కుషాయిగూడ(హైదరాబాద్): ప్రతిరోజూ వేలాదిమంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే ఓ ప్రసిద్ధ కంపెనీ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పాముపిల్ల బయటపడింది. ఈ ఘటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలిపోయారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్‌లో వండిన ఆహారపదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్రతిరోజూ తరలిస్తుంటారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పుచారులో నుంచి ఓ పాముపిల్ల బయటపడింది.
అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. భోజనాల అనంతరం విషయం తెలుసుకుని ఉద్యోగులు భయకంపితులయ్యారు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత క్యాంటీన్ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో కూడా ఈ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పలుమార్లు ఎలుకలు, బీడీలు, సిగరెట్లు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ నిర్లక్ష్యంపై స్పందించి, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment