పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్‌లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి బుధవారం ప్రారంభించారు.
నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.
ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు.
నీరా వంటకాలు సైతం..
క్యాంటీన్‌లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్‌క్రీం, తాటి ముంజ ఐస్‌క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment