Impressive Mobile Canteens - Sakshi
Sakshi News home page

మొబైల్ ఘుమఘుమలు

Published Thu, Jul 27 2023 4:34 AM | Last Updated on Thu, Jul 27 2023 8:18 PM

Impressive mobile canteens - Sakshi

ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు.        – సాక్షి, కర్నూలు డెస్క్‌ 

డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్‌ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్‌ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్‌ బంకు, నంద్యాల చెక్‌పోస్టు, రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్‌ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి.

ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్‌ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్‌ క్యాంటీన్‌ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్‌కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్‌ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది.

ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్‌ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్‌ టేబుల్‌ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్‌ ఇవ్వకపోతే వెయిటర్‌ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్‌ క్యాంటీన్ల వద్ద టిఫిన్‌ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్‌ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్‌ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. 

రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం 
నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్‌ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్‌ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు.

ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్‌ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. 

వంట మాస్టర్లకు గిరాకీ 
హోటల్‌ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్‌ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని మొబైల్‌ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. 

వ్యాపారానికి అనువుగా వాహనాలు 
మొబైల్‌ క్యాంటీన్‌ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్‌ క్యాంటీన్‌గా అదనపు డబ్బుతో  తీర్చిద్దుకుంటున్నారు. 

ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్‌పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్‌ క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇతను హుస్సేన్‌రెడ్డి. దూరదర్శన్‌ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్‌ క్యాంటీన్‌ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్‌ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు.

తక్కువ ధరలో అల్పాహారం 
నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్‌ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు.  – వెంకటేశ్వర్లు, మెడికల్‌ రెప్, కర్నూలు 

కళ్లెదుటే వేడివేడిగా.. 
మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి.  నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్‌ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్‌వలి, నంద్యాల 

చాలా రుచిగా ఉంటాయి 
నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్‌ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్‌ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ.  – రాజశేఖర్, దూపాడు, కర్నూలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement