సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారం అందించడం, బడిపై పిల్లల్లో ఆసక్తి పెంచడం లక్ష్యంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ‘ముఖ్యమంత్రి ఉపాహార పథకం’పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా.. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ ఉపాహార పథకం మ రింత దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
బడి మానేసే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే పిల్లలకు కావాల్సిన ఆహారం విషయమై తామిక ఎలాంటి హడావుడి పడాల్సిన అవసరం ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు. రోజుకో రకం అల్పాహారం అందిస్తుండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, క్రమం తప్పకుండా బడికి రావడం వల్ల చదువుల్లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆరోగ్యం, ప్రమాణాల పెంపే లక్ష్యంగా..
ముఖ్యమంత్రి ఉపాహారం పథకం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 1–10 తరగతులు చదివే విద్యార్థులు 23,05,801 మంది ఉన్నారు. వీళ్ళంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళూ ఎక్కువ మందే ఉన్నారు. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సైతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే హడావుడిగా తమ పనులకు వెళ్ళడం వల్ల స్కూలుకెళ్లే పిల్లలను పట్టించుకోవడం కష్టంగానే ఉంటోంది. చాలామంది పిల్లలు ఉదయం పూట ఆహారం తీసుకోకుండానే స్కూలుకు వెళ్ళాల్సి వస్తోంది.
మధ్యాహ్నం భోజనం అందిస్తున్నా ఈలోగా తరగతి గదిలో నీరసపడిపోతున్న ఘటనలూ ఉంటున్నాయి. మరోవైపు సరైన పౌష్టికాహార లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్ర విద్యా, ఆరోగ్యశాఖలు జరిపిన సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఎక్కువ మందిని పౌష్టికాహార లోపం వెంటాడుతోందని తేలింది. దీనివల్ల రక్తహీనత, దృష్టి లోపం ఏర్పడుతున్నట్టు గుర్తించారు.
ఈ పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఉపాహారం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పదో తరగతికి చేరే నాటికే బడి మానేస్తున్న వారి శాతం 13.9గా ఉంటోంది. పేదరికం, సరైన ఆహారం అందే పరిస్థితి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఉపాహారం అందుబాటులోకి తేవడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎం సార్.. బ్రేక్‌ఫాస్ట్ సూపర్
ఈ రోజు మా స్కూల్లో ఇచ్చిన ఇడ్లీ, పూరీ, కిచిడీ, చట్నీ, సాంబార్ చాలా బాగున్నాయి. ఆరు రోజుల పాటు రకరకాల బ్రేక్ ఫాస్ట్ ఇస్తారట. మా కోసం మంచి పథకం తీసుకొచ్చి న సీఎం సార్‌కు కృతజ్ఞతలు. – హైమావతి, ఏడో తరగతి, రావిర్యాల ప్రభుత్వ పాఠశాల (రంగారెడ్డి జిల్లా)
ఇంట్లో సమస్య తీరిపోతుంది
ఉదయం పిల్లలు తినీతినకుండానే హడావుడిగా బడికి వెళ్తారు. ఇప్పుడు ప్రభు త్వం ఉపాహారం అందిస్తుండటంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇంట్లో తినకుండా మారం చేసేవాళ్లు కూడా అక్కడే బుద్ధిగా తింటారు. మధ్యాహ్న భోజన పథకం మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నిరంతరం కొనసాగించాలి. – గుడిమల్ల రాజేష్, విద్యార్థి తండ్రి, భూపాలపల్లి
ఈ పథకం ఎంతో ఉపయోగకరం
మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు అధిక శాతం పని చేసుకుంటూ జీవించేవారే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థినులు అందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందుతుంది. ఇకపై ఎవరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా క్లాసులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. – మోహనాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మారేడుపల్లి
Comments
Please login to add a commentAdd a comment