
ముంబై: సాక్షాత్తూ మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌లో వేజ్‌టేరియన్ వంటకంలో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. దీనిపై శాసనసభ్యుల్లో కలకలం రేగింది. దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. వేజ్‌లో చికెన్ ముక్కలు వచ్చిన ఘటనపై విచారణ జరుపుతామని ఆయన సభకు హామీ ఇచ్చారు.
ఎన్సీపీ సభ్యుడు అజిత్ పవార్ ఈ ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు ఫడణవీస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసెంబ్లీ క్యాంటీన్‌లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచీశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం విచారిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం తెలిపారు. గత బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్‌లో ‘మట్కీ ఉసాల్’ అనే వేజటేరియన్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. కానీ, ఆయన తింటున్నప్పుడు చికెన్ ముక్కలు దర్శనిమిచ్చాయి. దీంతో బిత్తరపోయిన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని విధానసభ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.