్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తమ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ క్యాంటిన్లలో ప్లేట్లకు బదులు అరిటాకులను వడ్డిస్తున్నారని చేసిన ట్వీట్ పలువురిని ఆలోచనలో పడవేసింది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో అరటి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిటైర్డ్ జర్నలిస్టు పద్మా రామ్‌నాథ్ తనకు ఈమెయిల్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ సూచనతో తమ ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే ప్లేట్ల స్ధానంలో క్యాంటిన్లలో అరిటాకుల్లో భోజనం వడ్డించడం ప్రారంభించారని మహీంద్ర ఆ ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ను కేవలం గంట వ్యవధిలోనే 13,000 మందికి పైగా లైక్ చేశారు. చిన్న వ్యాపారాలకు సాయపడే ఆనంద్ మహీంద్రా సేవా తత్పరతను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. -
‘సుప్రీం’ కాంప్లెక్స్‌లోకి సందర్శకులకు నో
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరిన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. న్యాయస్థానం ఆవరణలోకి ప్రతి శనివారం సందర్శకులకు బృందాలుగా ఇచ్చే అనుమతులను రద్దు చేసింది. కోర్టు క్యాంటీన్, కెఫేలను మూసివేయాలని ఆదివారం ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన మొత్తం 15 ధర్మాసనాలకు గాను 6 మాత్రమే పనిచేస్తాయని, 12 అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘çకోర్టు ఆవరణలోకి సాధారణ సందర్శకులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. లాయర్లు, కోర్టు సిబ్బంది, చిరు వ్యాపారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆవరణ విడిచి బయటకు వెళ్లిపోవాలి. 6 గంటలకల్లా కోర్టులోని విశ్రాంతి గదులు, కారిడార్లు, మెట్లు తదితరాలను శుభ్రం చేయాలి. లాయర్లు, కక్షిదారులు, గుమాస్తాలు ఆవరణలో గుమి కూడరాదని, విధులు ముగిసిన తక్షణమే వెళ్లిపోవాలి’అని ఆదేశించింది. -
నిమ్స్‌లో పేరుకే డైట్ క్యాంటీన్..
లక్డీకాపూల్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్ ఆస్పత్రిలో అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. దీంతో పేదరోగులు విలవిల్లాడిపోతున్నారు. మెరుగైన వైద్య సేవలను పొందేందుకు వచ్చే రోగులను వ్యాపారస్తులు అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శ వ్యక్తమవుతోంది. చివరికి యాజమాన్యాన్ని కూడా మోసం చేస్తున్నారనే వ్యాఖ్య కూడా లేకపోలేదు. కేవలం ఆహార పదార్థాల విషయంలోనే కాదూ.. మందుల సరఫరాలో కూడా అదే తీరు కొనసాగుతోంది. జనరిక్ మెడిసిన్స్ అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల మందులను విక్రయిస్తున్నారు. మీకు అనుమతి దేనికిచ్చారు..? ఈ పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌లోని క్యాంటీన్ల నిర్వాహకులపై ఆస్పత్రి సంచాలకుడు డాక్టర్ కె.మనోహర్ కన్నెర చేసినట్టు సమాచారం. అసలు మీకు దేనికోసం అనుమతి ఇచ్చారు.. మీరు చేస్తున్న వ్యాపారమేంటని నిలదీసినట్లు తెలుస్తోంది.కేవలం టీ స్టాల్ నిర్వహించేందుకు అనుమతి పొంది దాదాపుగా 400 గజాల స్థలాన్ని ఎలా విస్తరిస్తావని ఓ క్యాంటీన్ నిర్వాహకుడిని ప్రశ్నించినట్టు విశ్వనీయ సమాచారం. నిజం చెప్పాలంటే నిమ్స్ నిబంధనల ప్రకారం లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా రెస్టారెంట్లను తలపించే విధంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని ప్రక్షాళన చేసేందుకు యాజమాన్యం నడుంబిగించినట్లు తెలుస్తోంది. పేరుకే డైట్ క్యాంటీన్.. నిమ్స్‌లో పేరుకే డైట్ క్యాంటీన్.. వ్యాపారమంతా నిబంధనలకు వ్యతిరేకమే. రోగులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం లాభాపేక్షతో ఫాస్ట్‌ఫుట్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ రోగులకు అందించే ఆహార పదార్థాలతో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రోగుల సహాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్స్ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు నిమ్స్ డైరెక్టర్ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. -
అసెంబ్లీ క్యాంటీన్లో వెజ్‌లో చికెన్ ముక్కలు
ముంబై: సాక్షాత్తూ మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో వేజ్‌టేరియన్ వంటకంలో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీనిపై శాసనసభ్యుల్లో కలకలం రేగింది. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. వేజ్లో చికెన్ ముక్కలు వచ్చిన ఘటనపై విచారణ జరుపుతామని ఆయన సభకు హామీ ఇచ్చారు. ఎన్సీపీ సభ్యుడు అజిత్ పవార్ ఈ ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఫడణవీస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసెంబ్లీ క్యాంటీన్లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచీశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం విచారిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. గత బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్లో ‘మట్కీ ఉసాల్’ అనే వేజటేరియన్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. కానీ, ఆయన తింటున్నప్పుడు చికెన్ ముక్కలు దర్శనిమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని విధానసభ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
కరీమ్ భాయ్ చాయ్
ప్రతి ఊరిలోను ఎన్నో కొన్ని కాకా హోటళ్లు ఉంటాయి. అలాగే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చే హోటళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అబ్దుల్ కుటుంబీకులకు చెందిన హోటల్స్‌కు అటువంటి ప్రత్యేకత ఉంది. అబ్దుల్ కరీం పేరు చెబితే పంటి కింద కరకరలాడే శబ్దాలు చేసే చేకోడీలు, ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ తాగే టీలు గుర్తుకు వస్తాయి. ఆయన సోదరులైన అబ్దుల్ మునీర్ పేరుచెబితే నోటికి ఘాటుగా తగిలే మిరపకాయ బజ్జీల ఘుమఘుమలు అటుగా అడుగులు వేయిస్తాయి. ప్రస్తుతం మునీర్, ఇక్బాల్ సోదరులు నడిపిన హోటల్స్ లేకపోయినా, కరీమ్ చేగోడీ సెంటర్ మాత్రం దిగ్విజయంగా నడుస్తోంది. బియ్యప్పిండి, నువ్వులతో తయారు చేసే కరకరలాడే పల్చని గారెల వంటి పదార్థాన్ని కరీమ్ భాయ్ చేకోడీ అంటారు. ఈ వంటకం కరీమ్ ప్రత్యేకత. ధర్మపురి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం కరీమ్ని పలకరించకుండా ఉండలేరు. ఆయన చేకోడీల మహిమ అలాంటిది. గత 60 సంవత్సరాలుగా ధర్మపురిలో కరీమ్ చేకోడీలతోపాటు అటుకులు, గుడాలు కూడా అందిస్తున్నారు. ఆయన చేతిలో ఏం మహత్యం ఉందో గాని, అక్కడకు వచ్చినవారు ఆయన చేతి టీ తాగకుండా ఉండలేరు. కరీమ్ బ్రాండ్‌గా..! ధర్మపురిలో చేకోడీలంటే కరీమ్ చేకోడీలే అనేంత గుర్తింపు పొందారు. కరీమ్ మరణించినా, హోటల్ రూపు మారిపోయినా కరీమ్ చేకోడీలంటే అందరూ గుర్తుపడతారు. ప్రస్తుతం ఆయన మనమడు (కూతురు జహీదా కుమారుడు) అస్లాం ఈ హోటల్‌ను నడుపుతున్నారు. టీ మినహా మిగతా తినుబండారాలను ఇప్పటికీ ఇంటి దగ్గర తయారుచేసి అంగడికి తీసుకువస్తారు. ఆరు దశాబ్దాలుగా ఈ హోటల్లో దొరికే చేకోడీలు అదే రుచితో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దేశవిదేశాలలో స్థిరపడ్డ ఈ పట్టణ వాసులు ఇప్పటికీ ధర్మపురి వస్తే కరీమ్ చేకోడీ తినకుండా వెళ్లరు. స్వస్థలానికి వచ్చిన వారందరికీ ఈ స్టాల్ ఒక మీటింగ్ పాయింట్. మిత్రులతో కలిసి బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఇక్కడ టీ తాగి, చేకోడీలు తిని వెళ్తారు. కరీం చేకోడీ, టీ, అటుకులు, గుడాలు తినేందుకు ఈ హోటల్‌కు రాకుండా వెనక్కు వెళ్లరు. అదే తీరు... ధర్మపురి నడిబొడ్డున ఉన్న ఈ హోటల్‌ను ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఒక బల్ల మీద 60 ఏళ్ల కిందట ప్రారంభించారు. 2007లో అబ్దుల్ కరీమ్ మరణించారు. దీంతో కరీమ్ రెండవ కుమారుడు నయీమ్... తన తండ్రి హోటల్‌ను కొనసాగించారు. నయీమ్ అనంతరం అస్లాం 12 సంవత్సరాలుగా ఈ హోటల్‌ను నడుపుతూ, సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. తమ వంటకాలలో దహీ వడను చేర్చారు అస్లాం. ఇక్కడి దహీ వడ కొద్దిగా కారంగా ఉండటం వీరి ప్రత్యేకత.హోటల్‌పై థియేటర్ ప్రభావం...గతంలో థియేటర్ నడిచిన సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం నుంచి రాత్రి ఇలా రెండు పూటలు నడిచేది. ప్రస్తుతం కొద్దిగా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అదే గుర్తింపు ధర్మపురి ప్రజల్లో ఉంది. ఈ హోటల్లో టీ కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి స్వయంగా పాలు తీసుకు వచ్చేవారు. ప్రస్తుతం ప్యాకెట్ పాలను కూడా వాడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే టీ పొడిని వాడటం వీరి ప్రత్యేకత. ఆనందంగా ఉంటుంది ... మా క్యాంటీన్‌కి ఎక్కువగా యువకులు వçస్తూంటారు. ఈ గ్రామంలో చదువుకుని పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులకు తల్లిదండ్రులను చూడటానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మా దగ్గరకు వచ్చి, మా చేకోడీ తిని, టీ తాగి వెళ్తూంటారు. ఒకరితో ఒకరు వారు పంచుకునే అనుభవాలను నేను ఆనందంగా వింటుంటాను. -
నాణ్యత డొల్ల.. ఆరోగ్యం గుల్ల
కంపుకొట్టే శనగపిండి.. నాసిరకం బియ్యం, కారం, నూనెల్లో లోపించిన నాణ్యత.. డైట్ క్యాంటీన్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం.. ఇవి విజయవాడ సర్వజనాస్పత్రిలో విజిలెన్స్, ఫుడ్‌కంట్రోల్ అధికారుల తనిఖీల్లో కనిపించిన దృశ్యాలు. రోగులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులతో అధికారులు మంగళవారం సాయంత్రం ఆస్పత్రిలోని డైట్ క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పెట్టే ఆహారంలో నాణ్యత లోపించింది. సుద్దయిన అన్నం.. నీళ్ల చారు, మజ్జిక రోగులకు అందిస్తుండటంపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విజిలెన్స్ ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో జిల్లా ఆహార నియంత్రణ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు ఆహారం తయారు చేసే డైట్ క్యాంటీన్లోని పలు పదార్థాలను పరిశీలించడంతో పాటు, వాటిని తయారు చేసే వస్తువుల నాణ్యతపై సైతం పరిశీలించారు. శాంపిళ్లను సేకరించారు. అంతేకాక క్యాంటీన్లో 20 కేజీల రేషన్ బియ్యం ఉండటాన్ని సైతం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వంటకు వాడే ఉప్పు, కారం.. నూనె, చింతపండులతో పాటు, బియ్యం శాంపిళ్లను సేకరించి, ఆస్పత్రి డైటీషియన్ నుంచి విజిలెన్స్ అధికారులు లేఖను తీసుకున్నారు. లోపాల పుట్ట.. జబ్బు చేసి చికిత్స కోసం వచ్చిన రోగులకు పెట్టే ఆహారంలో అనేక లోపాలు ఉన్నట్లు విజిలెన్స్, ఆహార నియంత్రణ అధికారులు గుర్తించారు. కంపుకొట్టే శసన పిండి, బూజు పట్టిన మినపగుళ్లతో పాటు, నాసిరకం కారం, నూనెలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డైట్ క్యాంటీన్లో రేషన్ బియ్యం సైతం 20 కేజీలు వాడటాన్ని గుర్తించారు. ఆహారం తయారు చేసేందుకు ఆర్ఓ వాటర్ వాడాల్సి ఉండగా, బోరు వాటర్ వాడటాన్ని గుర్తించారు. అంతేకాకుండా రోగులకు ఆహారం తయారు చేసే క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తయారు చేసేందుకు వాడే బియ్యం, ఉప్పు, కారం, నూనెల శాంపిళ్లను సేకరించారు. ఫుడ్ కంట్రోల్ సర్టిఫికెట్టే లేదు.. వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఆహారం పెట్టే కాంట్రాక్టర్‌కు ఫుడ్‌కంట్రోల్ సర్టిఫికెట్ సైతం లేదని విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. అసలు ఈ సర్టిఫికెట్ లేకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ పట్టించి సన్నబియ్యంగా వాడుతున్నారని నిర్థారణకు వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు క్యాంటీన్‌ను సైతం అధికారులు తనిఖీలు చేయగా, అక్కడ కూడా ఆహార పదార్థాలు నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఈ తనిఖీలో జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, ఎడీఏ కళ్యాణ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్స్ అన్సారీ, నాగభూషణంలు పాల్గొన్నారు. కాంట్రాక్టరుకునోటీసులు ఇస్తాం.. ప్రభుత్వాస్పత్రిలో డైట్ కాంట్రాక్టరు నిర్వహించేందుకు ఫుడ్ కంట్రోల్‌శాఖ నుంచి సర్టిఫికెట్ లేదు. దీనిపై నోటీసులు జారీ చేస్తాం. మజ్జిగ, సాంబారు నాసిరకంగా ఉండటంతో పాటు, సుద్ద అన్నం పెడుతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో తనిఖీలు నిర్వహించాం. బోరు నీటితో వంట చేయడంతో పాటు, అనేక లోపాలు గుర్తించి శ్యాంపిళ్లను సేకరించాం.– నూతలపాటి పూర్ణచంద్రరావు, విజిలెన్స్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్